మూడు రోజుల్లో విధుల్లోకి చేరకపోతే చర్యలంటూ షోకాజ్ నోటీసులు
సాక్షి, అమరావతి: న్యాయమైన తమ డిమాండ్లు తీర్చాలని శాంతియుతంగా సమ్మె చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పొట్ట కొట్టేందుకు కూటమి ప్రభుత్వం షోకాజ్ నోటీసు పేరుతో మరో అస్త్రాన్ని ప్రయోగించింది. డీఎస్సీ నుంచి గురుకుల టీచర్ల పోస్టులు మినహాయించాలని, కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లు (సీఆర్టీ)గా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే తదితర ప్రధాన డిమాండ్లతో గత నెల 16 వ తేదీ నుంచి రాష్ట్రంలోని 1,656 మంది గురుకుల టీచర్లు సమ్మె బాట పట్టారు.
రాష్ట్రంలోని విజయవాడ ధర్నా చౌక్‌తోపాటు సీతంపేట, పార్వతీపురం, పాడేరు గిరిజన సమీకృత అభివృద్ధి (ఐటీడీఏ) కార్యాలయాల వద్ద శాంతియుత ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే వారి డిమాండ్లను పరిశీలిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో సహా ఉన్నతాధికారులు రెండు దఫాలుగా ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 371 ఆశ్రమ పాఠశాలల నుంచి 550 మంది ఉపాధ్యాయులను గురుకులాల్లో బోధనకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.
గురుకుల ఔట్ సోర్సింగ్ టీచర్లు గతంలో ఉన్న షరతులకు లోబడి మూడు రోజుల్లో విధుల్లో చేరాలని, లేదంటే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు పరిగణించి తదుపరి చర్యలు తీసుకుంటామని తాజాగా గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ బెదిరింపులకు దిగారు. ఆయా గురుకుల కాలేజీల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ సంస్థలో పనిచేసే ఔట్ సోర్సింగ్ టీచర్లకు నోటీసులు అందిస్తున్నారు.
కాగా, గిరిజన గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న జేఎల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు 11 నుంచి 20 రోజులుగా అనుమతి లేకుండా సమ్మె చేస్తున్నారని ఆ షోకాజ్ నోటీసులో పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment