ప్రపంచ వాణిజ్య సంస్థ విధివిధానాలను నెరవేర్చడం కోసం దిగుమతి పన్నులను క్రమానుగతంగా తగ్గించడాన్ని భారత్ మొదలెట్టినప్పుడు ‘ఎల్లో రివల్యూషన్’ (నూనెగింజల ఉత్పత్తి) ద్వారా దేశం సాధించిన ఫలితాలు హరించుకుపోయాయి. వంటనూనెల దిగుమతిపై దేశం 300 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడితో దిగుమతి పన్ను రేట్లను ఒక దశలో జీరోకి తగ్గించేశారు. దీంతో స్వల్ప కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా భారత్ మారిపోయింది. పామాయిల్ సాగుకోసం భూమిని అధికంగా కేటాయించడానికి బదులుగా, మనం మర్చిపోయిన ‘నూనెగింజల విప్లవా’న్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది.
కొన్ని రోజుల క్రితం పామాయిల్‌ని దేశీ యంగా ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంటనూనెలు– ఆయిల్ పామ్‌పై జాతీయ మిషన్ (ఎన్‌ఎమ్‌ఈఓ–ఓపీ) కోసం రూ. 11,040 కోట్లకు ఆమోదముద్ర వేసింది. వంట నూనెల దిగుమతిపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే దీని లక్ష్యం. కాయధాన్యాలు, నూనెగింజలకు సంబంధించిన ఉత్పత్తి పరి స్థితులపై చర్చించడానికి ఒక టీవీ ప్యానెల్‌లో కూర్చున్నాను. ఆ ప్యానెల్‌లో నీతి ఆయోగ్ సభ్యుడొకరు ముఖ్యమైన సమాచారం తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో దేశీయ వంటనూనెల అవసరాల్లో 40 శాతం పైగా పామాయిల్ సాగు ద్వారా పూరించాలన్నదే ఈ పథకం లక్ష్యమట.
పర్యావరణ, వాతావరణ కారణాల వల్ల పామాయిల్ ఇప్పటికే ఆరోగ్యపరమైన వివాదంలో చిక్కుకుని ఉన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వ తాజా పథకం దిగ్భ్రాంతిని కలిగించింది. ఇతర వంటనూనెలతో పోలిస్తే పామాయిల్ ధర తక్కువ కాబట్టి నీతినియమాలు లేని వర్తకులు తరచుగా పామాయిల్‌ని ఇతర వంటనూనెలతో కల్తీ చేసి ప్రయోజనం పొందుతున్నారు. పైగా స్థానిక ఉత్పత్తి, స్థానిక అవసరాలపై ఆధారపడి దేశంలో అనేకరకాల ఆరోగ్యకరమైన వంటనూనెలు అంటే– ఆవ, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, కుసుమలు, వెర్రి నువ్వులు (ఒడిసలు) వంటి నూనె గింజలపై భారతీయులు సాంప్రదాయకంగా ఆధారపడి ఉన్నారు. అందుకే భారతీయులు పామాయిల్ పట్ల ఏ ఆసక్తీ చూపలేదు. పైగా పామాయిల్‌ని జంక్ ఫుడ్, ప్రాసెసింగ్ పరిశ్రమ, సౌందర్య ఉత్పత్తులు, షాంపూ, డిటర్జెంట్స్, క్యాండిల్స్, టూత్ పేస్టులు వంటి వేగంగా అమ్ముడయ్యే వినియోగదారీ ఉత్పత్తులలో ఉపయోగించడానికే పరిమితం చేస్తున్నారు.
పామాయిల్ దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రతిపాదిం చిన కేంద్ర పథకం గురించి మనం మొదటగా తెలుసుకుందాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమాచారం ప్రకారం 2025–26 నాటికి దేశంలో పది లక్షల హెక్టార్లలో పామాయిల్ తోటల సాగును పెంచాలనీ, 2029–30 నాటికి దీన్ని 16.7 లక్షల హెక్టార్లకు విస్తరించాలని కేంద్ర పథకం లక్ష్యం. ఈ కొత్త పంటలో చాలా భాగాన్ని పర్యావరణపరంగా దుర్బలంగా ఉండే ఈశాన్య భారత్‌లో, అండమాన్, నికోబార్ దీవుల్లో సాగు చేయనున్నారు. పామాయిల్ సాగుకోసం అవసరమైన ఉత్పాదకాలకు రాయితీ కల్పించడతోపాటు, ప్రారంభ సంవత్సరాల్లో ఎరువులపై ఖర్చును నూరుశాతం రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వనున్నారు కాబట్టి రైతులు పామాయిల్ సాగుపట్ల తప్పక ఆకర్షితులవుతారు. పైగా ధరల హెచ్చుతగ్గులను అధిగమించడానికి పామాయిల్ సాగుకు గ్యారంటీ ధర చెల్లిస్తామనే హామీని కూడా కేంద్ర పథకం ప్రతిపాదిం చింది. టోకు ధరల సూచీకి అనుగుణంగా గత అయిదేళ్లలో సగటు ముడి పామాయిల్ ధరపై ఆధారపడి పామాయిల్ ధరను నిర్ణయించనున్నారని సమాచారం. ఒకవేళ ప్రాసెసింగ్ పరిశ్రమ పామాయిల్ సాగు రైతులకు ఇచ్చిన హామీమేరకు ధర చెల్లించకపోతే, రెండు శాతం ప్రోత్సాహకాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది.
భారతదేశం తన వంట నూనెల అవసరాల్లో దాదాపు 55 నుంచి 60 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది కానీ, దిగుమతుల చెల్లింపుల అంతరం మొత్తంమీద రూ. 75 వేల కోట్లకు చేరుకుంది. పర్యావరణ వైపరీత్యాలకు ప్రధాన కారణం పెరుగుతున్న అడవుల నిర్మూలన, జీవవైవిధ్య విధ్వంసమేనని వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) పదేపదే హెచ్చరిస్తూ వచ్చింది. సహజ వర్షాటవుల స్థానంలో వైవిధ్య రహితమైన తోటలను సాగుచేసే ప్రయత్నాలు అత్యంత విలువైన జీవజాతులు నశించిపోయేలా చేస్తున్నాయని, కర్బన ఉద్గారాలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చూపించాయి. 2020 జనవరిలో సమర్పించిన ఒక నివేదిక ప్రకారం భారతీయ అటవీ పరిశోధనా, విద్యా మండలి కూడా జీవవైవిధ్య పరంగా మెరుగ్గా ఉన్న ప్రాంతాలను పామాయిల్ తోటల సాగుకు అప్పగించడంపై తీవ్రంగా హెచ్చరించింది.
భారీస్థాయిలో పెరిగిపోతున్న దిగుమతుల బిల్లును తగ్గించడానికి దేశీయంగా వంటనూనెల ఉత్పత్తిని పెంచాలనుకోవడంలో ఆర్థికపరంగా ఔచిత్యం ఉన్నప్పటికీ, 1993–94 నాటికే దేశీయ వంటనూనెల అవసరాల్లో 97 శాతాన్ని ఉత్పత్తి చేసి దాదాపుగా స్వయంసమృద్ధిని సాధించిన భారతదేశం... ఇంత తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా ఎలా మారిపోయిందన్నది పెద్ద ప్రశ్న. 1985–86లో భారత్ ప్రారంభించిన చమురుగింజల టెక్నాలజీ మిషన్ లక్ష్యం ఏమిటంటే, దేశీయ ప్రాసెసింగ్ ఉత్పత్తిని బలోపేతం చేస్తూనే నూనెగింజల ఉత్పత్తి పెంపుదలపై దృష్టిపెట్టడమే. దీన్నే తదనంతరం ‘ఎల్లో రివల్యూషన్’ అని ప్రశంసించారు.
వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒడంబడిక ప్రకారం భారతదేశం సోయాబీన్ మినహా ఇతర వంటనూనెలపై 300 శాతం వరకు దిగుమతి పన్నులు విధించవచ్చు. వంటనూనెల దిగుమతిపై దేశం ఇంత అత్యధిక శాతం పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడి కారణంగా ఎగుమతి పన్ను రేట్లను తగ్గించేశారు. ఇది ఏ స్థాయికి చేరుకుం దంటే ఒక దశలో దిగుమతి పన్నులు దాదాపుగా జీరోకి చేరుకున్నాయి. దీంతో చౌక నూనె దిగుమతుల వెల్లువ మొదలై దేశీయ నూనెగింజల సాగుదారులు రంగం నుంచే తప్పుకోవలసివచ్చింది.
దేశీయ వంటనూనె ఉత్పత్తిని ప్రోత్సహించే ఉత్తమ మార్గం ఏదంటే, ఎల్లో రివల్యూషన్ ఎక్కడ తన ప్రభను కోల్పోయిందో గ్రహించి, నూనె గింజల ఉత్పత్తిని తిరిగి పెంచడంపై దృష్టి పెట్టడమే. ప్రభుత్వం దేశంలోని పామాయిల్ సాగుదారులకు గ్యారంటీ ధర కల్పించాలని భావిస్తున్నట్లయితే, నూనె గింజల సాగుదారుల్లో చాలామంది చిన్న రైతులే కాబట్టి, వీరికి గ్యారంటీ ధరకు హామీని కల్పించకపోవడంలో ఎలాంటి హేతువును నేను చూడటం లేదు. ఆర్థిక నిచ్చెనలో రైతులు అత్యంత దిగువన ఉంటున్నారన్న వాస్తవాన్ని గుర్తించి గ్యారంటీ ధర, మార్కెటింగ్ వ్యవస్థ కల్పనతో నూనె గింజల సాగుకు తిరిగి ప్రాణం పోయాలి. ఇది ఆర్థికంగా చెల్లుబాటు కాగల ప్రత్యామ్నాయంగా మారితే అధిక నీటిని ఉపయోగించి వరి సాగు చేసే పంజాబ్ రైతులు కూడా తమ ప్రాధాన్యతను మార్పు చేసుకుంటారు.
పైగా ఆబ్సెంటీ భూస్వాములకు, కొద్దిమంది పారిశ్రామిక దిగ్గజాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే పామాయిల్ సాగుకి కాకుండా, నూనెగింజల సాగును ప్రోత్సహిస్తే అది దేశంలోని కోట్లాది సన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తుంది. ఎల్లో రివల్యూషన్ కుప్పగూలిపోయాక దేశంలో నూనె గింజల సాగుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పైగా నూనెగింజల సాగుకు భూముల విస్తరణ కోసం పెద్ద ఎత్తున సహజ అడవులపై వేటు వేయాల్సిన అవసరం లేదు.
దేశంలో భూగర్భజలాలు అడుగంటిపోవడానికి విస్తృతంగా గోధుమ, వరి పంటలను పండించడమే కారణమని నిపుణులు మొత్తుకుంటున్న సమయంలో, నీటిని అధికంగా ఉపయోగించుకునే పామాయిల్ సాగువైపు దేశాన్ని నెట్టడంలో అర్థం లేదు. సగటున ఒక పామ్ చెట్టు రోజుకు 300 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. ఒక హెక్టార్‌లోని పామ్ చెట్ల సంఖ్యను లెక్కించి చూస్తే పామాయిల్ తోటలు నీటిని తోడేస్తాయని చెప్పాలి. కాబట్టే మరో పర్యావరణ సంక్షోభంలో మనం కూరుకుపోవడానికి ముందుగా ఖర్చులు తగ్గించుకునే నిష్పత్తిని సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంది. పామాయిల్ సాగుకోసం సాగుభూమి విస్తరణను ప్రతిపాదించడానికి బదులుగా, మనం మర్చిపోయిన నూనెగింజల విప్లవాన్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది. నూనె గింజల్లో స్వయం సమృద్ధిని సాధించే మార్గం ఇదే.
వ్యాసకర్త: దేవీందర్ శర్మ
ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు
ఈ–మెయిల్ : hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment