సాక్షి, నెట్‌వర్క్: ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన అన్నదాతకు చివరకు కన్నీరే మిగులుతోంది.. తీవ్ర వర్షాభావం, కరెంటు కోతలతో దిగుబడీ తగ్గి ఆవేదనలో ఉన్న రైతన్నకు... ఇప్పుడు ప్రభుత్వ ‘మద్దతూ’ కరువవుతోంది.. ఇదే అదనుగా వ్యాపారుల మార్కెట్ మాయాజాలం రైతులను నిలువునా దోచుకుంటోంది.. పంట విస్తీర్ణం తగ్గితే ధరలు పెరగాల్సింది పోయి మరింతగా తగ్గడం వారి అడ్డగోలుతనాన్ని పట్టిచూపుతోంది. కొద్దిరోజులుగా మార్కెట్‌కు వస్తున్న మిర్చి, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా మద్దతు ధర లభించడం లేదు..
తీవ్ర వర్షాభావం, విద్యుత్ సరఫరా సరిగా లేక రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీంతో పంటల ఉత్పత్తి కూడా తగ్గింది. ఇలా పంట విస్తీర్ణం, ఉత్పత్తి తగ్గినప్పుడు సహజంగానే రైతులకు ఎక్కువ ధర రావాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల మాయాజాలంతో రైతులకు ఎప్పటిలాగే కనీస మద్దతు ధర రావడమే కష్టంగా మారుతోంది. ప్రస్తుతం మార్కెట్‌కు ఎక్కువగా వచ్చే మిర్చి, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న వంటి పంటలకు ఆశించిన మేరకు ధరలు అందడం లేదు. మార్కెటింగ్ అధికారుల సహకారంతో వ్యాపారులు పంట నాణ్యత పేరిట రైతులను ముంచుతున్నారు. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఒక్క కందులు, సోయాకు మాత్రం కనీస మద్దతు ధర కంటే కొంత ఎక్కువగా ధర లభిస్తోంది.
భారీగా తగ్గిపోయిన సాగు..
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం ముందే చేతులు ఎత్తేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 65 లక్షల ఎకరాలు. ప్రతికూల పరిస్థితులతో ఈ ఏడాది 55 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ప్రధానంగా వరిసాగు బాగా తగ్గింది. ఇక మొక్కజొన్నను గత ఏడాది 6.25 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సారి 5 లక్షల ఎకరాల్లోనే సాగయింది. గత ఏడాది ఇదే సమయంలో మొక్కజొన్న క్వింటాల్‌కు రూ. 1,572 చొప్పున ధర లభించగా... ఇప్పుడు కనీస మద్దతు ధరకు సమానంగా రూ. 1,310 రావడమే కష్టంగా ఉంది. నాణ్యత పేరుతో కొన్ని చోట్ల వ్యాపారులు రూ. 950 మాత్రమే ఇస్తున్నారు. రబీలో ప్రధాన వాణిజ్య పంట మిర్చి. రాష్ట్రంలో ఈ సారి 1.25 లక్షల ఎకరాల్లో దీనిని సాగుచేశారు. గత ఏడాది ఇదే సీజన్‌లో మిర్చి క్వింటాల్‌కు రూ. 12,500 వరకు పలుకగా.. ఇప్పుడు మేలు రకం పంటకు కూడా రూ. 10 వేల వరకే వస్తోంది. ఇక కొన్ని చోట్ల నాణ్యత పేరిట రూ. 5 వేలు మాత్రమే ఇస్తున్నారు.
అంతా మాయాజాలం..
వరంగల్ జిల్లాలో ఆరు తడి పంటలు ఎక్కువగా సాగు చేయాలనే ప్రభుత్వ సూచనలతో వేరుశనగ సాగు పెరిగింది. ధర పరిస్థితి మాత్రం రకరకాలుగా ఉంటోంది. 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకు గరిష్టంగా రూ.4,570, కనిష్టంగా రూ.1,400 పలికింది. 2014 మార్చి నుంచి 2015 ఫిబ్రవరి 15 వరకు గరిష్టంగా రూ. 5,450, కనిష్టంగా రూ. 1,300 పలికింది. కొనుగోలు చేసే వారి ఆధిపత్యంతో వేరుశనగ రైతులు మార్కెట్‌లలో నిరసనలకు దిగుతున్నారు. నల్లగొండ జిల్లాలో ప్రధాన పంట వరి హెక్టారుకు 50 క్వింటాళ్లదాకా దిగుబడి వచ్చినప్పటికీ.. పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వ సంస్థలు, మిల్లర్లు తేమను సాకుగా చూపి మద్దతు ధర కంటే తక్కువగా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావం కారణంగా కంది, సోయా పంటల దిగుబడి బాగా తగ్గిపోయింది. హెక్టార్‌కు 7 నుంచి 8 క్వింటాళ్లకు మించి దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది.
పచ్చిదంటూ మోసం..
‘‘మార్కెట్‌కు 26 బస్తాల పచ్చి పల్లికాయ తెచ్చాను. క్వింటాల్‌కు ధర రూ. 1,800 అంటున్నారు. పచ్చిదనే పేరుతో వ్యాపారులు మోసం చేయాలని చూస్తున్నారు. పచ్చి పల్లికాయ ఎప్పుడు కూడా కనీసం రూ. 2,500 కన్నా తక్కువ పలకలేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.’’
- దండుగుల మొగిలి,
మేడారం పల్లి, వరంగల్
దిగుబడులు తగ్గాయి..
‘‘వేరుశనగ పంటను ఐడు ఎకరాల్లో వేసిన. వేలు పెట్టుబడి పెట్టాం. కానీ దిగుబడులు సరిగా రాలేదు. 200 బస్తాలు రావాల్సింది 140 బస్తాలే వచ్చింది. దిగుబడులు తగ్గడంతో పెట్టుబడులు రాని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి..’’
- నీల్యానాయక్,
దొంతికుంటతండా, మహబూబ్‌నగర్
మద్దతేది మహాప్రభో..!
Published Fri, Feb 20 2015 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement