విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనపై దాఖలైన మూడు కేసుల్లో అరెస్టును తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని నేర పరిశోధన సంస్థ(సీఐడీ) కార్యాలయం, తాడేపల్లి సిట్, గుంటూరు సీఐడీ ఆఫీసుల్లో ఆయా కేసుల్లో శనివారం లొంగిపోయిన ఆయన.. పూచీకత్తులు, బాండ్ షూరిటీలు సమర్పించారు.
ముందుగా విజయవాడ తులసినగర్‌లోని సీఐడీ ఆఫీస్‌కు వెళ్లిన చంద్రబాబు.. ఇసుక కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన టీడీపీ అభిమానులకు ఆయన అభివాదం చేశారు. అక్కడి నుంచి తాడేపల్లి సిట్ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు.. ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఆపై పూచీకత్తులు సమర్పించారు.
చివరగా గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత.. మద్యం పాలసీ కేసులో ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో అధికారులకు ష్యూరిటీ సమర్పించారు. ఈ మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు ‘పూచీకత్తు’ సంతకాలు చేశారు.
ఇసుకాసురుడి అవతారంలో చంద్రబాబు..
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది.
మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.
ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు.
IRR భలే మలుపు..
టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మూడుసార్లు మార్పు చేశారు.
అలైన్‌మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్ జరిగింది.
కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు.
మద్యంనూ వదలని బాబు అండ్ కో
ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది.
ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
Comments
Please login to add a commentAdd a comment