మార్కెట్లే మరణ మృదంగాలు
విశ్లేషణ
కార్పొరేట్ సంస్థలకు భారీ ఎత్తున పన్ను రాయితీలు ఇస్తారు. గడచిన మూడేళ్లలో అంటే 2013–2016 సంవత్సరాలలో ఇచ్చిన ఆ రాయితీ రూ. 17.15 లక్షల కోట్లు. అలాగే కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేస్తే భూమి ఉచితంగా ఇవ్వడం రివాజుగా జరుగుతూ ఉంటుంది. తక్కువ ధరకు విద్యుత్, నీరు సరఫరా చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, ఆదాయ పన్ను హాలిడేను కూడా ప్రకటించడం చూస్తూ ఉంటాను. అయినా కావాలని పన్ను ఎగ్గొట్టే వారి జాబితా అలా కొల్లేరు చేంతాడంత ఎందుకు పెరిగిపోతుందో మాత్రం నాకు అర్థం కాదు.
గిట్టుబాటు ధర లేక తీవ్ర నిరాశా నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి కాస్త ఉపశమనం కలిగించమని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. కందిపప్పుకు కనీస మద్దతు ధర మీద రూ. 1,000 బోనస్‌గా ప్రకటించాలని కోరిన సందర్భంలో ఖర్గే కేంద్రానికి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. రెండేళ్ల వరుస దుర్భిక్షాల అనంతరం, 2016లో అనుకూల వాతావరణం ఏర్పడడంతో రైతుల ముఖాలలో కొంచెం ఆనందం కనిపిస్తుందని భావించారు.
సేకరణ ధర పెరుగుతుందన్న హామీతో రైతులు కూడా కష్టపడి అధిక దిగుబడిని సాధించారు. కానీ అధిక దిగుబడి సాధించిన ఆనందం కూడా ఎంతోసేపు నిలువలేదు. బహిరంగ విపణిలో కందిపప్పు ధర పతనం కావడమే ఇందుకు కారణం. కనీస మద్దతు ధర హామీ కూడా వారి ధైర్యాన్ని కలిగించలేకపోయింది. క్వింటాల్ ఒక్కంటికి ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 5,050. కానీ దేశవ్యాప్తంగా రైతులకు దక్కినది మాత్రం క్వింటాల్‌కు రూ. 4,200 మాత్రమే. అదికూడా మండీల ముందు పదిరోజులు పడిగాపులు పడిన తరువాత కోత కోసిన ఈ ధర లభిస్తున్నది.
ప్రకటించిన మద్దతు ధర కూడా రాదు
క్వింటాల్ కందిపప్పు ఉత్పత్తికి స్థానికంగా అయిన వ్యయం రూ. 6,403 అని కర్ణాటక వ్యవసాయోత్పత్తుల ధర కమిషన్ చెప్పింది. అంటే రైతులు పెట్టిన పెట్టుబడి కంటే దాదాపు రెండువేల రూపాయలు తక్కువగానే రైతులు పొందుతున్నారు. ఖర్గే మరో సంగతి కూడా చెప్పారు. గోరు చుట్టు మీద రోకటి పోటులా ఈ సంవత్సరం ప్రభుత్వం 27.86 లక్షల టన్నుల కందిపప్పును, క్వింటాల్ ధర రూ. 10,114 వంతున దిగుమతి చేసుకుంది (గడచిన ఏడాది 57 లక్షల టన్నులు దిగుమతి చేశారు).
అందుకే, కందిపప్పు దిగుమతికి ఏ ధర చెల్లించారో, అదే ధరను ఇక్కడి రైతుల నుంచి సేకరించినప్పుడు కూడా చెల్లించాలని ఖర్గే ప్రభుత్వాన్ని కోరారు. ఒక్క కందిపప్పు విషయమే కాదు, అన్ని అపరాల పంటల పరిస్థితీ ఇలాగే ఉంది. పెసర, మినుము ఉత్పత్తుల విషయంలో కూడా రైతులు నిరాశాజనకమైన పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. అపరాల దుస్థితినే ఆవపంట కూడా ఎదుర్కొంటున్నది. అనుకూల వాతావరణంతో పాటు, సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో ఈ సంవత్సరం ఆవపంట దిగుబడి బాగా పెరిగింది.
దీనికి కనీస మద్దతు ధరను రూ. 3,700 (క్వింటాల్ ఒక్కంటికి) నిర్ణయించినా, రైతుకు రూ. 3,500 దక్కడం కూడా గగనమైపోయింది. ఆగ్రహించిన రైతన్న తాను పండించిన టొమేటో, బంగాళదుంప, ఉల్లి పంటలను రోడ్డు మీదకు విసిరివేస్తున్న సంగతిని నివేదిస్తూ దేశం నలుమూలల నుంచి వార్తా కథనాలు వెలువడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎండుమిర్చి రైతులు కూడా అదేబాటలో ప్రయాణిస్తున్నారు. మిర్చి యార్డుల దగ్గర ఉత్పత్తులను దగ్ధం చేస్తున్నారు.
పంట చేతికొస్తుంది, ధర పడిపోతుంది...
వ్యవసాయోత్పత్తుల ధరల పతనాన్ని పరిశీలిస్తే ప్రతి ఏటా జరిగే ఈ తంతు ఒక అంకెల గారడీని మరిపిస్తూ ఉంటుంది. గడచిన సంవత్సరపు వార్తాపత్రికలను లేదా గూగుల్‌లో అన్వేషించినా ఒక విషయం బోధపడుతుంది. అటు పంట రైతు చేతికి రావడం, ఇటు వాటి ధర పతనం కావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ధరలు పతనం కావడం లక్షలాది రైతు కుటుంబాల జీవనోపాధి భద్రతకు దారుణంగా తూట్లు పొడుస్తుందన్న సంగతిని గమనించడం లేదు. రైతులనూ, వారి కుటుంబాలనూ ఆ పరిణామం ఎంత కుంగదీస్తుందో గ్రహించడం లేదు. అసలు ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడరు కూడా.
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఈ దుస్థితికీ, అడ్డూ ఆపూ లేకుండా సాగుతున్న రైతుల ఆత్మహత్యలకు మూలం మార్కెట్ల వైఫల్యంలోనే ఉంది. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలోని లాతూర్‌లో ఒక విషాదఘట్టం చోటు చేసుకుంది. షీతల్ యాంకత్ అనే 21 సంవత్సరాల యువతి తమ పొలాల మధ్యలోనే ఉన్న బావిలో దూకి బలవన్మరణం పాలైంది. తన తండ్రి మీద మరింత రుణభారం మోపడం ఇష్టలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె రాసిపెట్టింది. రెండేళ్ల నుంచి కరువు. పంటలు చేతికి రాలేదు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేవు. కాబట్టి తండ్రిని మరింత రుణగ్రస్థుడిని చేయడం ఇష్టంలేకనే తాను తనువు చాలించింది. అప్పులిచ్చేవారు ఆమె వివాహానికి మరింత రుణం ఇవ్వడానికి వెనుకాడారు.
దానితో రెండేళ్లుగా ఆమె వివాహం వాయిదా పడుతోంది. అప్పు తెచ్చి తన పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు కాళ్లరిగేలా ఎలా తిరుగుతున్నారో ఆమె చూసింది. తన పెళ్లి ద్వారా తండ్రి ¯ð త్తిన మరింత రుణభారం పడకుండా ఆమె ఆత్మహత్యను ఎంచుకుంది. ఇక్కడ నా సందేహం ఒక్కటే. వ్యవసాయరంగం కేంద్రంగా సాగుతున్న ఇలాంటి దారుణ విషాదాలు, కలచివేసే దుర్ఘటనలు పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తల దృష్టికి రావా? పంట చేతికి రాగానే ధరలు పడిపోవడం, తాము ప్రకటించిన కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హామీ ఇవ్వకపోవడం వంటి పరిణామాల కారణంగానే మరింత నిరాశా నిస్పృహలలో కూరుకుపోతున్నారు. ఎప్పటికీ బయటపడలేని సాలెగూడు వంటి రుణ బంధంలో చిక్కుకుపోతున్నారు.
ఒక ఉదాహరణ చూద్దాం. సర్వశక్తులు ఒడ్డి రైతు మూడు మాసాలు శ్రమించి టొమేటో పంటను పండిస్తాడు. పంట చేతికి వచ్చే సమయానికి కిలోకు ముప్పయ్ నుంచి యాభయ్ పైసలకు ధర పడిపోతోంది. అయితే టొమేటో రైతును ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఏనాడూ చొరవ చూపడం లేదు. ఇప్పుడు రూ. 500 కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి గురించి మనకు గుర్తుకు వస్తుంది. దాని గురించి మనం విన్నాం. కానీ ఆ నిధిని ఏర్పాటు చేసినది వినియోగదారులకు సాయపడేందుకే. రైతులను ఆదుకునే ఉద్దేశంతో కాదు. ప్రతి ఏటా పెరిగిపోతున్న ఆ అప్పుల్లోనే కూరుకుపొమ్మన్నట్టుగా పేద రైతును విస్మరించారు.
ఉత్తరప్రదేశ్ ఆదర్శంగా...
పంజాబ్‌లో 98 శాతం గ్రామీణ ప్రాంత కుటుంబాలు రుణ బాధను అనుభవిస్తున్నాయి. ఇందులో 94 శాతం కుటుంబాలలో తెచ్చిన రుణం ఎక్కువ. వారికి లభిస్తున్న ఆదాయం తక్కువ. వీరి ఖర్చులు కూడా ఎక్కువే. ఇంకోమాటలో చెప్పాలంటే వ్యవసాయ రంగాన్ని అలుముకున్న ఈ నిరాశానిస్పృహలు మార్కెట్ ప్రేరేపిత పరిణామమే. మార్కెట్ల వైఫల్యం రైతులను మరింతగా అప్పుల్లో ముంచుతున్నది. దీని ఫలితమే వ్యవసాయ రుణాల మాఫీ గురించి మరింత గట్టిగా అడుగుతున్నారు. అందుకే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే రూ. 36,359 కోట్లు రుణ మాఫీ చేసింది.
దీనితో 92 లక్షల చిన్నకారు రైతులు తెరిపిన పడ్డారు. ఇది మంచి రాజకీయం మాత్రమే కాదు. మంచి అర్థశాస్త్రం కూడా. ఒక్కసారి ఆలోచించండి! లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తే ఎన్ని కుటుంబాలలో ఆడపిల్లలు తమ వివాహం పట్ల నమ్మకం ఏర్పరుచుకోగలుగుతారు? ఇదే పెద్ద మొత్తం కాదు. కానీ నిరంతరం రుణాల ఊబిలో కూరుకుపోయిన వారిని అడిగితే దాని విలువ తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని చాలా రాష్ట్రాలు రైతుల రుణాలను మాఫీ చేయవచ్చు. ఆర్థికవేత్తలు, బిజినెస్ పత్రికలు ఈ రుణమాఫీ చర్య పట్ల కన్నెర్ర చేస్తున్నారు.
విదేశీ బ్రోకరేజీ సంస్థ మెరిల్ లించ్ మరో అడుగు ముందుకు వేసి 2019 ఎన్నికల నాటికి రైతుల రుణమాఫీ భారం మొత్తం దేశ స్థూల జాతీయోత్పత్తిలో రెండు శాతానికి చేరుకుంటుందని అంచనా కట్టవచ్చు. అయితే కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం ద్వారా స్థూల జాతీయోత్పత్తి మీద పడిన భారం గురించి మెరిల్ లించ్ ఎప్పుడూ ఎందుకు అంచనా కట్టదో నాకు అర్థం కాదు. నిజానికి భారత్‌లో కార్పొరేట్ రుణ మాఫీ భవిష్యత్తులో దాదాపు 4 లక్షల కోట్ల వరకు ఉంటుంది. అది దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం?
రైతు రుణమాఫీపై గగ్గోలు
కార్పొరేట్ సంస్థలకు భారీ ఎత్తున పన్ను రాయితీలు ఇస్తారు. గడచిన మూడేళ్లలో అంటే 2013–2016 సంవత్సరాలలో ఇచ్చిన ఆ రాయితీ రూ. 17.15 లక్షల కోట్లు. అలాగే కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేస్తే భూమిని ఉచితంగా ఇవ్వడం రివాజుగా జరుగుతూ ఉంటుంది. తక్కువ ధరకు విద్యుత్, నీరు సరఫరా చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, ఆదాయ పన్ను హాలిడేను కూడా ప్రకటించడం చూస్తూ ఉంటాను. అయినా కావాలని పన్ను ఎగ్గొట్టే వారి జాబితా అలా కొల్లేరు చేంతాడంత ఎందుకు పెరిగిపోతుందో మాత్రం నాకు అర్థం కాదు.
‘ఇండియా స్పెండ్’ అనే సంస్థ లెక్కల ప్రకారం కావాలని పన్ను ఎగ్గొట్టిన 5,275 మంది బ్యాంకులకు బకాయి పడిన మొత్తం రూ. 56,521 కోట్లు. గడచిన పదమూడు సంవత్సరాలలో ఇలాంటి బకాయిలు 9 రెట్లు పెరిగాయి. కానీ ఈ వాస్తవం ఆర్థికవేత్తలు గాని, మెరిల్ లించ్ గాని మనకి వెల్లడించదు. దీనితో స్థూల జాతీయోత్పత్తిలో పడే భారం ఎంతో వెల్లడించదు. నాకు తెలిసి ఏ వ్యక్తి వ్యాపారం ప్రాణాంతక స్థితికి చేరే స్థాయిలో దివాళా తీయదు. వ్యాపార వర్గాల జీవన విధానం కూడా విలాసవంతంగా సాగుతూనే ఉంటుంది. కానీ రైతుల రుణ మాఫీ జరిగినప్పుడు మాత్రం ఎక్కడ లేని నిట్టూర్పులు వెలువడుతూ ఉంటాయి.
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
దేవిందర్‌శర్మ
ఈ మెయిల్ : hunger55@gmail.com