కాల‘నీళ్లు’! | Waste water flow for cleaning houses: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కాల‘నీళ్లు’!

Published Tue, Sep 10 2024 4:04 AM | Last Updated on Tue, Sep 10 2024 4:04 AM

Waste water flow for cleaning houses: Andhra Pradesh

వరద ముంపులోనే పది రోజులుగా నరక యాతన

వైఎస్సార్‌ జక్కంపూడి కాలనీలో దుర్భర పరిస్థితులు

కింద అంతస్తులన్నీ మునిగిపోవడంతో పైనే బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

ఆహారం కోసం సంచులతో రోడ్లపై పడిగాపులు 

ట్యాంకర్‌ నుంచి నీటిని పట్టుకోవడానికి జలయుద్ధాలే

ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి మురుగు నీరే గతి 

దాదాపు 50 వేల మంది జీవించే కాలనీని వరదకొదిలేసిన ప్రభుత్వం

ప్రచార ఆర్భాటమే తప్ప తమకు ప్రభుత్వ సాయం పూర్తిగా అందడంలేదని బాధితుల మండిపాటు

సాయం చేసే దిక్కు లేదు..
నా జీవనోపాధి పోయింది. స్కూల్‌ దగ్గర ట్రామ్పోలిన్‌ జంపింగ్‌ ద్వారా రోజంతా కష్టపడితే రూ.300 వస్తాయి. వాటితోనే నేను, నా భర్త పొట్ట పోసుకుంటున్నాం. ఇప్పుడు వరదలో ట్రామ్పోలిన్‌ కొట్టుకుపోయింది. పది రోజుల నుంచి తినడానికి తిండి లేదు. సాయం చేసే దిక్కులేదు. – కళావతి, వైఎస్సార్‌ జక్కంపూడి కాలనీ

ప్రాంతం: వైఎస్సార్‌ జక్కంపూడి కాలనీ అపార్ట్‌మెంట్‌ బ్లాకులు: 250కిపైగా (ఒక్కో బ్లాక్‌లో 32 ప్లాట్లు) 
జనాభా: సుమారు 50 వేలు వరద పరిస్థితి: బురద నీళ్లు, చెత్త 
ఇళ్ల పరిస్థితి: డ్రైనేజీ నీళ్లతోనే ఇంటిలోని బురదను శుభ్రం చేసుకుంటున్న బాధితులు 
డ్రోన్లతో ఆహారం: ఒక్క డ్రోన్‌తో కూడా ఆహారం అందించిన దాఖలా లేదు 
హెలికాఫ్టర్లతో ఆహారం: బాధితులు చేరుకోలేని ప్రదేశాలు, వాటర్‌ ట్యాంకులపైనే అరకొరగా ఆహార పొట్లాలు పడేశారు.  
ఫైరింజన్లతో ఇళ్లు శుభ్రం: కాలనీలో ఫైరింజన్‌ గంట సౌండ్‌ కూడా వినిపించట్లేదు. 
పారిశుధ్యం: రోడ్లపై వరదలో కొట్టుకొచి్చన చెత్త మేటలు వేసింది. ఒక్కరైనా పారిశుధ్య సిబ్బంది కనిపించలేదు. 
తాగునీరు: ప్రతి ఇంటిలోనూ తాగునీటికి కటకటే

వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి
విజయవాడలోని వరద ప్రభావిత కాలనీల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాం­తాల్లో డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు సరఫరా చేశామని, ఫైరింజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేసేశామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పది రోజుల తర్వాత కూడా బాధితులు ఆకలి, దప్పికలు తీర్చుకోవడానికి రోడ్లపైకి సంచులతో పరుగులు తీస్తున్నారు. 

ఇళ్లలో చేరిన బురద, చెత్తను శుభ్రం చేసుకోవడానికి బకెట్టు నీళ్లు దొరక్క.. రోడ్డుపై డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటినే వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కారి్మకులను రప్పించి రోడ్లను అద్దాల్లా తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా కాలనీల్లో చెత్త మేటలు పేరుకుపోయాయి. డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటితో దుర్గంధం ముక్కుపుటాలను అదరగొడుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. విజయవాడ శివారులోని వైఎస్సార్‌ జక్కంపూడి కాలనీ దుస్థితి ప్రజలు పడుతున్న అవస్థలకు అద్దం పడుతోంది. 

సోమవారం ‘సాక్షి’ బృందం వైఎస్సార్‌ జక్కంపూడి కాలనీలో పర్యటించినప్పుడు కాలనీ వాసులు కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్సార్‌ జక్కంపూడి కాలనీలో సుమారు 250కిపైగా బ్లాకుల్లో దాదాపు 50 వేల మంది జీవిస్తున్నారు. రోజూ కూలికి పోతే కానీ ఐదు వేళ్లు నోటికి పోని పరిస్థితుల్లో ఉన్నవారిని బుడమేరు వరద మరింత దు­ర్భర స్థితిలోకి నెట్టేసింది. ప్రభుత్వం ముందస్తు వరద హెచ్చరికలు చేసినా తమదారి తాము చూసుకునే వాళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 వారం రోజులు దాటాక వరద తగ్గిందని తెలుసుకున్నాకే సీఎం చంద్రబాబు ఆదివారం ఈ ప్రాంతంలో చుట్టపుచూపుగా వచి్చపోయారని బాధితులు మండిపడ్డారు. సీఎం వచ్చి వెళ్లాక కూడా ఇక్కడి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క వైఎస్సార్‌ జక్కంపూడి కాలనీలో పరిస్థితి మాత్రమే కాదు..  కండ్రిక, పాయకాపురం, ఉడా కాలనీ, వాంబే కాలనీ, కొత్త, పాత ఆర్‌ఆర్‌పేట, పైపుల రోడ్డుతో సహా ముంపు ప్రాంతాలన్నింటిలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి.  

ప్రచార కండూతి తప్ప ఫైరింజన్లు ఎక్కడ? 
ఓవైపు ముంపునకు గురైన ఇళ్లను ఫైర్‌ ఇంజన్‌లతో శుభ్రం చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉండే కొన్ని ఇళ్లకు మాత్రమే ఫైర్‌ ఇంజన్‌ల ద్వారా నీళ్లు కొట్టి ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయించుకుంటున్నారు. చంద్రబాబుది కేవలం ప్రచార కండూతి.. చేసే చేతల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని జక్కంపూడి కాలనీలోని పరిస్థితులు అద్దం పట్టాయి. గత పది రోజులుగా వరద నీరు, బురద, చెత్తాచెదారం చేరి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఇళ్లలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో కాలనీలో రోడ్లపై ఉన్న మురుగు నీటిని బకెట్లలోకి తోడుకుని మహిళలు ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. అదేంటి మురికి నీళ్లతోనే ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు? ప్రభుత్వం ఫైర్‌ ఇంజన్‌లతో శుభ్రం చేయిస్తామని చెబుతోందిగా అని స్థానికులను ప్రశి్నంచగా.. ‘ఇంట్లో వారం నుంచి వాడుకోవడానికి చుక్క నీళ్లు లేవు. ఫైర్‌ ఇంజన్‌లు వచ్చి ఇళ్లు కడగటం ఒక్కటే తక్కువైంది మా బతుకులకు’ అని ప్రభుత్వంపై బాధితులు మండిపడ్డారు.   

డ్రోన్‌ ఎగిరిందీ లేదు.. ఆహారం అందిందీ లేదు.. 
ముంపు ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్‌లు, హెలికాప్టర్‌ల ద్వారా ఆహారం, తాగు నీరు సరఫరా చేసేశాం.. అందరి ఆకలి తీర్చేశామని రోజు మీడియా సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే సుమారు 50 వేల మంది నివాసం ఉంటున్న వైఎస్సార్‌ జక్కంపూడి కాలనీలో ఒక్క డ్రోన్‌ ద్వారా.. ఒక్క ఇంటికి కూడా ఆహారం పంపిణీ చేయలేదని స్థానికులు అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. హెలికాప్టర్‌లలో వాటర్‌ బాటిళ్లు, ఆహార పొట్లాలు తెచ్చి కాలనీకి దూరంగా ఉండే వాటర్‌ ట్యాంక్‌పై విసిరి వెళ్లారని, పీకల్లోతు నీటిలో వెళ్లి వాటర్‌ ట్యాంక్‌లు ఎక్కి ఆహారం, నీళ్లు ఎలా తెచ్చుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వ పెద్దలకు లేదా? అని నిలదీశారు.  

జలయుద్ధాలు తప్పడం లేదు.. 
పది రోజులుగా ముంపులో చిక్కుకుపోయిన వారికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవు. స్నానాలు చేసి రోజులు గడుస్తుండటంతో చర్మ వ్యాధులు, దద్దుర్లతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీళ్ల ట్యాంకర్‌ కాలనీలోకి రాకముందే దాని వెంట పరుగులు తీస్తూ జలయుద్ధాలు చేస్తున్నారు.

కూడబెట్టుకున్నదంతా పోయింది..  
కూలినాలి చేసు­కుని సంపాదించుకున్న­దంతా వరదలో కొట్టు­కుపోయింది. ఎలా ఉన్నా­రని పలకరించిన నాథుడు లేడు. పది రోజులుగా నరకయాతన పడ్డాం. వయసుకు వచి్చన ఆడ బిడ్డలతో ఎక్కడికి వెళ్లి ఉంటాం? ఇంటిలో ఏ వస్తువూ మిగల్లేదు. పునరావాస కేంద్రానికి తరలిస్తామని ఒక్కరూ చెప్పలేదు. ఉచిత బియ్యం ఇస్తామనీ ఇవ్వలేదు. కరెంట్‌ లేదు. వేసుకోవడానికి సరైన బట్టలు లేవు. పనుల్లేక చేతిలో డబ్బులు లేవు. ఎలా బతికేది? జీవితం రోడ్డున పడింది.  – భార్గవి, వైఎస్సార్‌ జక్కంపూడి కాలనీ

ఒక్క వస్తువు కూడా మిగల్లేదు..  
మా తమ్ముడి ఇంటిలో ఫంక్షన్‌కని ఆగస్టు 25న కాకినాడ నుంచి వచ్చాను. ఆదివా­రం ఒక్కసారిగా వరద నీరు ఇంటిలోకి రావడవంతో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. ఇద్దరు ఆడ పిల్లలతో మా తమ్ముడు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇప్పు­డు ఎవరైనా వచ్చి వండుకోవడానికి పప్పులు, ఉప్పులు ఇస్తే కానీ గడవని దుస్థితి ఉంది.  – నాగమణి, వైఎస్సార్‌ జక్కంపూడి కాలనీ

ఈ చిత్రంలోని మహిళ.. సయ్యద్‌ సమీరా. ఆమె ఇంటి ముందు మురుగు నీరు తటాకాన్ని తలపిస్తోంది. దీంతో విధిలేక తన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఆ మురుగు నీటినే తీసుకెళుతోంది. ఇదేంటమ్మా.. ప్రభుత్వం ఫైర్‌ ఇంజన్లతో ఇళ్లు శుభ్రం చేయిస్తామని చెబుతుంది కదా అని ప్రశి్నస్తే.. ‘మా బతుకులకు అదొకటే తక్కువైంది. పది రోజుల నుంచి మురుగు నీటిలోనే పడి ఉన్నాం. ఎవరూ పలకరించిన పాపానపోలేదు. వరద పోయి బురద మిగిలితే.. దాన్ని కడుక్కోవడానికి చెంబు నీళ్లు కూడా ఇవ్వట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరద వస్తుందని ఎవరూ చెప్పలేదు.. అర్ధరాత్రి ఇంటిలోకి నీళ్లు చేరితే.. కట్టుబట్టలతో పై అంతస్తులోకి పరుగులు పెట్టాం.

ఇద్దరు చిన్న పిల్లలను పక్కింటిలో ఉంచి మేము నీళ్ల మధ్యే దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు కాలం వెళ్లదీశాం. ఇప్పుడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేని దుస్థితిలో ఉన్నాం. ఫ్రిజ్‌ నీటిలో తేలుతూ రోడ్డుపైకి కొట్టుకొచి్చంది. నా భర్త సయ్యద్‌ ఖాజా పైపుల రోడ్డులో నిర్వహించే వెల్డింగ్‌ షాపు కూడా నీటమునిగింది. మొత్తం మెషినరీ కూడా తడిచిపోయింది. ఇళ్లు, షాపు కోల్పోయి రోడ్డుపై పడ్డాం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా సమీరా ఒక్కరే కాదు.. వేలాది మంది సోమవారం వైఎస్సార్‌ జక్కంపూడి కాలనీలో వరద బాధితులుగా.. కట్టుబట్టలతో రోడ్లపై కష్టాలను అనుభవిస్తూ కనిపించారు.

నిత్యావసరాలు కరవై.. 
50వేల మంది ఉండే జక్కంపూడి కాలనీని ప్రభు­త్వం గాలికొదిలేసింది. అపార్ట్‌­మెంట్లలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లు నీటమునిగాయి. కాలు బయటకు అడుగు పెట్టలేని దుస్థితిలో పై అంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత నిత్యావసరాలు కూడా ఇక్కడికి చేరలేదు. ఇంటిలో బియ్యం తడిచిపోయి, వంట వస్తువులు నీటిలో మునిగిపోయాయి. దీంతో దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు తీసుకుని రోడ్లపై పిల్లజల్లాలతో పడిగాపులు కాస్తున్నారు.

జీవనాధారం కకావికలం
బుడమేరు వరదతో జక్కంపూడి కాలనీకి చెందిన బార్బర్‌ రాంబాబుకు తీవ్ర నష్టం వారం రోజులు నీటిలోనే బార్బర్‌ షాపు, ఇల్లుపూర్తిగా పాడైపోయిన షాపులోని కుర్చీలు, వస్తువులు షాపు పునరుద్ధరణకు రూ.లక్ష వరకూ అవసరం కన్నీరుమున్నీరవుతున్న రాంబాబు కుటుంబం వరద ప్రభావిత ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి బుడమేరు వరద ధాటికి బడుగుల జీవితాలు కకావికల­మ­య్యాయి. తాము నివాసం ఉంటున్న వీధిలో, కాలనీలోనే చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు పెట్టుకుని చిరువ్యాపారాలు చేసుకుంటున్నవారు, చేతి వృత్తులను నమ్ముకున్నవారి కుటుంబాలు రోడ్డు­న­పడ్డాయి. జక్కంపూడి కాలనీకి చెందిన ఇక్కుర్తి రాంబాబుది కూడా అలాంటి కన్నీటి గాథే. జక్కంపూడి కాలనీలోని డ్రెయిన్‌ పక్కనే చిన్న బార్బర్‌ షాప్‌ నడుపుకుంటూ రాంబాబు తన కుటు­ం­బాన్ని పోషించుకుంటున్నారు. అతని భార్య ఉమామహే­శ్వరి ఇళ్లలో పనులకు వెళ్తారు. ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమా­రుడు నగరంలోని ఓ సెలూన్‌ షాపులో రోజువారీ కూలీకి వెళు­తుంటాడు. 

డిగ్రీ చదువుతున్న రెండో కుమారుడు మణికంఠ కాలేజీ నుంచి వచ్చాక తండ్రికి షాపులో సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీ అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా బుడమేరు వరద ప్రారంభమైంది. తెల్లవారేసరికే జక్కంపూడి కాలనీని ముంచేసింది. రాంబాబు బార్బర్‌ షాపు కూడా వరద నీటిలో మునిగిపోయింది. వారం రోజులకు పైగానే షాపు నీటిలో ఉంది. షాపు లోపల ఉన్న రెండు కుర్చీలు, సెలూన్‌ సామాగ్రి అంతా నానిపోయి పనికిరాకుండా మారాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండే రాంబాబు ఇంట్లోకి కూడా వరద చేరడంతో సరుకులు, టీవీ, మంచం... ఇలా ఏ ఒక్కటి మిగలకుండా అన్నీ పాడైపోయాయి. వారం రోజులపాటు ఇంటి పై ఫ్లోర్‌లోని బాల్కనీలో అతని కుటుంబం తలదాచుకుంది. 

వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం షాప్‌లోని తడిచిపోయిన వస్తువులన్నింటినీ రాంబాబు, అతని కుమారుడు మణికంఠ బయటపెట్టి బురదను శుభ్రం చేసుకు­న్నారు. వారి వేదనను గుర్తించిన ‘సాక్షి’ ప్రతినిధి... ‘మళ్లీ ఆ వస్తువులు పనిచేస్తాయా...’ అని అడగ్గా... ఒక్క వస్తువు కూడా పనిచేయదని రాంబాబు బదులిచ్చాడు. ‘రెండు చైర్‌లు పూర్తిగా పనికి రాకుండాపోయాయి. కొత్తగా కొనుగోలు చేయాలంటే ఒక్కోటి రూ.15 వేలుపైనే చేస్తాయి. అద్దాలు కొత్తగా కొనాలి. వారం పాటు ముంపులోనే ఉండిపోవడంతో షాప్‌ కూడా దెబ్బతింది. రిపేర్‌ చేయించాలి. ట్రిమ్మర్‌లు, కత్తెరలు, దువ్వెనలు, టవల్స్‌.. ఇలా ప్రతి ఒక్కటి కొత్తగా కొనాలి. కనీసం రూ.లక్ష ఖర్చు అవుతుంది. మరోవైపు చిన్నబ్బాయి కాలేజీ ఫీజులు చెల్లించాలి. ఇంట్లోని వస్తువులు కూడా పాడైపోయాయి. పది రోజుల నుంచి పని లేక ఇళ్లు గడవడం కూడా కష్టంగా ఉంది. ప్రభుత్వం నిత్యావసరాలు కూడా పంపిణీ చేయలేదు.’ అని రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement