ప్రపంచవ్యాప్తంగా రైతులు తమ ఉత్పత్తి ఖర్చులను రాబట్టుకోవడానికి తపన పడుతున్న సమయంలోనే ఆక్స్‌ఫామ్ నివేదిక షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. గత రెండేళ్లలో ఆహార రంగ పరిశ్రమకు సంబంధించిన 62 మంది అత్యంత సంపన్నుల క్లబ్‌లో చేరిపోయారు. ఒక కార్గిల్ ఫుడ్ పరిశ్రమ కుటుంబంలోనే 12 మంది బిలియనీర్లు అయ్యారనీ, కోవిడ్‌కు ముందు ఈ కుటుంబంలో 8 మంది బిలియనీర్లు ఉండేవారనీ ఈ నివేదిక తెలిపింది.
సరకుల ధరలు విపరీతంగా పెరగడం, ఆహార రంగ ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, భూమి విలువలు రికార్డు స్థాయిలో పెరగడం, సాంకేతిక ఆవిష్కరణలు వెల్లువలా కొనసాగడం... ఉత్పాదకత పెంపుదల పేరుతో, ఆహార రంగ పరిశ్రమలో లాభాలు ఆకాశాన్నంటుతున్నాయి. సంపద పంపిణీలో ఎవరినీ వెనక్కు నెట్టకూడదనే సంక్షేమ భావన ఎప్పుడో గాలికి ఎగిరిపోయింది. కానీ ఆహార సరఫరా చైన్ సంస్థలు లాభాల మేటతో మురిసిపోతుండగా నిజమైన ఆహార ఉత్పత్తిదారైన రైతు ఎందుకు చిక్కిపోతున్నాడనే విషయం ఎవరికీ పట్టడం లేదు.
అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ అయిన కార్గిల్‌తో సహా నాలుగు ఆహార ధాన్యాల వాణిజ్య కంపెనీలు అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో 70 శాతాన్ని నియంత్రిస్తున్నాయి. కోట్లాదిమంది రైతులు ప్రతిఏటా సాగిస్తున్న ఆహార ఉత్పత్తులను వాణిజ్య కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే రైతులు ఉత్పత్తి చేస్తున్న సంపదను చాలా సులభంగా, వాణిజ్య కంపెనీలు చప్పరించి వేస్తున్నాయి.
వ్యవసాయరంగంలో సమస్యలకు పరిష్కారం అని చెబుతూ సాంకేతిక సంపన్న సంస్థలు నిత్యం సాంకేతిక మార్గాలను ప్రోత్సహిస్తున్నది నిజం. బతకడం ఎలాగా అని రైతులు ఘర్షణ పడుతున్న సమయంలోనే టెక్నాలజీ కంపెనీల స్టాక్‌లు అమాంతం పెరిగిపోతున్నాయి.
రుఫో క్వాంటిటేటివ్ అనే పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఇన్వెస్టర్, ‘ఆహారం సిలికాన్ వేలీలో పెరగదు’ (ఫుట్ డజ్ నాట్ గ్రో ఇన్ సిలికాన్ వేలీ) అనే చక్కటి ఆలోచనా త్మకమైన వ్యాసంలో ఈ ప్రశ్నను లేవనెత్తారు. ‘స్టాండర్డ్ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ’లో రుఫో ఈ వ్యాసం ప్రచురించారు. ‘మానవ చరిత్రలో ఏ దశలో కంటే కూడా ఆహార వ్యవస్థలో గత వందేళ్లలోనే అనేక ఆవిష్కరణలు జరిగాయి. ఈ ఆవిష్కరణలు అన్నిటి లక్ష్యం ఏమిటంటే ఆహార ధరలను తగ్గిస్తూ పోవడం, రైతులను దారిద్య్రం ఊబిలోకి నెట్టడం, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం మాత్రమే’’ అని ఆ వ్యాసంలో రుఫో పేర్కొన్నారు.
నిజానికి, ఈ సాంకేతిక ఆవిష్కరణలు అత్యధిక వ్యవసాయ ఆదాయాలకు దారితీయాలి. వాస్తవానికి రైతులు ఎంత ఎక్కువగా ఉత్పత్తి చేస్తే అంత అధికంగా వారి ఆదాయం తగ్గిపోతోంది. ఉదాహరణకు, ఈరోజు కెనడాలో ఒక గోధుమ రైతు సాధిస్తున్న మార్కెట్ ధరను పోల్చి చూస్తే, ఆ రైతు ముత్తాత ఆరు రెట్లు ఎక్కువగా సంపాదించేవాడు.
ఇప్పుడు పంజాబ్ విషయానికి వద్దాం. పంజాబ్ వార్షిక పంట ఉత్పత్తి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటున్నప్పటికీ పర్యావరణ విధ్వంసానికి కేంద్రంగా మారిపోయింది. టెక్నాలజీ ఇక్కడ పంట దిగుబడిని పెంచి ఉండవచ్చు. కానీ భూగర్భజలాన్ని మితిమీరి తోడేయడం వల్ల జలధారలు లోలోపలే ఎండిపోయాయి. రసాయన పెట్టుబడులు పర్యావరణాన్ని కుళ్లబొడిచేశాయి. నేల సాంద్రత క్షీణించి పోయింది. పంటల కుదుళ్లను తగులబెట్టడం వల్ల ఆ కాలుష్యం వాతావరణంలో కలిసిపోతోంది. వీటన్నింటి కారణంగా దేశ ధాన్యాగారమైన పంజాబ్ ఇప్పుడు ఆరోగ్య కరమైన, నిలకడైన వ్యవసాయ వ్యవస్థ వైవు పరివర్తన కోసం విలపిస్తోంది.
టెక్నాలజీ రాజకీయాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసు కోవడానికి పంజాబ్ ఒక మంచి అవకాశాన్ని అందిస్తోంది. భూగర్భ జలాలను పరిరక్షించడంపై కొనసాగుతున్న చర్చ, కొన్ని దశాబ్దాల క్రితం ఫిలిప్పైన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థను సందర్శించిన రోజులను నాకు మళ్లీ గుర్తుకు తెచ్చింది. వరి విత్తనాలను విత్తినా లేదా మొక్కలను నాటినా పంట దిగుబడిలో పెద్దగా తేడా ఉండదని అక్కడ ఒక అధ్యయనాన్ని చూశాను. ఆ అధ్యయనం తెలిపిన అంశాలపై ఆసక్తితోనూ, ఆసియాలోని పలు ప్రాంతాల్లో వరిగింజలను పొలంపై చల్లడం గతంలో ఎక్కువగా పాటించేవారని తెలిసి ఉండటంతోనూ, ఆ పరిశోధనా కేంద్రంలోని ఒక సీనియర్ రైస్ సైంటిస్టును దీనిపై ప్రశ్నించాను. ఆయన చెప్పిన సమాధానం నన్ను నివ్వెరపర్చింది. ‘మేం ట్రాక్టర్ పరిశ్రమకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఆసియా ఖండంలో 97 శాతం వరకు వరినే పండిస్తారు’
ఫిలిప్పైన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ మరొక అధ్యయనం ప్రకారం, వరిపొలంలో నేరుగా పురుగుమందులను చల్లినా, స్ప్రేయర్ ద్వారా చల్లినా క్రిమి సంహారక సామర్థ్య విషయంలో పెద్దగా తేడా ఉండదని తెలిసింది. కానీ మనం తెగుళ్లను సంహరించడానికి స్ప్రేయర్లే సమర్థమైనవని నూరిపోస్తున్నాం. విధానపరమైన మద్దతు, సబ్సిడీలు, సులభరీతిలో రుణ లభ్యత వంటి కారణాల వల్ల రైతులు మరింతగా యంత్రాలను కొనడానికి ముందు కొస్తున్నారు. రైతులు ముందుకు రావటం అనటం కంటే వారిచేత అవసరానికి మించి యంత్రాలను కొనిపిస్తున్నారు అంటే బాగుంటుంది. టెక్నాలజీని ఎవరూ వ్యతిరేకించరు. కానీ ఎల్లప్పుడూ ఖరీదైన బ్రాండెడ్ సాంకేతిక ఆవిష్కరణలే ఎందుకు అన్నదే ప్రశ్న. దివంగత సురీందర్ దలాల్ ఆవిష్కరించిన పత్తిపంటపై పురుగుమందులు చల్లే ‘నిదాన’ మోడల్ టెక్నాలజీ చాలా తక్కువ ఖర్చుతో సమర్థంగా పని చేస్తుంది. అయితే దీనికి యంత్రాలు అవసరం లేదు కాబట్టి హరియాణాలో నిదాన మోడల్ టెక్నాలజీని కొనేవారే లేకుండా పోయారు. వ్యవసాయంలో విదేశీ పెట్టుబడుల తగ్గింపు, తక్కువ మెషిన్లు అవసరమయ్యే స్వావలంబన టెక్నాలజీల వినియోగం వైపు మన ఆలోచనలు మారాల్సిన అవసరం ఉంది. (క్లిక్: ఆయన పర్యటన ఏం సాధించినట్లు?)
- దేవీందర్ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్: hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment