దశ తిరిగింది
విజయవాడ, గుంటూరుల్లో రియల్ బూమ్
ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున కృష్ణమ్మ చెంత విజయవాడ నగర పరిసరాల్లో రాజధాని ఏర్పాటు కానుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన సభలో ప్రకటించడంతో ప్రస్తుతం అందరి దృష్టి విజయవాడ, గుంటూరులపైనే పడింది. వర్తక, వాణిజ్య, పర్యాటక, పారిశ్రామిక రంగాల నుంచి రాజకీయ నాయకులు, సామాన్యుల వరకు అందరూ బెజవాడను రాజధానిగా స్వాగతిస్తున్నారు. కృష్ణా జిల్లాలో విజయవాడ, కంకిపాడు, గన్నవరం, నూజివీడు, మైలవరం, కంచికచర్ల, నందిగామ, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో.. గుంటూరు జిల్లాలో తాడేపల్లి, మంగళగిరి, కాజ, పెదకాకాని, గుంటూరు, చిలకలూరిపేట, పేరేచర్ల, అమరావతి, తాడికొండ, తుళ్లూరుల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది.
స్థిరాస్తి జోరు..
విజయవాడ మీదుగా రెండు జాతీయ రహదారులు, అతిపెద్ద రైల్వే జంక్షన్, అంతర్జాతీయ స్థాయికి అభివృద్ది చెందనున్న విమానాశ్రయం, అధునాతన స్టార్ హోటల్స్, విద్యా, వైద్య సంస్థలు తదితర వసతులున్నాయి. బందర్ రోడ్డు విస్తరణ, దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్, విజయవాడ-గుంటూరు మధ్య రెండు బైపాస్ రోడ్ల నిర్మాణాల ప్రతిపాదనలతో నగరం అభివృద్ధిపథం దూసుకుపోతోంది.
బంజారాహిల్స్‌ను తలపిస్తున్న బందర్ రోడ్డు..
బందర్‌రోడ్డులో స్థిరాస్తి ధరలు హైదరాబాద్‌లో బంజారాహిల్స్ ప్రాంతాన్ని తలపిస్తోంది. విజయవాడ-బందరు మధ్య 60 కి.మీ. మార్గం విస్తరణ ప్రతిపాదనలతో రియల్‌లో దూకుడు మొదలైంది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు అభివృద్ధి శరవేగంతో జరుగుతోంది. విజయవాడ నుంచి కంకిపాడు వరకు బందర్‌రోడ్డుకిరువైపులా వెంచర్లు వెలిశాయి.
దూకుడు మీదున్న ఏలూరు రోడ్డు
విజయవాడ నుంచి ఏలూరు వైపుకు వెళ్లే రోడ్డులో స్థిరాస్తి వ్యాపారం దూసుకుపోతోంది. ఈ మార్గంలో అనేక కార్ల కంపెనీలు ఏర్పాటయ్యాయి. రామవరప్పాడు రింగ్ సెంటర్ నుంచి గన్నవరం వరకు మార్గమధ్యం నగరంలో కలిసిపోయింది. ఈ మార్గంలో హనుమాన్ జంక్షన్ వరకు రియల్ ఏస్టేట్ సంస్థలు తమ వ్యాపారాన్ని ముమ్మరంగా చేస్తున్నాయి. గన్నవరంలో ఎయిర్‌పోర్టు దానికి దగ్గర్లో ఐటీ పార్కు వుండటంతో ఆ ప్రాంతంలో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు.
విజయవాడ-గుంటూరు రూట్‌లో..
విజయవాడ-గుంటూరు రూట్‌లో ఆరులైన్ల జాతీయ రహదారి అభివృద్ధి చెందటంతో ఈ ప్రాంతంలో సొంత ఇంటి నిర్మాణానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ రూట్‌లో కూడా చిన్న పట్టణాలు అభివృద్ధి చెందాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వరకు జాతీయ రహదారికి ఇరువైపులా వందలాది ఎకరాల్లో వెంచర్లు వెలిశాయి.
ఉడా నిబంధనలే..
మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో వుండే విధంగా స్థిరాస్తి వెంచర్లు వేస్తున్నారు. వీజీటీఎం ఉడా నిబంధనలకు అనుగుణంగా 40 అడుగుల రోడ్లతో, వెంచర్ల చుట్టూ ప్రహరీ, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలతో వెంచర్లు మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో వుండే విధంగా స్థిరాస్తి వెంచర్లు వేస్తున్నారు. 100 శాతం వాస్తుతో ఉడా లే అవుట్ నిబంధనలకు అనుగుణంగా పార్కులు, కామన్ సైట్‌లు విడిచిపెట్టటంతో ఆయా వెంచర్ల వివరాలు తెలుసుకుని కొనుగోలు చేసుకుంటున్నారు. కొన్ని సంస్థలు బ్యాంకు రుణ సదుపాయం కూడా అందిస్తున్నాయి. బ్యాంకర్లు కూడా ప్లాట్లు కొనుగోలుదారులకు రుణాలు విరివిగా ఇస్తున్నారు.
విజయవాడలో చుక్కల్లో ధరలు..
రాజధానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు విజయవాడ, పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు కానుండటంతో ఫ్లాట్లు, ప్లాట్ల ధరలు అమాంతం పెరిగాయి. విజయవాడలో ప్రస్తుతం 1,200 చ.అ. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాటు ధర రూ.60 లక్షలకు పైగానే పలుకుతోంది. కంకిపాడు, గన్నవరం, గొల్లపూడి ప్రాంతాల్లో గజం స్థలం ధర రూ.10 వేలకు పైగానే ఉంది. గన్నవరం విమానాశ్రయ విస్తరణ, అక్కడికి సమీపంలోని మేథ ప్రాంగణంలోకి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం ఎక్కువగా సాగడంతో గన్నవరం పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఆటోనగర్, గొల్లపూడి, మైలవరం, గన్నవరం తదితర ప్రాంతాల్లో చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. దాదాపు 500 సంస్ధలు సేల్స్‌టాక్సు కార్యాలయాల్లో తమ కంపెనీల పేర్లను నమోదు చేసుకున్నాయి. భారీ పరిశ్రమలు తమకార్పొరేట్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రైవేట్ బిల్డింగ్‌ల అన్వేషణలో ఉన్నాయి. గన్నవరం, నూజివీడు, ఆగిరిపల్లి, ఇబ్రహీంపట్నం, మైలవరం తదితర ప్రాంతాల్లోని భూముల కొనుగోలుకు రియల్టర్లు బారులు తీరుతున్నారు.