బలిపీఠంపై భారత రైతాంగం
మనం ఆర్‌సీఈపీ ఒప్పందంపై సంతకాలు చేస్తే, ఏ సుంకాలూ లేని దిగుమతులు మన దేశంలో శాశ్వతంగా తిష్టవేస్తాయి. ఇది, 60 కోట్ల మంది రైతుల జీవనోపాధికి భద్రతను కల్పించే హక్కు మనకు లేకుండా చేస్తుంది.
వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టం రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఎదుర్కొనవలసిన అతి పెద్ద ఆందోళనకరమైన సమస్య. కాగా, పుష్కలంగా పంటలు పండి, చేతికి వచ్చాక ధరలు ఘోరంగా పతనం కావడం వల్ల రైతులు ఎదుర్కొనవలసి వస్తున్న విపత్కర పరిస్థితి అంతకంటే పెద్ద సమస్య. ‘ఉత్పత్తి చెయ్యి, నాశనమై పో’ అని నేను అనేది దీన్నే. రెండేళ్లు వరుసగా దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొన్న రైతులపైన ఎట్టకేలకు ఆ వాన దేవుడు అనుగ్రహం చూపాడు. గత రెండేళ్ల నష్టాలను కొంత వరకైనా భర్తీ చేసుకోవాలనే ఆశతో రైతులు కష్టించి పని చేశారు. పుష్కలంగా పంటలు పండించారు.
కానీ హఠాత్తుగా మార్కెట్‌లో ధరలు పాతాళానికి పడి పోయాయి. పప్పు, టమాటా, బంగాళదుంప, ఉల్లి, ఆవ, కూరగాయలన్నిటి ధరలు ఘోరంగా పడిపోయాయి. రైతుకు, పంటను రోడ్లపై కుమ్మరించిపోక తప్పని దుస్థితి ఏర్పడింది. రైతుల ఆగ్రహం భారీ నిరసనగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో మొదలైంది. పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతులు మరణించారు. రైతు సంఘాలు ఆగస్టు 9–15 మధ్య జైల్‌భరో ఆందోళనను మరింత భారీ ఎత్తున చేపట్టాయి. వ్యవసాయ రుణాల మాఫీని, ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభాన్ని ఇవ్వాలన్న స్వామినాథన్ కమిటీ సిఫారసును అమలు చేయాలని వారి డిమాండు.
కానీ, ప్రస్తుతం సాగుతున్న అంతర్జాతీయ వాణిజ్య చర్చలు భారత వ్యవసాయానికి మరింత పెద్ద ముప్పును తేనున్నాయని వారికి తెలియదు. నిజానికి ఆ ఒప్పందం అమల్లోకి వస్తే, భారీ సబ్సిడీలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను ఎలాంటి పన్నులూ లేకుండా, అడ్డూ అదుపూ లేకుండా దేశంలోకి అనుమతిస్తారు. ఈ దిగుమతులు, చిన్న రైతులను వ్యవసాయాన్ని వదిలి పెట్టేసేలా చేస్తాయి.
1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి వాణిజ్యపరమైన అడ్డంకులను, దిగుమతి సుంకాలను ఎత్తివేయాలని వర్ధమాన దేశాలను నిర్బంధించే యత్నాలు జరుగుతున్నాయి. దేశీయ మార్కెట్‌ను ఇతరుల కోసం బార్లా తెరవడం వల్ల భారత్‌కు పెద్దగా ఎలాంటి లాభమూ చేకూరలేదుగానీ, మన వ్యవసాయరంగానికి అపార నష్టం వాటిల్లిందని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి.
తిరువనంతపురానికి చెందిన తనల్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆర్. శ్రీధర్ డబ్ల్యూటీఓ ప్రోత్సాహంతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), ఆగ్నేయ ఆసియా దేశాల వాణిజ్య కూటమి (ఆసియాన్) ప్లాంటేషన్ పెంపకందార్ల జీవనోపాధిని ఎలా దెబ్బతీశాయో వివరించారు. ‘‘ఏడేళ్ల క్రితం, కేరళ ప్రభుత్వం, మేమూ కలసి దిగుమతి సుంకాల తగ్గింపు... కేరళపై, ప్రత్యేకించి రబ్బరు, మసాలా దినుసుల విషయంలో తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుంది’’ అని హెచ్చరించాం.
అలాగే దిగుమతులు పెరిగి, ధరలు పడిపోయాయి. తమ హెచ్చరికను పెడచెవిన పెట్టి∙ఒప్పందంపై సంతకాలు చేశారు. కానీ నష్టపోయిన రైతులకు లేదా ఉపా«ధులను కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని లేదా సహాయాన్ని అందించలేదు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందుతున్న 30% రైతులు తప్ప మిగతా వారు వ్యవసాయం వదలాల్సి వచ్చింది.
ఇప్పుడు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్‌సీఈపీ) కుదుర్చుకుంటున్నారు. వాణిజ్యం జరిపే వస్తువులలో 92 శాతంపై దిగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తివేయడాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఒప్పందం కింద ఒకసారి దిగుమతి సుంకాలను సున్నాకు తగ్గించాక, తర్వాత సుంకాలను పెంచడానికి వీల్లేదు. ఇది, డబ్ల్యూటీఓ సైతం విధించని నిబంధన. ఈ ఒప్పందంపై సంతకాలు చేయడానికి అంగీకరిస్తే, దిగుమతి సుంకాలే లేని దిగుమతులు మన మార్కెట్లో శాశ్వతంగా తిష్టవేస్తాయి. ఇది, 60 కోట్ల మంది రైతుల జీవనోపాధికి భద్రతను కల్పించే, పరిరక్షించుకునే హక్కు మనకు లేకుండా చేస్తుంది.
మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తిదారు. ప్రస్తుతం పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులపై 40 నుంచి 60 శాతం దిగుమతి సుంకాలున్నాయి. ఇది, స్థానిక డెయిరీలకు రక్షణను కల్పించి, స్థానిక పోటీతత్వాన్ని పెంపొందింపజేస్తోంది. పాల దిగుమతులకు తలుపులను బార్లా తెరవడంతో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల నుంచి చౌకగా లభించే పాలు దేశాన్ని ముంచెత్తుతాయి. ఆస్ట్రేలియాలో 6,300 మంది, న్యూజీలాండ్‌లో 12,000 మంది పాడి రైతులే ఉన్నారు.
అవి ఆ కొద్దిమంది రైతుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ దిగుమతులను రుద్దడానికి యత్నిస్తుంటే... 15 కోట్ల పాడి రైతుల జీవనోపాధిని త్యాగం చేయడానికి భారత్ సిద్ధమౌతోంది. మన ఐటీ నిపుణులకు మరిన్ని అవకాశాలను కల్పించడానికి అవి సుముఖతను కనబరచినంత మాత్రాన, భారత పాడి రైతులను బలిపీఠంపైకి ఎక్కించేస్తామనడం అర్థరహితం.
ఆర్‌సీఈపీ ఒప్పందం, పాలు, పాల ఉత్పత్తులకే పరి మితం కాదు. పళ్లు, కూరగాయలు, పప్పులు, బంగాళదుంపలు, మసాలా దినుసులు, ప్లాంటేషన్లు, విత్తనాలు, పట్టు, ప్రాసెస్డ్ ఆహారం తదితర మార్కెట్లన్నిటా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఈ ఆర్‌సీఈపీ చర్చలను పూర్తి రహస్యంగా సాగిస్తున్నారు. కొందరు వ్యక్తులు పకడ్బందీ ఏర్పాట్లతో రహస్యంగా జరిపే చర్చల ద్వారా జరిగే నిర్ణయాలు, చివరకు 99 శాతం జనాభా భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఇది పూర్తిగా అన్యాయం.
దేవిందర్ శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్ :hunger55@gmail.com