సాక్షి, అమరావతి: స్కిల్ స్కాంలో ప్రభుత్వ ఖజానాను దోచేసి అడ్డంగా దొరికిపోయిన గజదొంగ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్టుచేయడం దేశానికి అరిష్టమన్నట్లుగా ఆ పార్టీ నేతలతో కూడిన దొంగల ముఠా పచ్చి అబద్ధాలు వల్లిస్తోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో గత 20 రోజులుగా ఆ ముఠా ఏం మాట్లాడినా వాటిని ప్రచురించి, ప్రసారం చేస్తూ ఐదుకోట్ల మంది ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి ఎల్లో మీడియా శక్తివంచన లేకుండా కృషిచేస్తోందని ఎద్దేవా చేశారు.
లక్ష మంది గోబెల్స్ కలిస్తే చంద్రబాబు అవుతాడని.. ఆయనకు రామోజీరావు, రాధాకృష్ణలు కలిస్తే గోబెల్స్ ముఠా అవుతుందంటూ ఘాటుగా విమర్శించారు. ఈ దొంగలందరూ కలిసిన టీడీపీని తోడు దొంగల పార్టీగా సజ్జల అభివర్ణించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగే బాధితుడన్నట్లుగా భ్రమింపజేయడం ద్వారా ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నించడం ఘోరమన్నారు. కక్ష సాధించాలనుకుంటే ప్రాథమిక ఆధారాలతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే చంద్రబాబును అరెస్టుచేయించే వారన్నారు.
స్కిల్ స్కాంలో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేయడానికి చంద్రబాబే సూత్రధారి అనడానికి బలమైన సాక్ష్యాధారాలు దొరకడంతోనే సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టుచేశారని.. వాటి ఆధారంగానే ఆయనను కోర్టు రిమాండ్‌పై జైలుకు పంపిందని సజ్జల గుర్తుచేశారు. న్యాయవ్యవస్థ చంద్రబాబును జైలుకు పంపితే.. అది అక్రమ కేసు అంటూ రాష్ట్రపతికి ఫిర్యాదుచేసే స్థాయికి టీడీపీ చేరిందంటూ విమర్శించారు.
స్కిల్ స్కాం సహా అన్ని కుంభకోణాలపై అసెంబ్లీలో చర్చిద్దామంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు భయపడి అసెంబ్లీ నుంచి పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. గజదొంగకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి.. టీడీపీని వేధిస్తున్నారన్న భావనను తీసుకురావడానికి మేధావుల ముసుగులో మొన్న సీబీఐ మాజీ డైరెక్టర్.. నిన్న మణిపూర్ మహిళతో ఆ పార్టీ నేతలు, ఎల్లో మీడియా ప్రకటనలు ఇప్పిస్తున్నారని.. వాటిని నమ్మవద్దని ప్రజలకు సజ్జల విజ్ఞప్తి చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
ప్రజా ధనాన్ని దోచేసిన గజదొంగ బాబు!
► టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన ఏ స్కాంకైనా చంద్రబాబే సూత్రధారి. స్కిల్ స్కాం ఒప్పందాన్ని కొవ్వొత్తి కాంతిలో ఒప్పందం చేసుకున్నారట.. మరి చంద్రబాబు కనిపెట్టిన సెల్‌ఫోన్ లైట్ లేదా?
► ఫైబర్ గ్రిడ్‌లో ఈవీఎంల దొంగ వేమూరి హరికృష్ణప్రసాద్‌ను ముందుపెట్టి.. అక్రమంగా టెరాసాఫ్ట్‌కు పనులు కట్టబెట్టి.. రూ.114 కోట్లు కొట్టేసినట్లు ఆధారాలున్నాయి.
► రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని తొలుత పేదలను బెదిరించి, భయపెట్టి.. ఆ తర్వాత వాటిని కారుచౌకగా కాజేశారు.
► చంద్రబాబుపై కక్షపూరితంగా కేసు పెట్టారంటూ వామపక్షాలు మాట్లాడుతుండటాన్ని బట్టి చూస్తే.. వారు ఎంతకు అమ్ముడుపోయారన్నది అర్థమవుతుంది.
► అక్రమాలకు పాల్పడకపోతే చంద్రబాబు ఎందుకు పెండ్యాల శ్రీనివాస్, యోగేష్ గుప్తా, కిలారు రాజేష్‌లను పారిపోయేలా చేశాడు?
► లోకేశ్ ఢిల్లీలో ఎందుకు కూర్చున్నాడు? ఇక్కడుండి పార్టీని చూసుకోవచ్చు కదా?
అధికారం అంటే దోచుకోవడం కాదు..
► అధికారం అంటే దోచుకోవడమన్నది టీడీపీ సిద్ధాంతం. అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం అన్నది సీఎం జగన్ సిద్ధాంతం.
► హెరిటేజ్‌లో 2 శాతం వాటా అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి అన్నారు. రెండెకరాల ఆసామీ చంద్రబాబుకు హెరిటేజ్‌లో కేవలం 2 శాతం వాటా అమ్మితే రూ.400 కోట్లు ఎలా వచ్చాయో ప్రజలు ఆలోచించాలి.
► చంద్రబాబు అక్రమాలపై సీఐడీ విచారణ చేస్తోంది. ఇంకా కొత్త కేసులు కూడా నమోదుచేయవచ్చు. ఆ కేసుల్లో అరెస్టుచేస్తారనే లోకేశ్ రాష్ట్రానికి రావడంలేదని అంటున్నారు.
► పారిశ్రామికవేత్త అదానీని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కాకుండా రోడ్డు మీద కలుస్తారా? చంద్రబాబు చెట్టుకింద కూర్చుని పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపాడా?
► ముఖ్యమంత్రిని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కలిస్తే కూడా రాజకీయం చేయాలని ఎల్లో మీడియా చూడటం హేయం.
Comments
Please login to add a commentAdd a comment