రాజధాని రైతులకు అన్యాయం చేయం: చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు రాజధానిలో తొలి ప్రాధాన్యత ఇస్తామని, వారికి అన్యాయం జరగదని ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు చెప్పారు. భూ సమీకరణ కోసం దేశంలో ఎక్కడా ఇవ్వని మంచి ప్యాకేజీని ఇచ్చానన్నారు. భూములిచ్చిన రైతులకు తిరిగి వాటాలను లాటరీ పద్ధతిలో ఇస్తామని, ఇందులోనూ ఎవరికీ అన్యా యం జరగదని చెప్పారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యం లో తుళ్లూరు ప్రాంతం నుంచి వచ్చిన భూ సమీకరణ అనుకూల రైతులు సోమవారం విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన్ను సత్కరించారు.
చంద్రబాబు వారినుద్దేశించి మాట్లాడుతూ రాజధాని కట్టుకోకపోతే ముందుకెళ్లే పరిస్థితి లేదని, అలాగని అటవీ, ప్రభుత్వ భూములున్న చోట కడితే అభివృద్ధి ఉండదని చెప్పారు. అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేశామని, ఈ సమయంలో తన ప్రకటనను అడ్డుకోవాలని కొందరు చూశారని ఆరోపించారు. కట్టబోయే రాజధానిని వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకోవాలని, తేడా వస్తే భావితరాలు తమను క్షమించవని చెప్పారు. తుళ్లూరు ప్రాంతంలో చదువుకున్న వారు ఇప్పుడు ఉద్యోగాల కోసం అమెరికా ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని, రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఉద్యోగాల కోసం తుళ్లూరు వస్తారని చెప్పారు.
చరిత్రలో మొదటిస్థానం ఈ రైతులకే..
తాను ఏ పని చేసినా కొందరు అడ్డుపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. కొందరు నేతలు తాము ఇక్కడకు వస్తానని చెబుతున్నారని, ఆయన వచ్చి రెచ్చగొడతారని అన్నారు. రాజధాని గురించి చరిత్ర రాస్తే అందులో మొదటి స్థానం భూములిచ్చిన రైతులకే ఉంటుందన్నారు.
ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు..
ఉదయం విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో కలియ తిరిగిన సీఎం పాత ప్రభుత్వాస్పత్రిలో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి వార్డులో ఆడ బిడ్డ పుడితే రూ.300, మగ బిడ్డ పుడితే రూ.500 లంచం తీసుకుంటున్నారని కొందరు మహిళలు ఆయనకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వైద్యులను పిలిపించి మీ ఆడవాళ్ల దగ్గరా ఇలాగే చేస్తారా, తమాషా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.