మెగా డీఎస్సీలో 1,143 పోస్టులు
కలపడంతో తమ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన
విజయవాడకు చేరుకున్న 300 మంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజన గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెన్‌డౌన్ చేపట్టి నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ కారణంగా తమ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే విషయమై శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి విన్నవించిన గురుకుల ఉపాధ్యాయులు శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు.
గిరిజన ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది విధులను బహిష్కరించి విజయవాడకు చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. గిరిజన గురుకులాల్లో సుమారు 1,650 మంది దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంతో తమ ఉద్యోగాలు పోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంతాల్లోని గురుకుల విద్యాలయాలకు సంబంధించిన 1,143 పోస్టులు ప్రతిపాదించారు.
దీంతో ఏళ్ల తరబడి కాంట్రాక్టు, ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో సేవలందిస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయాన్ని గిరిజన సంక్షేమ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పష్టమైన హామీ రాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు విధులను బహిష్కరించి విజయవాడ చేరుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరినట్టు గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి లక్ష్మీనాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment