Capital formation
-
రాజధాని రైతులకు అన్యాయం చేయం: చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు రాజధానిలో తొలి ప్రాధాన్యత ఇస్తామని, వారికి అన్యాయం జరగదని ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు చెప్పారు. భూ సమీకరణ కోసం దేశంలో ఎక్కడా ఇవ్వని మంచి ప్యాకేజీని ఇచ్చానన్నారు. భూములిచ్చిన రైతులకు తిరిగి వాటాలను లాటరీ పద్ధతిలో ఇస్తామని, ఇందులోనూ ఎవరికీ అన్యా యం జరగదని చెప్పారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యం లో తుళ్లూరు ప్రాంతం నుంచి వచ్చిన భూ సమీకరణ అనుకూల రైతులు సోమవారం విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన్ను సత్కరించారు. చంద్రబాబు వారినుద్దేశించి మాట్లాడుతూ రాజధాని కట్టుకోకపోతే ముందుకెళ్లే పరిస్థితి లేదని, అలాగని అటవీ, ప్రభుత్వ భూములున్న చోట కడితే అభివృద్ధి ఉండదని చెప్పారు. అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేశామని, ఈ సమయంలో తన ప్రకటనను అడ్డుకోవాలని కొందరు చూశారని ఆరోపించారు. కట్టబోయే రాజధానిని వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకోవాలని, తేడా వస్తే భావితరాలు తమను క్షమించవని చెప్పారు. తుళ్లూరు ప్రాంతంలో చదువుకున్న వారు ఇప్పుడు ఉద్యోగాల కోసం అమెరికా ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని, రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఉద్యోగాల కోసం తుళ్లూరు వస్తారని చెప్పారు. చరిత్రలో మొదటిస్థానం ఈ రైతులకే.. తాను ఏ పని చేసినా కొందరు అడ్డుపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. కొందరు నేతలు తాము ఇక్కడకు వస్తానని చెబుతున్నారని, ఆయన వచ్చి రెచ్చగొడతారని అన్నారు. రాజధాని గురించి చరిత్ర రాస్తే అందులో మొదటి స్థానం భూములిచ్చిన రైతులకే ఉంటుందన్నారు. ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు.. ఉదయం విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో కలియ తిరిగిన సీఎం పాత ప్రభుత్వాస్పత్రిలో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి వార్డులో ఆడ బిడ్డ పుడితే రూ.300, మగ బిడ్డ పుడితే రూ.500 లంచం తీసుకుంటున్నారని కొందరు మహిళలు ఆయనకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వైద్యులను పిలిపించి మీ ఆడవాళ్ల దగ్గరా ఇలాగే చేస్తారా, తమాషా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
దశ తిరిగింది
విజయవాడ, గుంటూరుల్లో రియల్ బూమ్ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున కృష్ణమ్మ చెంత విజయవాడ నగర పరిసరాల్లో రాజధాని ఏర్పాటు కానుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన సభలో ప్రకటించడంతో ప్రస్తుతం అందరి దృష్టి విజయవాడ, గుంటూరులపైనే పడింది. వర్తక, వాణిజ్య, పర్యాటక, పారిశ్రామిక రంగాల నుంచి రాజకీయ నాయకులు, సామాన్యుల వరకు అందరూ బెజవాడను రాజధానిగా స్వాగతిస్తున్నారు. కృష్ణా జిల్లాలో విజయవాడ, కంకిపాడు, గన్నవరం, నూజివీడు, మైలవరం, కంచికచర్ల, నందిగామ, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో.. గుంటూరు జిల్లాలో తాడేపల్లి, మంగళగిరి, కాజ, పెదకాకాని, గుంటూరు, చిలకలూరిపేట, పేరేచర్ల, అమరావతి, తాడికొండ, తుళ్లూరుల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. స్థిరాస్తి జోరు.. విజయవాడ మీదుగా రెండు జాతీయ రహదారులు, అతిపెద్ద రైల్వే జంక్షన్, అంతర్జాతీయ స్థాయికి అభివృద్ది చెందనున్న విమానాశ్రయం, అధునాతన స్టార్ హోటల్స్, విద్యా, వైద్య సంస్థలు తదితర వసతులున్నాయి. బందర్ రోడ్డు విస్తరణ, దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్, విజయవాడ-గుంటూరు మధ్య రెండు బైపాస్ రోడ్ల నిర్మాణాల ప్రతిపాదనలతో నగరం అభివృద్ధిపథం దూసుకుపోతోంది. బంజారాహిల్స్‌ను తలపిస్తున్న బందర్ రోడ్డు.. బందర్‌రోడ్డులో స్థిరాస్తి ధరలు హైదరాబాద్‌లో బంజారాహిల్స్ ప్రాంతాన్ని తలపిస్తోంది. విజయవాడ-బందరు మధ్య 60 కి.మీ. మార్గం విస్తరణ ప్రతిపాదనలతో రియల్‌లో దూకుడు మొదలైంది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు అభివృద్ధి శరవేగంతో జరుగుతోంది. విజయవాడ నుంచి కంకిపాడు వరకు బందర్రోడ్డుకిరువైపులా వెంచర్లు వెలిశాయి. దూకుడు మీదున్న ఏలూరు రోడ్డు విజయవాడ నుంచి ఏలూరు వైపుకు వెళ్లే రోడ్డులో స్థిరాస్తి వ్యాపారం దూసుకుపోతోంది. ఈ మార్గంలో అనేక కార్ల కంపెనీలు ఏర్పాటయ్యాయి. రామవరప్పాడు రింగ్ సెంటర్ నుంచి గన్నవరం వరకు మార్గమధ్యం నగరంలో కలిసిపోయింది. ఈ మార్గంలో హనుమాన్ జంక్షన్ వరకు రియల్ ఏస్టేట్ సంస్థలు తమ వ్యాపారాన్ని ముమ్మరంగా చేస్తున్నాయి. గన్నవరంలో ఎయిర్‌పోర్టు దానికి దగ్గర్లో ఐటీ పార్కు వుండటంతో ఆ ప్రాంతంలో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. విజయవాడ-గుంటూరు రూట్లో.. విజయవాడ-గుంటూరు రూట్లో ఆరులైన్ల జాతీయ రహదారి అభివృద్ధి చెందటంతో ఈ ప్రాంతంలో సొంత ఇంటి నిర్మాణానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ రూట్లో కూడా చిన్న పట్టణాలు అభివృద్ధి చెందాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వరకు జాతీయ రహదారికి ఇరువైపులా వందలాది ఎకరాల్లో వెంచర్లు వెలిశాయి. ఉడా నిబంధనలే.. మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో వుండే విధంగా స్థిరాస్తి వెంచర్లు వేస్తున్నారు. వీజీటీఎం ఉడా నిబంధనలకు అనుగుణంగా 40 అడుగుల రోడ్లతో, వెంచర్ల చుట్టూ ప్రహరీ, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలతో వెంచర్లు మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో వుండే విధంగా స్థిరాస్తి వెంచర్లు వేస్తున్నారు. 100 శాతం వాస్తుతో ఉడా లే అవుట్ నిబంధనలకు అనుగుణంగా పార్కులు, కామన్ సైట్లు విడిచిపెట్టటంతో ఆయా వెంచర్ల వివరాలు తెలుసుకుని కొనుగోలు చేసుకుంటున్నారు. కొన్ని సంస్థలు బ్యాంకు రుణ సదుపాయం కూడా అందిస్తున్నాయి. బ్యాంకర్లు కూడా ప్లాట్లు కొనుగోలుదారులకు రుణాలు విరివిగా ఇస్తున్నారు. విజయవాడలో చుక్కల్లో ధరలు.. రాజధానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు విజయవాడ, పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు కానుండటంతో ఫ్లాట్లు, ప్లాట్ల ధరలు అమాంతం పెరిగాయి. విజయవాడలో ప్రస్తుతం 1,200 చ.అ. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాటు ధర రూ.60 లక్షలకు పైగానే పలుకుతోంది. కంకిపాడు, గన్నవరం, గొల్లపూడి ప్రాంతాల్లో గజం స్థలం ధర రూ.10 వేలకు పైగానే ఉంది. గన్నవరం విమానాశ్రయ విస్తరణ, అక్కడికి సమీపంలోని మేథ ప్రాంగణంలోకి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం ఎక్కువగా సాగడంతో గన్నవరం పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఆటోనగర్, గొల్లపూడి, మైలవరం, గన్నవరం తదితర ప్రాంతాల్లో చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. దాదాపు 500 సంస్ధలు సేల్స్‌టాక్సు కార్యాలయాల్లో తమ కంపెనీల పేర్లను నమోదు చేసుకున్నాయి. భారీ పరిశ్రమలు తమకార్పొరేట్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రైవేట్ బిల్డింగ్‌ల అన్వేషణలో ఉన్నాయి. గన్నవరం, నూజివీడు, ఆగిరిపల్లి, ఇబ్రహీంపట్నం, మైలవరం తదితర ప్రాంతాల్లోని భూముల కొనుగోలుకు రియల్టర్లు బారులు తీరుతున్నారు. -
గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని...
దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లుగా విడిపోయిన నేపథ్యంలో, విభ జన.. అనేక సంక్లిష్ట రాజకీయ పరిస్థితు లను తీసుకువచ్చింది. సీమాంధ్రలో రాజ ధాని ఏర్పాటుపై కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీకి రాయలసీమకు సంబంధించిన చారిత్రక వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, సీమాంధ్ర ఒక రాష్ట్రంగా కొనసాగటం అని వార్యమైంది. ఈ ప్రాంతానికి రాజధానిని నిర్ణయించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సందర్భంగా గతంలో శ్రీ కృష్ణ కమిషన్.. ‘రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు తెలంగాణ, కోస్తాంధ్రలో ఉండవచ్చు కాని, ఒక ప్రాంతంగా రాయలసీమ మొత్తంగా వెనుకబడి ఉంది..’ అని పేర్కొనడం గుర్తుంచుకోవాలి. అందుకే అయి దున్నర దశాబ్దాల పైబడిన తర్వాత కూడా వెనుకబాటు తనం నుంచి బయటపడని రాయలసీమలో రాజధానిని నిర్మిం చడం ఈ ప్రాంత మనుగడకు తప్పనిసరి. 1953లో రాయలసీమలో రాజధానిని ఏర్పర్చాక మూడేళ్లలోనే రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చినప్పుడు గ్రేటర్ రాయలసీమ వాసులు విశాల దృక్ప థంతో అంగీకరించారు. ప్రస్తుతం రాష్ట్రం రెండుగా విడిపో యింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి. దక్షిణ భారత దేశంలోనే రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. నీటిపారుదల సౌకర్యాలు, పరిశ్రమలు, రాజధాని ఏర్పాటు ద్వారానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. గతంలో గ్రేటర్ రాయలసీమ అభివృద్ధికి మద్రాసు ప్రెసిడెన్సీలో చేపట్టిన మెకంజీ పథకం, 1951 కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టు, సిద్ధేశ్వరం ప్రాజెక్టు, ఖోస్లా కమిటీ ఈ ప్రాంతంలో సాగునీటి కోసం ప్రతిపాదించిన అనేక విలువైన పథకాలు నేటికీ ఆచరణకు సాధ్యం కాలేదు. తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, వెలిగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా, గాలేరు నగరితోపాటు కేసీ కెనాల్ ఆధునీకరణ పనులు కూడా నేటికీ పరిపూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ రాయలసీమవాసులు (ప్రకాశం జిల్లాలో నేడు కొనసాగు తున్న గిద్దలూరు, కంబం, మార్కాపురం, పొదిలి, దర్శి, కనిగిరి, కందుకూరు, నెల్లూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలు) రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కోరుకోవడం సమంజసమే. పైగా మార్కాపురం రెవెన్యూ డివిజన్ ప్రాంతం లోని దొనకొండ వద్ద దాదాపు 50 వేల ఎకరాల భూమి ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇది నూతన రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. కాబట్టి సారవంతమైన భూమిని వృథా చేయనవసరం లేదు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇక్కడ విమానా శ్రయం నిర్మించతలపెట్టారు. కాబట్టి అంతర్జాతీయ విమానా శ్రయానికి సీమాంధ్రలో ఎక్కడా లేని అనుకూలత ఉంది. రాజధాని ఏర్పాటు సందర్భంగా గ్రేటర్ రాయలసీమలోని ఆరు జిల్లాల పరిస్థితిపై ప్రభుత్వం చర్చించడం లేదు. పోలవరం, పులిచింతల, రాజధాని.. ఇలా అన్నింటికీ ఏలూ రు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలపైనే సీమాంధ్ర ప్రభుత్వం కేంద్రీకరించినట్లు కనబడుతోంది. భవిష్యత్తులో మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునాదులు వేయకుండా గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు జరగాలి. చంద్రబాబు పరిపాలనలో ప్రత్యేక తెలంగాణ వాదం పుట్టింది, పెరిగింది అనే అంశం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అభివృద్ధిని వికేంద్రీకరించకుండా పాలన సాగించిన పరిణామాల్లో భాగంగానే తెలంగాణ ఉద్యమం బలపడింది. కాబట్టి గతంలో జరిగిన తప్పులను సవరించాలంటే గ్రేటర్ రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలి. విశాలమైన మంచి రవాణా వ్యవస్థ, పారిశుధ్యానికి తగిన సౌకర్యాలు, విశాలమైన పార్కులు, చండీగఢ్ తరహాలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్ణయం జరగాలి. రాజధాని ఏర్పాటుకు సుదీర్ఘ కాలం పడుతుంది. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి వేల ఎకరాలను సేకరించాల్సిన అవసరం ఉంది. అంతేకాని కావాల్సింది సింగపూర్లు కాదు. 70 శాతం ప్రజలు పల్లెల్లో నివసించే మన రాష్ట్రంలో సింగపూర్ తరహా రాజధాని ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదు. (వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు) ఇమామ్ -
‘రియల్’.. బెంబేల్
రాజధాని ఏర్పాటు, భూముల విలువల నియంత్రణ సాకుతో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆస్తుల క్రయ, విక్రయాల్ని బంద్ చేయాలని భావిస్తుందనే సమాచారంతో జిల్లాలోని రియల్ఎస్టేట్ రంగంలో అలజడి చెలరేగింది. ప్రభుత్వ ప్రతిపాదన వల్ల నెల రోజులుగా జిల్లాలో జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలపై పిడుగులు పడ్డాయి. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ప్రకటించగానే రియల్టర్లు జాతీయ రహదారి పక్కన భూముల కొనుగోలుకు కోట్ల రూపాయలు గుమ్మరించారు. ప్రభుత్వ నిర్ణయంతో భారీగా నష్టపోక తప్పదని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సిటీ : గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు సమాచారంతో జిల్లాలో నెలరోజులుగా రియల్ వ్యాపారం జోరందుకొంది. రియల్టర్లు కోట్ల రూపాయాలతో భూములు కొనుగోలు చేసి అగ్రిమెంట్లు రాసుకున్నారు. రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తారనే సమాచారంతో వారిలో కలవరం రేగుతోంది. బహిరంగ మార్కెట్లో భూముల విలువలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న జిల్లాలోని 8 మండలాల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ రిజిస్ట్రేషన్లు జరగకుండా నాలుగైదు రోజుల్లో ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేయబోతోంది. రెండు వేల కోట్లకు పైగా లావాదేవీలు గత కొద్దిరోజులుగా జిల్లాలో రెండు వేల కోట్ల రూపాలయలకు పైగా అధికారికంగా, అనధికారికంగా ఆస్తుల క్రయ, విక్రయాలు జరిగినట్లు సమాచారం. జిల్లా మొత్తంమీద ఇబ్రహీంపట్నం, కంకిపాడు, గన్నవరం, నూజివీడు, ఉయ్యూరు, గుడివాడ, జగ్గయ్యపేట, నున్న ప్రాంతాలలో రిజిస్ట్రేషన్లు అత్యధికంగా జరిగాయి. జిల్లాలోనే కంకిపాడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికంగా రూ. 170 కోట్ల విలువ గల ఆస్తుల లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జూన్ నెలలో 16,457డాక్యుమెంట్లు ద్వారా సుమారు రూ. 600 నుంచి రూ.700 కోట్ల విలువగల ఆస్తుల క్రయ, విక్రయాలు జరిగాయి. అనధికారికంగా అగ్రిమెంట్లుపై 60 రోజుల షరుతలతో చేతులు మార్చుకుని రొటేషన్ లావాదేవీల ద్వారా మరో రూ. 1400 కోట్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా గన్నవరం,కంకిపాడు, నున్న, ఆగిరపల్లి, ఇబ్రహీంపట్నం నూజివీడు ఉయ్యూరు, గుడివాడ పట్టణాలలో స్థలాల రేట్లు అనూహ్యంగా పెరిగాయి. పల్లెల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు పల్లెల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భూముల క్రయ విక్రయాలు జరిగితే రెండుశాతం కమిషనపై వందల సంఖ్యలో బ్రోకర్లు పనిచేస్తున్నారు. కొందరు యువకులు సిండికేట్లుగా ఏర్పడి కమిషన్‌పై భూములు, స్థలాలు కొనుగోళ్లు, అమ్మకాలు చేయిస్తున్నారు. ఆత్మహత్యలే శరణ్యం జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేస్తే కొందరు రియల్టర్లు పేర్కొంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన తాము ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయి నానా ఇబ్బందులు పడాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక రేట్లు వస్తాయని పొలాల్ని అగ్రిమెంట్లపై స్వాధీనం చేసిన భూమి యజమానుల్లో కూడా భయాందోళన నెలకొంది. జిల్లాలో గత నెల రోజుల్లో అత్యధికంగా వ్యాపారం జరిగిన మండలాల్లో ఈ ఆందోళన ఎక్కువగా కన్పిస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో మునుగుతామా? అనే మీమాంసలో రియల్టర్లు బెంబేలెత్తుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో కూడా ప్రభుత్వం నిర్ణయంపై నిరసన వ్యక్తం అవుతోంది. తమ ఆస్తులకు మంచి రేట్లు వచ్చి లావాదేవీలు జరిగే సమయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయాలను కోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గుంటూరులో రియల్ బూమ్
సాక్షి, గుంటూరు :గుంటూరు నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిన్న మొన్నటి వరకూ స్తబ్దుగా ఉన్న భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గత నాలుగేళ్లుగా అనేకమంది భూములను అమ్మేందుకు ఎదురుచూపులు చూశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర రాష్ట్రానికి నూతన రాజధానిగా గుంటూరు- విజయవాడ మధ్య ప్రాంతం అనుకూలంగా ఉందంటూ ఊహాగానాలు రావడంతో గుంటూరుకు చుట్టుపక్కల 30 కి.మీ వరకూ భూముల ధరలు రోజురోజుకూ పైపైకి వెళ్తున్నాయి. దీనికితోడు ఇటీవల రాజధాని ఏర్పాటు గురించి సీమాంధ్ర ప్రాంతంలోని వివిధ ప్రాంతాలు తిరిగిన కేంద్ర బృందం వారం రోజుల క్రితం గుంటూరుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బృందం జిల్లాలో గుంటూరు- విజయవాడ మధ్యే పరిశీలన జరపడంతో ఇక ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జోరందుకుంది. దీంతో గుంటూరు నగర శివారుల్లో సైతం భూములను అమ్మేందుకు ఎవరూ ఆసక్తి కనబరచడంలేదు. ధరలు పెరుగుతున్నాయి కదా.. ఒక నెల చూద్దాంలే అంటూ వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. బడా వ్యాపారవేత్తలు మాత్రం ప్రస్తుతం అక్కడ ఉన్న మార్కెట్ ధరల కంటే అనూహ్యంగా ధరలు పెంచి అడుగుతుండటం తో కొందరు వచ్చిన వరకూ చాల్లే అంటూ అమ్మేస్తున్నారు. శివారు ప్రాంతాలపై రియల్టర్ల దృష్టి దీనికితోడు గుంటూరు నగర శివారులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నూతన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, మంగళగిరి వద్ద పోలీస్ బెటాలియన్ ఉన్న ప్రాంతంలో సీమాంధ్ర డీజీపీ కార్యాలయం ఏర్పాటు అవుతుందంటూ మీడియాలో వస్తున్న కథనాలను చూసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో భారీ మొత్తంలో భూములు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో భూ యజమానుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే భూముల ధరలు పెరుగుతున్నాయంటూ అందరికీ తెలిసిపోవడంతో అమ్మేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రియల్టర్ల దృష్టి నగర శివారు ప్రాంతాలపై పడింది. పల్నాడును ప్రత్యేక జిల్లా చేస్తామంటూ ప్రకటనలు.. గుంటూరు సంగతి అలా ఉంచితే నరసరావుపేటతోపాటు పల్నాడు ప్రాంతాన్ని కొత్త జిల్లాగా చేస్తామంటూ ఇటీవల ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తుండటంతో ఆ ప్రాంతంలో సైతం భూముల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు మాచర్ల నుంచి దుర్గి, బొల్లాపల్లి ప్రాంతాల్లో అటవీభూములు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందని కేంద్రం భావిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పక్కనే కృష్ణానది ఉండటంతో రాజధాని కేంద్రంలో నీటి సమస్య ఉండదని, వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఇక్కడే ఉన్నాయని, పైగా పల్నాడు ప్రాంతంలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ళ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన మైనింగ్ భూములు ఉండటం కూడా కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. దీంతో గతంలో ఎకరా లక్ష కూడా పలకని భూములు ఇప్పుడు నాలుగైదు రెట్లు అధికంగా పెరిగిపోయాయి. ఆ ధరకు కూడా అమ్మేందుకు ఎక్కువ శాతం మంది ముందుకు రావడంలేదు. రాజధాని అయినా కాకపోయినా, ప్రత్యేక జిల్లా అయితే చాలని కొందరు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్థల యజమానులు అప్రమత్తం... పెదకాకాని: సీమాంధ్ర రాజధాని ఏర్పాటు గుంటూరు, విజయవాడల మధ్య ఏర్పాటు జరుగుతుందని ప్రచారం ఊపందుకోవడంతో కొందరు స్థలాల యజమానులు అప్రమత్తమయ్యారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మండల పరిధిలోనే ఉండటంతో పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, వెనిగండ్ల అగతవరప్పాడు గ్రామాలలో ఎక్కువగా స్థలాలు కొన్న వారు తమ ప్లాట్లను చూసుకునేందుకు అధికసంఖ్యలో వస్తున్నారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొందరు తమ ప్లాటు గుర్తించగా మరి కొందరు తమ ప్లాటు ఎక్కడుందో తెలీడంలేదనీ, కాస్త వెతికి పెట్టాలని బ్రోకర్లను ఆశ్రయిసున్నారు. తక్కువ ధరకు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా దూర ప్రాంతాలలో ఉండటం వల్ల ప్లాటు కొని ఏళ్ల తరబడి తిరిగి చూడలేదు. ప్రస్తుతం కొన్ని ప్లాట్లు ముళ్ల కంచెలుగా మారగా మరికొని బ్రోకర్ల మాయాజాలం కారణంగా దొంగ రిజిస్ట్రేషన్లు జరిగాయి. పలు ప్రాంతాల్లో తాము కొనుగోలు చేసినప్పుడు తూర్పు, పడమర రోడ్లు ఉన్నాయి కదా, ఇదేంటి మా పాట్లన్నీ ఉత్తరం, దక్షిణం రోడ్లుగా మారాయని తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్ర రాజధాని ప్రచారం జోరుగా సాగడంతో మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ఉన్న ప్లాట్లను ఫెన్సింగ్ వేసుకోవడం, పిల్లర్స్ పోయడం, ప్రహరీ కట్టుకోవడం వంటి చర్యలు చేపడుతున్నారు. స్థలాల ధరలు మాత్రం చుక్కలు చూస్తుండగా కొనుగోలు చేసే వారు ముందుకు రావడం లేదు. అవకతవకలు జరగకుండా అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకుంటారో వేసి చూడాలి. -
బెజవాడే బెస్ట్
