ఆసీస్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన నితీశ్‌ రెడ్డి | BGT 2024: Nitish Reddy Shatters Historic Record Vs Aus Becomes 1st Ever Indian To | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన నితీశ్‌ రెడ్డి

Published Sat, Dec 28 2024 11:16 AM | Last Updated on Sat, Dec 28 2024 12:18 PM

BGT 2024: Nitish Reddy Shatters Historic Record Vs Aus Becomes 1st Ever Indian To

టీమిండియా యువ క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి(Nitish Kumar Reddy) ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. కంగారూల దేశంలో లోయర్‌ ఆర్డర్‌లో బరిలోకి దిగి అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. ఐపీఎల్‌-2024(IPL-2024 )లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున సత్తా చాటిన విశాఖ కుర్రాడు నితీశ్‌ రెడ్డి.. టీ20ల ద్వారా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

అరుదైన నైపుణ్యాల కారణంగా
భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటిన నితీశ్‌ రెడ్డి.. తనకున్న అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టులోనూ చోటు సంపాదించాడు. ఏకంగా ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టుతో భారత్‌ తలపడే బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy)కి ఎంపికవడమే కాక.. తుదిజట్టులో స్థానం దక్కించుకున్నాడు.

ఇదే జోరులో టీమిండియా మేనేజ్‌మెంట్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నితీశ్‌ రెడ్డి నిలబెట్టుకుంటున్నాడు. పెర్త్‌ టెస్టులో విలువైన ఇన్నింగ్స్‌(41, 38 నాటౌట్‌, ఒక వికెట్‌) ఆడిన 21 ఏళ్ల ఈ తెలుగు తేజం..  అడిలైడ్‌(42, 42, ఒక వికెట్‌)లోనూ బ్యాట్‌ ఝులిపించాడు. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులోనూ ఫర్వాలేదనిపించిన నితీశ్‌ రెడ్డి.. బాక్సింగ్‌ డే టెస్టు(Boxing Day Test)లో మాత్రం దుమ్ములేపుతున్నాడు.

అరుదైన రికార్డు.. ఆసీస్‌ గడ్డపై చరిత్ర
రోహిత్‌ శర్మ(Rohit Sharma), విరాట్‌ కోహ్లి(Virat Kohli) వంటి టాప్‌ బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకున్నాడు. మరో యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి నితీశ్‌ రెడ్డి భారత ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. విలువైన శతకం సాధించాడు.

అయితే, 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో నితీశ్‌ రెడ్డి ఖాతాలో అరుదైన రికార్డు జమైంది. ఆస్ట్రేలియాలో ఎనిమిది.. లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అనిల్‌ కుంబ్లే పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును నితీశ్‌ రెడ్డి బద్దలు కొట్టాడు.

ఆసీస్‌ గడ్డపై ఎనిమిది లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోరు చేసిన భారత క్రికెటర్లు
1. నితీశ్‌ రెడ్డి- మెల్‌బోర్న్‌-2024- 88* రన్స్‌
2. అనిల్‌ కుంబ్లే- అడిలైడ్‌- 2008- 87 రన్స్‌
3. రవీంద్ర జడేజా- సిడ్నీ- 2019- 81 రన్స్‌
4. కిరణ్‌ మోరే- మెల్‌బోర్న్‌- 1991- 67*
5. శార్దూల్‌ ఠాకూర్‌- బ్రిస్బేన్‌- 2021- 67.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement