వారెవ్వా నితీశ్‌ రెడ్డి!.. ‘విధ్వంసం’ కాదు.. విలువైన సెంచరీ | Ind vs Aus: Nitish Kumar Reddy Hits Maiden Test Century Scripts History | Sakshi
Sakshi News home page

వారెవ్వా నితీశ్‌ రెడ్డి!.. ‘విధ్వంసం’ కాదు.. విలువైన సెంచరీ

Published Sat, Dec 28 2024 11:53 AM | Last Updated on Sat, Dec 28 2024 1:15 PM

Ind vs Aus: Nitish Kumar Reddy Hits Maiden Test Century Scripts History

ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో భారత యువ క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి(Nitish Kumar Reddy) విలువైన శతకం సాధించాడు. ఆసీస్‌ బౌలర్ల ధాటికి ‘స్టార్‌’ బ్యాటర్లంతా విఫలమైన వేళ.. అతడు మాత్రం పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కంగారూల పేస్‌ పదునుకు తన బ్యాట్‌తో విరుగుడు మంత్రం రచించి.. దూకుడుగా ఆడుతూ వారిని ఇరకాటంలో పడేశాడు.

తొట్ట తొలి శతకం
మరో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌(50)తో కలిసి నిలకడగా ఆడుతూ.. భారత్‌ స్కోరును మూడు వందల మార్కును దాటించాడు. ఎనిమిదో వికెట్‌కు వాషీతో కలిసి విలువైన 127 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలోనే తన అంతర్జాతీయ కెరీర్‌లో మొట్టమొదటి శతకాన్ని(Maiden Century) నమోదు చేశాడు విశాఖపట్నం కుర్రాడు నితీశ్‌ రెడ్డి.

ఫోర్‌ బాది.. శతకం పూర్తి చేసుకుని
టీమిండియా తరఫున ఆడుతున్న నాలుగో టెస్టులోనే 21 ఏళ్ల నితీశ్‌ రెడ్డి ఈ అద్భుతం చేశాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూ.. ఆచితూచి ఆడుతూనే అదును చూసి బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో  ఫోర్‌ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 171 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.

తద్వారా ఆస్ట్రేలియాలో టీమిండియా తరఫున అత్యంత పిన్న వయసులో టెస్టు సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గా నితీశ్‌ రెడ్డి రికార్డులకెక్కాడు. కాగా మెల్‌బోర్న్‌లో  గురువారం మొదలైన బాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌట్‌ అయింది.

వాళ్లంతా విఫలం
ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్‌, కెప్టెన​ రోహిత్‌ శర్మ(3), వన్‌డౌన్ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌(24) విఫలం కాగా.. హాఫ్‌ సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్‌(82) స్వీయ తప్పిదం వల్ల రనౌట్‌ అయ్యాడు.

ఇక విరాట్‌ కోహ్లి 36 పరుగులకే నిష్క్రమించగా.. ఆకాశ్‌ దీప్‌ డకౌట్‌ అయ్యాడు. ఈ క్రమంలో 164/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా.. కాసేపటికే రిషభ్‌ పంత్‌(28), రవీంద్ర జడేజా(17) వికెట్లు కోల్పోయింది.

ఆల్‌రౌండర్ల మెరుపులు
ఈ క్రమంలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి- స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ వందకు పైగా పరుగుల భాగస్వామ్యంతో దుమ్ములేపారు. వాషీ సరిగ్గా 50 పరుగులు చేసి అవుట్‌ కాగా.. నితీశ్‌ రెడ్డి శతకంతో మెరిశాడు.

ఇక వెలుతులేమి కారణంగా మూడో రోజు ఉదయం 11.55 నిమిషాలకు ఆట నిలిపివేసే సమయానికి నితీశ్‌ రెడ్డి.. 176 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో.. 105 పరుగులు చేశాడు. 

అప్పటికి టీమిండియా 116 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఆసీస్‌ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. బోర్డర్‌- గావస్కర్‌ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో మూడు  టెస్టులు పూర్తి చేసుకున్న టీమిండియా 1-1తో సమంగా ఉంది.
చదవండి: ఆసీస్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన నితీశ్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement