నేను అధికార పక్షంలో లేనప్పటికీ, రైతాంగ సమస్యలపై ఎప్పుడు ఏది చెప్పినా.. వైఎస్ రాజశేఖరరెడ్డి సహృదయంతో స్వీకరించేవారు. ఆయనతో నా సత్సంబంధాలకు కులం, ప్రాంతం, పదవి ఏదీ అడ్డుగోడ కాలేదు. రైతుల కోసం పాటుపడేవారెవరైనా సరే తన సొంత మనుషులుగా, ఆత్మీయులుగా చూసేవారు. మనస్సు విప్పి మాట్లాడేవారు. సమస్యలు పరిష్కరించేవారు. రాష్ట్రంలోని రైతులకు కొండంత అండగా ఉండేవారు. ఆయనతో రాజకీయంగా విభేదించేవారైనా సరే.. రైతాంగం పట్ల ఆయనకున్న పక్షపాతాన్ని, వారి ఉద్ధరణ పట్ల ఆయనకు గల నిబద్ధతను కాదనలేరు. రాష్ట్రంలో రైతాంగానికి, వారి కోసం శ్రమించే మాబోటి వారందరికీ వైఎస్సార్ అకాల మరణంతో, పెద్దదిక్కును కోల్పోయినట్లు అయ్యింది.
డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డితో చాలా కాలంగా పరిచయమున్నా 1989లో కడప నుండి ఆయన లోక్‌సభకు ఎన్నికై వచ్చిన తరువాతనే వారిని దగ్గరగా చూశాను. అప్పట్లో నేను రాజ్యసభ సభ్యుడిని. వైఎస్సార్ తోటి కాంగ్రెస్ ఎంపీలు, సహచర మిత్రులతో పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పరివేష్ఠితుడై ఉండేవారు. ఆనాటి సహచరులందరినీ వదిలి పెట్టకుండా తనతోపాటుగా వారిని కూడా రాజకీయంగా పైకి తెచ్చారు. ఓ సందర్భంలో తన మిత్రుడికి కాకుండా అనంతపురంలో వేరొకరికి సీటు ఇవ్వనున్నారనే వార్త పొక్కడంతో.. తన చుట్టూ ఉన్న వారిని తోడు చేసుకొని తన మిత్రుడికి సీటివ్వాల్సిందే అని అధి ష్టానంపై ఒత్తిడి తెచ్చి ఒప్పించారు.
నడి వేసవిలో వైఎస్సార్ కఠోరమైన పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతటా పర్యటిస్తూన్న సమయం. 2003 జూలై 23న హైదరాబాద్‌లోని సుందరయ్యభవన్‌లో డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పుచ్చలపల్లి సుందరయ్య గారిని గూర్చి ఒక పుస్తకాన్ని ప్రచురించి దానిని నాకు అంకితమిచ్చారు. డాక్టర్ వై.ఎస్. ఆ గ్రంథాన్ని ఆవిష్కరించారు. నాటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సభకు అధ్యక్షులు. 1978–83 మధ్య శాసనసభలో సుందరయ్యగారు రాష్ట్రమంతటా నదీ జలాలను కనీసం ఒక పంటకయినా అందించాలని చేసిన ప్రసంగాలు తన చెవిలో యింకా మార్మోగుతున్నాయని ఆ దిశగా ఆలోచనలు చేయాలని వైఎస్సార్ వక్కాణించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే అదే స్ఫూర్తితో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటుగా జలయజ్ఞానికి ఆయన శ్రీకారం చుట్టడం గమనార్హం. ముఖ్యమంత్రయిన నెలా పదిహేను రోజులకు 2004 జూలై 4, 5 విజయవాడలో మకాం పెట్టి, 5వ తేదీ ఉదయం ప్రకాశం బ్యారేజీ మరమ్మతులు పరిశీలించారు.
పులిచింతల సాధనకై చిరకాలంగా ఈ జిల్లాల రైతాంగం పడుతున్న ఆందోళన వివరించాను. అక్టోబర్ 15, 2004న జలయజ్ఞంలో తొలి పునాదిరాయి పులిచింతలకే వేశారు. 30 ఏప్రిల్ 2005న పులిచింతల ప్రాజెక్టు బహిరంగ విచారణ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం రూ. 262 కోట్ల విలువగల పని. కాంట్రాక్టర్‌లో కరుకుదనం లోపించి అనుకొన్నట్లుగా పని జరుగలేదు. 23 మార్చి 2007 నాడు (వరల్డ్ వాటర్స్‌డే) ప్రపంచ జల దినోత్సవం ఏర్పాటు చేశారు, హైదరాబాద్ జూబ్లీహాల్‌లో జరిగిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, సహాయ నిరాకరణ చేస్తూన్న కాంట్రాక్టర్లను కాడికిందకు తేవాలని సూచించాను. దానితో జాప్యాన్ని సమీక్షించి, వేగం పుంజుకొనేట్లు చూడాలని అధికారులను ఆదేశించారు వైఎస్. ఆ తర్వాత 2005 మార్చి 23, 24, 25 తేదీల్లో దక్షిణాసియా వ్యవసాయ ఆర్థిక వేత్తల సమావేశాలు జరిగాయి. 25వ తేదీ మధ్యాహ్నం జూబ్లీహాల్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్. కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ గౌరవార్థం విందు ఏర్పాటు చేసి, మమ్ములనందరినీ ఆహ్వానించారు. అప్పటికే కొత్తగా శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాన్ని ప్రకటించారు.
రాయలసీమ, కోస్తా జిల్లాలకు మరొక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పవలసిన అవసరాన్ని వివరించాను. రాష్ట్ర వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డిని పిలిచి వెంటనే ఆమేరకు ప్రతిపాదనలు రూపొందించమని ఆదేశించారు. మరో వ్యవసాయ విశ్వవిద్యాలయం కన్నా ప్రత్యేకంగా ఉద్యానవన పంటల విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం బాగుంటుందేమోనన్నారు. వై.ఎస్. ఆలోచనలు, అనతికాలంలోనే కార్యరూపం దాల్చి తాడేపల్లిగూడెం దగ్గర వెంకట్రామన్నగూడెం కేంద్రంగా ఉద్యానవన విశ్వవిద్యాలయం రూపుదాల్చింది. అలాగే 2005 నవంబర్ 26న జూబ్లీహాల్‌లో వర్జీనియా పొగాకు రైతు సంఘం, ఇండియన్ పేజెంట్స్ ఫోరమ్‌ల ఆధ్వర్యంలో ఆచార్య యన్.జి.రంగా జన్మదిన వేడుకలు జరిపారు. ఆనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ బీటీ పత్తివిత్తనాలను అడ్డగోలు ధరలకు అమ్మడంపై ఆందోళన ప్రకటిస్తూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ధరలు తగ్గించాలని మనవి చేశాను.
అక్కడనే ఉన్న వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డిని పిలిచి శివాజీ చెప్పింది నిజమేనా అని విచారించి, దోపిడీకి గురవుతున్న రైతులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టవలసినదిగా ఆదేశించారు. దానిపై మూడోరోజునే విత్తన వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్యాకెట్ రూ. 1,650 అమ్మే విత్తనాలను రూ. 800కు అమ్మించారు. సీఎం దృష్టికి తెచ్చిన నలభై గంటలలోనే ఈ సమస్యలు పరిష్కరించడం విశేషం. దాని తర్వాత... గుత్త వ్యాపార నిరోధక సంస్థ వద్ద కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడింది.2007 ఖరీఫ్‌లో ధాన్యం కనీస మద్దతు ధర గోధుమతో సమానంగా ఉండాలని రైతాంగం, రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు మరొక రూ. 75 రాష్ట్ర ప్రభుత్వం జోడిస్తే దానంతటదే మార్కెట్ ధర ఆ మేరకు పెరుగుతుందని సవివరంగా ఓ నివేదిక తయారు చేసి వై.ఎస్.కిచ్చాను. దాని వలన రాష్ట్ర ఖజనాపై భారం పడకుండానే ధాన్యం ధర పెంచగలమని వివరించాను. దానిపై వ్యవసాయ కమిషనర్ సుకుమార్, పౌర సరఫరా శాఖ అధికారులతో చర్చించారు.
చివరికి ఏమయ్యిందోగాని.. 2007 జూలై 25, 26 తేదీలలో వ్యవసాయదారుల రుణగ్రస్తతపై ఓ జాతీయస్థాయి సెమినార్‌ను గుంటూరులో నిర్వహించాం. ఆ సమావేశానికి పది మందికి పైగా ఐఏఎస్ అధికారులను, వ్యవసాయ విశ్వవిద్యాలయం, యితర విశ్వవిద్యాలయాలలోని ఆర్థికవేత్తలందరినీ గుంటూరు పంపారు. ఆనాడు చర్చించి రూపొందించిన నివేదికే.. 2008–09 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలో చోటుచేసుకొన్న రైతుల రుణ విమోచన పథకం. 2008 జనవరి 21న నేను, ఎస్.వి. పంతులు జరిగిన పరిణామాలను, సాధించిన ప్రగతిని వివరిస్తే సంబరపడ్డ వై.ఎస్. వెంటనే శరద్‌పవార్‌కు ఫోన్ చేసి శివాజీ పథకం ఎంతవరకూ వచ్చిందని విచారించారు. ‘ఇప్పుడే ఆర్థిక మంత్రి చిదంబరంతో చర్చించి వస్తున్నాను. రాబోయే బడ్జెట్ ప్రతిపాదనలలో దీనిని పొందుపరుస్తున్నాం’ అని చెప్పారు పవార్. దీని బదులు, ఇన్ పుట్ సబ్సిడీ యిస్తే ఎక్కువమందికి ప్రయోజనం కలుగుతుందని కొంత మంది పెద్దలు సూచిస్తే దీని మీద శివాజీ కొంత కృషి చేసి, ముందుకు తీసుకెళ్ళారు, ఈ దశలో మనం మరొకటి చెప్పడం బాగుం డదని సున్నితంగా వారించారట వై.ఎస్. 2007 సెప్టెంబర్ 20న ప్రకాశం బ్యారేజీకి 5.56 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. డెల్టా దెబ్బతిన్నది. వై.ఎస్. ఢిల్లీలో ఉండగా వారిని కలిసి డెల్టాను ఆధునీకరించాల్సిన అవసరం గురించి చెప్పాను.
ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచిం చాను. ప్రస్తుతం వున్నవి చేస్తూ, ఈ ఏడాది పూర్తి వివరాలతో అంచనాలు రూపొందించి, వచ్చే ఏడాది ప్రారంభిద్దామన్నారు. అన్నట్లుగానే 2008, జూన్‌లో అవనిగడ్డలో పునాది వేసి శంకుస్థాపన గావిం చారు. అయితే కాంట్రాక్టర్లు అంతగా ముందుకురాక, అనుకొన్న ప్రగతి కనపడలేదు. పులిచింతల పర్యావరణ తదితర అనుమతులు గాని ఏదైనా సరే వారి దృష్టికి తేవడమే ఆలస్యం, వెంటనే స్పందించి పరిష్కరించేవారు. తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయిన తర్వాత, 2009 జూన్ 13 నాడు డాక్టర్ ధూళిపాళ్ళ సాంబశివరావుగారమ్మాయి వివాహంలో కలుసుకొన్నప్పుడు రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధిపై సవివరంగా ఒక నివేదిక తయారు చేస్తున్నానని చెప్పాను. అప్పుడే సహకార వ్యవసాయంపై వారికున్న ఆలోచనలు వివరించారు.
నేను అధికార పక్షంలో లేను. ఏ పదవిలోనూ లేను. పైగా ప్రాంతాలు వేరు, కులాలు వేరు. ఇవేవీ వైఎస్సార్‌కి, నాకు మధ్య సత్సంబంధాలకు అడ్డుగాలేవు. రైతాంగ సమస్యలపై ఎప్పుడు ఏది చెప్పినా, సహృదయంతో స్వీకరించేవారు. రైతుల కోసం పాటు పడేవారెవరైనా సరే తన సొంత మనుషులుగా చూసేవారు. మనస్సు విప్పి మాట్లాడేవారు, సమస్యలు పరిష్కరించేవారు. రాష్ట్రంలోని రైతులకు కొండంత అండగా ఉండేవారు. ఆయనతో రాజకీయంగా విభేదించేవారైనా సరే రైతాంగం పట్ల ఆయనకున్న పక్షపాతాన్ని, వారి ఉద్ధరణ పట్ల వారికి గల నిబద్ధతను కాదనలేరు. వ్యవసాయ రంగాన్ని బాగు చేసి రైతుల బ్రతుకుల్లో వెలుగు నింపుదామన్న ఆయన తపనను వైరిపక్షం వారు కూడా తప్పుపట్టలేరు. రాష్ట్రంలో రైతాంగానికి, వారి కోసం శ్రమించే మాబోటి వారందరికీ వైఎస్సార్ అకాల మరణంతో, పెద్దదిక్కును కోల్పోయినట్లు అయ్యింది. వారి ఆత్మకు శాంతి కలగాలని, భగవంతుని ప్రార్థిస్తూ, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
వ్యాసకర్త: డాక్టర్ యలమంచిలి శివాజీ, రాజ్యసభ మాజీ సభ్యులు, వ్యవసాయ రంగ నిపుణులు ‘ మొబైల్ : 98663 76735
Comments
Please login to add a commentAdd a comment