సింగపూర్ రాజధాని మూడెకరాలే!
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సింగపూర్ మోడల్ తీసుకుంటామని చెబుతున్నారని.. కానీ వాస్తవానికి సింగపూర్ రాజధాని కేవలం మూడెకరాల్లోనే ఉందని ప్రముఖ రైతు నాయకుడు యలమంచిలి శివాజీ అన్నారు. రాజధాని భూసేకరణ అంశంపై రైతుల్లో అనేక భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో 'సాక్షి' ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని.. రైతులకు అవగాహన కలిగేలా వివరణాత్మకంగా మాట్లాడారు. నూజివీడు ప్రాంతంలో 30వేల ఎకరాల అటవీ భూమి ఉందని చెబుతున్నారు గానీ, అదంతా కేవలం కాగితాల మీద ఉందే తప్ప.. ఒక్క గజం కూడా మిగల్లేదని, మొత్తం ఆ భూమినంతటినీ ఆక్రమించుకుని తోటలు వేసుకున్నారని శివాజీ అన్నారు. ఊహాజనితమైన లెక్కలతో వెళ్లడం కాకుండా.. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూముల్లో నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. కేవలం భూమి ఉన్న యజమానులు మాత్రమే కాక, ఆయా ఊళ్లలో ఉండే చిరు వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని, వాళ్ల జీవితం గురించి కూడా పట్టించుకోవాలని అన్నారు.
శాఖాధిపతులకు హైదరాబాద్లో పనేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలను లండన్లో పరిపాలించినట్లుగా ఉందని యలమంచిలి శివాజీ విమర్శించారు. ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకున్నా.. వాటిని అమలుచేయాల్సింది క్షేత్రస్థాయిలోనే కాబట్టి, శాఖాధిపతులంతా వెంటనే ఈ ప్రాంతానికి రావాలని ఆయన గట్టిగా చెప్పారు. ఇంత విస్తారమైన రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు కూర్చుని మాట్లాడుకోడానికి సరిపడ ఒక్క ఆడిటోరియం కూడా లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. నాగార్జున యూనివర్సిటీ వాళ్లు తమ ఆడిటోరియాన్నే ఇవ్వమని చెబుతున్నారు.. మరి కొన్ని తరాలుగా సాగుచేసుకుంటున్న భూమిని రైతులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. నాగార్జున యూనివర్సిటీలో పనిచేసే ఏ ఒక్కళ్లూ కూడా అక్కడ నివాసం ఉండట్లేదని గుర్తు చేశారు.