‘బెజవాడను రాజధాని చేయండి.. రాజధాని నిర్మాణం కోసం అన్ని వసతులు, సౌకర్యాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి.. నీటి సమస్య, విద్యుత్ సమస్య లేదు.. రోడ్డు, రైలు, వాయు మార్గాలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి.. రాజధాని నిర్మాణానికి నగరం పూర్తిగా అనువుగా ఉంటుంది’ అంటూ పలు సంఘాలు, పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో వినతిపత్రాలు అందజేశారు. నూతన రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం విజయవాడ చేరుకుంది. అనారోగ్య కారణంతో కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ హాజరుకాలేదు. సాక్షి, విజయవాడ : స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు రాజధాని ఎంపిక కోసం ఇక్కడ అనువుగా ఉన్న అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసింగ్, పట్టణాభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు. జిల్లాలో నదీజలాల పరిస్థితి, అటవీ ప్రాంతం, మైదాన ప్రాంతం, రవాణా సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా మ్యాప్, వీజీటీఎం ఉడా మాస్టర్ ప్లాన్లను పరిశీలించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్ర స్థితిని వివరించారు. రాజధాని ఏర్పాటుకు జిల్లాలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు సిబ్బంది వివరాలను తెలిపారు. జిల్లా నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాలకు రోడ్డు మార్గాలు ఉన్నాయని, ఇక్కడ పారిశ్రామికంగా వివాదాలు లేవని, మారకద్రవ్యాల విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు నగరం కొంత దూరంగా ఉందని గణాంకాలతో వివరించారు. నగరానికి సమీపంలో అతి పెద్ద పోలీసు బెటాలియన్ ఉందని, గన్నవరంలో 70 ఎకరాల్లో ఆక్టోపస్ ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. ఉడా అధికారులు, నగరపాలకసంస్థ కమిషనర్ తదితరులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన ద్వారా అన్ని అంశాలను వివరించారు. వీజీటీఎం ఉడా వైస్‌చైర్మన్ పి.ఉషాకుమారి, సబ్ కలెక్టర్ దాసరి హరిచందన, నగరపాలకసంస్థ కమిషనర్ సి.హరికిరణ్‌తో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమాచార సేకరణ మాత్రమే... తాము కేవలం జిల్లాలో పరిస్థితిపై సమాచారం సేకరించటం కోసమే వచ్చామని కమిటీ సభ్యులు ప్రకటించారు. రాజధాని ఎంపిక ప్రక్రియలో జోన్ నిబంధనలను పాటిస్తూ, రాజ్‌భవన్, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల నిర్మాణం, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ శాఖలు, ప్రధాన కార్యాలయాలు, గెస్ట్‌హౌస్‌లు, అధికారులు, సిబ్బందికి క్వార్టర్లు, స్టేడియంలు, హోటళ్లు, ఆస్పత్రులు, కళాశాలలు, లైబర్రీలు, మ్యూజియంలు, థియేటర్లు ఇలా అన్ని వసతుల ఏర్పాటుకు అనువుగా అవసరమైన మేరకు జిల్లాలో భూములు ఎక్కడ ఉన్నాయనే అంశంపై చర్చించారు. వినతుల వెల్లువ... అనంతరం కమిటీ సభ్యులు సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు విజయవాడనే రాజధాని చేయాలని కోరుతూ కమిటీ సభ్యులకు వినతిపత్రాలు అందజేశారు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ నేతృత్వంలో రాజధాని సాధన సమితి నేతలు కె.వాసుదేవరావు, జి.రాధాకృష్ణమూర్తి తదితరులు వినతిప్రతం సమర్పించారు. శివాజీ మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటుకు ప్రదేశం అనువుగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా రెండు నగరాల్లో నీటి సమస్య లేదని, ఏడు వైద్య బోధనాసుపత్రులు ఉన్నాయని, రెండు పాల ఫ్యాక్టరీలు, విద్య, వాణ్యిపరంగా అనేక పరిశ్రమలు, విద్యాసంస్థలు ఉన్నాయని చెప్పి పరిశీలించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్కె బాజీ, కొల్లూరు వెంకటేశ్వరరావు విజయవాడను రాజధాని చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్, టీడీపీ నేతలు కాట్రగడ్డ బాబు, తూమాటి ప్రేమ్‌నాధ్, పట్టాభిల నేతృత్వంలో నాయకులు, బీజేపీ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు, కేఎస్ ఆర్ముగం, వీరబాబు, ప్రసాద్, చిక్కాల రజనీకాంత్, జై ఆంధ్ర జేఏసీ చైర్మన్ ఎల్.జైబాబు, బి.రామమోహనరావు, విజయవాడ చాంబర్ ఆ్‌ఫ్ కామర్స్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ నేతృత్వంలో సభ్యులు విజయవాడ బార్ అసోసియేషన్ నేత మట్టా జయకర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ వెంకటేశ్వరరావు, రైతు సంఘ నేత శ్రీనివాసరెడ్డి, లారీ ఓనర్స్ అసోసియేషన్ నేత ఈశ్వరరావు, చిల్డ్రన్స్ వెల్ఫేర్ సోసైటీ అధ్యక్షుడు నగేష్, ఆంధ్రరాష్ట సమితి నేత డీవీ రంగారావు, లయన్స్కబ్ల్ సభ్యుడు నాగమలేశ్వరరావు తదితరులు వినతులు అందజేశారు. పలువురి నుంచి అభిప్రాయ సేకరణ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సీమాంధ్రలోని వివిధ ప్రాంతాలలో పర్యటనలో భాగంగా శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం విజయవాడకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా గూడవల్లిలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ హార్టీకల్చర్ కళాశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి జగన్‌షా మాట్లాడుతూ సీమాంధ్ర రాజధాని గురించి జిల్లా వాసులు వివరించే అంశాలను ఆధారంగా చేసుకుని ఒక నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. నివేదికను బట్టి ప్రభుత్వం రాజధానిని నిర్ణయిస్తుందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజధానికి కావలసిన అంశాలను అసలు ఇప్పటివరకూ ఎవరూ వివరించలేదని, చెప్పకుండానే పరిశీలనలు జరుగుతున్నాయని అన్నారు. అయితే విజయవాడ అన్ని ప్రాంతాల కంటే రాజధానికి అనువైన ప్రదేశమని తెలిపారు. హైదరాబాద్ రాజధానిలో అన్నీ ఒకేచోట పెట్టి తప్పు చేశామని, ఇప్పుడు అలా కాకుండా పరిశ్రమలు అన్ని జిల్లాల్లో పెట్టి అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడలో స్థల సమస్య అంటూ ఏమీ లేదన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ విజయవాడ రాజధాని చేయాలని 1953వ సంవత్సరంలోనే ప్రతిపాదన ఉందని, అయితే ఆ సమయంలో కర్నూలు రాజధాని చేశారని, తరువాత హైదరాబాద్‌కు తరలించాలని తెలిపారు. విజయవాడలో రైల్వే జంక్షన్, బందరు పోర్టు, ఎయిర్‌పోర్టు, తాగునీటి సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. న్యాయవాది సుంకర కృష్ణమూర్తి మాట్లాడుతూ విజయవాడలో 40 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వానికి కావలసిన భూములు మొత్తం 49 వేల ఎకరాలు ఉన్నాయన్నారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ విజయవాడ అన్ని రంగాలలోనూ ముందుందన్నారు. విద్య, వైద్య విభాగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని ప్రాంతాల కంటే విజయవాడ అనువైనదని తెలిపారు. ఐలా చైర్మన్ పౌండ్రీ ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడలోని ఆటోనగర్‌లో ఎంతోమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. విజయవాడను రాజధానిచేస్తే విదేశాలలో ఉన్న ఉద్యోగులందరూ ఇక్కడికొచ్చి పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తారన్నారు.