పట్టణం నుంచి పల్లెకు మహా పయనం | Devinder Sharma Article On Agricultural Sector | Sakshi
Sakshi News home page

పట్టణం నుంచి పల్లెకు మహా పయనం

Published Sat, Apr 25 2020 1:42 AM | Last Updated on Sat, Apr 25 2020 1:42 AM

Devinder Sharma Article On Agricultural Sector - Sakshi

గత నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ డొల్లతనాన్ని ఒక్క దెబ్బతో కోవిడ్‌–19 కూల్చి వేసింది. సంపద సృష్టి ముసుగులో వ్యవసాయ రంగాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి కోట్లాదిమంది వ్యవసాయదారులను మహానగరాల్లో, పట్టణాల్లో కూలీలుగా మార్చిన అన్యాయపు ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ పెకిలించివేసింది. ఈ నేపథ్యంలో మనం మళ్లీ వెనక్కు వెళ్లాలి. వ్యవసాయం ఊతంగా సమస్త ఆర్థిక వ్యవస్థ మనగలిగే నూతన విధానం రూపొందాలి.

పట్టణాలకు వలస వెళ్లిన వ్యవసాయదారులు లాక్‌డౌన్‌ కారణంగా తిరిగి భారీ సంఖ్యలో గ్రామాలకు చేరుతున్న నేపథ్యంలో వారు వ్యవసాయానికే కట్టుబడేలా సత్వర నిర్ణయాలు తీసుకోవాలి. వ్యవసాయానికి మళ్లీ ప్రాణం పోయడం మాత్రమే మన ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రతిష్ట చేసి, ప్రకృతిని కాపాడుతుంది. అది మాత్రమే పక్షులను, సీతాకోక చిలుకలను తిరిగి మన బాల్కనీలోకి రప్పిస్తుంది. గత నాలుగు దశాబ్దాలుగా సాగిన అస్తవ్యస్త విధానాల దిశను వెనక్కు మళ్లించడం ఇప్పుడు తప్పనిసరి అవసరం.

ఇది ఏమాత్రం ఊహించనిది. అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన వాణిజ్య పత్రిక ది ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ‘‘మౌలిక సంస్కరణలు– గత నాలుగు దశాబ్దాల విధాన దిశను వెనక్కు తిప్పడం– చర్చకు పెట్టాలి’’ అనే పేరిట ఒక సంపాదకీయం రాసింది. నాలుగు దశాబ్దాలపాటు స్వేచ్ఛా మార్కెట్లపై విస్తృ తంగా ఆధారపడిన విధాన దిశను అనుసరించిన తర్వాత, కరోనా వైరస్‌ సాంక్రమిక వ్యాధి కొట్టిన దారుణమైన దెబ్బకు ఆ విధాన మార్గం పనికిరాదని ప్రపంచం గుర్తించింది. దాని తప్పుడు సంకేతాలు స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తున్నాయి.

చారిత్రకంగా, సాంక్రమిక వ్యాధుల నిష్క్రమణ తర్వాత ప్రపంచ పర్యావరణ వ్యవస్థ మార్పునకు గురైంది. కరోనా వైరస్‌ సాంక్రమిక వ్యాధి ప్రభావం కూడా గణనీయంగా తగ్గిన తర్వాత, ప్రపంచం తన మామూలు స్థితికి చేరుకున్న తర్వాత, అన్ని ప్రభుత్వాలూ మానవ సంక్షేమంపై ప్రాధాన్యతా బాట పట్టాల్సి ఉంటుందని భావిస్తున్నారు. కరోనా వైరస్‌ దెబ్బకు మార్కెట్లు కుప్పకూలిపోగా, ప్రజారోగ్యానికి, విద్యకు దశాబ్దాలుగా నిధులను తగ్గిస్తూ వచ్చిన క్రమం వెనక్కుపోయి ఈ రెండు రంగాలకు ప్రాధాన్యత లభిస్తుంది. అలాగే ఇంటినుంచే పనిచేయడం అనే పద్ధతిని కొనసాగించడం ద్వారా పట్టణాల ముఖ చిత్రం మౌలికంగా మారిపోనుంది. ఎందుకంటే కంపెనీల తలకుమించిన భారాన్ని ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ భావన గణనీయంగా తగ్గించనుంది.

లాక్‌డౌన్‌ అనంతర సమాజం
అయితే, అసమానతలను పెంచి పోషించి, సహజ వనరులు భారీ స్థాయిలో ధ్వంసం కావడానికి దారితీస్తూ నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచంలో కొనసాగిన నయా ఉదారవాద విధానాలు కోవిడ్‌–19 అనంతరం మార్పు చెందుతాయా అంటే మనం వేచి చూడాల్సిందే. అంతకు మించి  వాయు కాలుష్యం పలుచబడి నీలి ఆకాశం స్పష్టంగా కనిపించడం, అసాధ్యమనిపించిన గంగా, యమునా నదుల శుద్ధి, మనం దాదాపుగా మర్చిపోయిన పక్షులు మన బాల్కనీలలోకి తిరిగి రావడం వంటి లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు ఆనందంతో తిలకించిన దృశ్యాలు, కళ్లారా గమనించిన మార్పులు లాక్‌డౌన్‌ తీసేసిన తర్వాత మళ్లీ వెనక్కు పోతాయా అనే ప్రశ్నకు కూడా కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

కరోనా వైరస్‌ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలను వాస్తవంగానే స్తంభింపచేసింది. వ్యవసాయం మాత్రమే మనందరికీ జీవగర్రగా ఇప్పటికీ కొనసాగుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా యావత్‌ ప్రపంచాన్ని ఆవరించిన దూకుడు వినియోగదారీ సంస్కృతి ఒక్క దెబ్బకు కూలిపోయిన సమయంలో ప్రపంచ ఆహార నిల్వలు ప్రత్యేకించి భారతదేశంలోని ఆహార నిల్వలు మాత్రమే సాంక్రమిక వ్యాధికి వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. దేశంలోని ప్రజాపంపిణీ వ్యవస్థ అవసరాలకంటే మూడు రెట్లకు మించి దాదాపుగా ఏడు కోట్ల 70 లక్షల టన్నుల కొద్దీ పేరుకుపోయిన ఆహార నిల్వలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అనుకూల స్థితిలో ఉంది. మార్కెట్‌ ఆధారిత ఆర్థిక సంస్కరణల్లో భాగంగా జనాభాలోని 20 శాతం అవసరాలకు మాత్రమే ఆహార ధాన్యాలను పరిమితం చేసేలాగ ప్రభుత్వ ధాన్య సేకరణ వ్యవస్థను బలహీనపరుస్తున్నప్పటికీ (ప్రస్తుతం జాతీయ ఆహార భద్రత చట్టం కింద 67 శాతం జనాభాకు ఆహార ధాన్యాలు అందుతున్నాయి), భారత ఆహార సరఫరా మరో సంవత్సరానికి సరిపడేలా ఉండటం విశేషం.

ఊరు రమ్మంటోంది..
మన ఆహార నిల్వలు పెరుగుతున్న సమయంలో, తమ పిల్లలను చంకనేసుకుని నెత్తిపై సామాను పెట్టుకుని, తమగ్రామాలకు వెళుతున్న లక్షలాదిమంది వలస కూలీల చిత్రాలు మీడియా నిండా కనిపిస్తున్నాయి. ఆహారం దొరుకుతుందో లేదో తెలీని స్థితిలో వలస కూలీలు వందలాది కిలోమీటర్ల పొడవునా తమ గ్రామాలకు నడిచిపోతున్న వలసకూలీలు వాస్తవానికి వ్యవసాయాన్ని వదిలిపెట్టిన శరణార్థులు. వ్యవసాయం తమ మనుగడను దుర్భరం చేసిన స్థితిలో వీరు తమ గ్రామాలనుంచి వలస వెళ్లిపోయారు. మంచి జీవితం గడపాలనే ఆశతో నగరాలకు వెళ్లిపోయిన ఈ కూలీలు వాస్తవానికి తమ రోజువారీ కూలీలపైనే బతుకుతున్నారు. అంటే రోజులో సంపాదించే మొత్తం ఆరోజు వీరి కుటుంబ అవసరాలకే సరిపోతుంది. లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో నగరాలు వీరిని తోసిపారేసినప్పుడు తామెక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లడానికి వీరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో తప్పుడు ఆర్థిక విధానాల వైఫల్యం అతిస్పష్టంగా బట్టబయలైపోయింది. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా ఎండబెట్టిన ఈ విధానాల కారణంగానే లక్షలాదిమంది రైతులు సేద్యాన్ని వదలి నగరాలకు వలస వెళ్లిపోవలసి వచ్చింది. ఆర్థిక సంస్కరణలు చెల్లుబాటయ్యేందుకు సంవత్సరాలుగా వ్యవసాయాన్ని బలిపెడుతూ వచ్చారు. ప్రపంచబ్యాంకు సూచించింది ఇదేమరి. 1996లో ఎమ్‌ఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో ఒక కాన్ఫరెన్స్‌కు నేను హాజరయ్యాను. ఆ సదస్సులో నాటి ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఇస్మాయిల్‌ సెరగెల్డిన్‌ ప్రసంగిస్తూ వచ్చే 20 ఏళ్లలో అంటే 2015 నాటికి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస పోయే ప్రజల సంఖ్య బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల జనాభాకు రెండు రెండురెట్లకు మించి ఉంటుందని తెలిపారు.

పై మూడు దేశాల మొత్తం జనాభా 20 కోట్లు ఉంటుంది. అంటే పై అంచనా ప్రకారం 2015 నాటికే 40 కోట్ల మంది ప్రజలు భారతీయ గ్రామాల నుంచి పట్టణాలకు తరలి వెళ్లి ఉంటారు. అంటే ఆర్థిక సంస్కరణలు చెల్లుబాటు కావడానికి ఈ దేశంలోని పేదలు చెల్లించాల్సిన మూల్యం ఇదే అన్నమాట. అయితే పేదలకు ఇది కూడా బతుకు ఇవ్వలేనప్పుడు వారు మళ్లీ సొంత గూటికి అంటే గ్రామాలకు వెళ్లిపోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

మరలా సేద్యానికి మార్గం
ఇప్పుడు వలసకూలీలు తమ తమ గ్రామాలకు తిరిగివెళుతున్న దృశ్యాలు మనందరి మనస్సులలో బలంగా ముద్రపడిపోయాయి. ఈ నేపథ్యంలో మన వ్యవసాయం తిరిగి ఆర్థికంగా చెల్లుబాటయ్యేలా వ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవకాశాన్ని కోవిడ్‌–19 కల్పించింది. పరిశ్రమకు రిజర్వు కార్మిక శక్తిని సిద్ధం చేసేలా వ్యవసాయాన్ని కుదించిన పరిస్థితులను తొలగించాల్సి ఉంది. అదే సమయంలో న్యాయమైన ఆదాయం రైతుల చేతికి అందేలా వ్యవసాయాన్ని ఆర్థిక వ్యవస్థకు జీవగర్రగా మార్చాలి. ప్రజారోగ్యం, విద్యతోపాటు వ్యవసాయాన్ని పునరుద్ధరించడం  ద్వారానే విధాన ప్రణాళికలో వీటికి ప్రాధాన్యం లభిస్తుంది. వ్యవసాయానికి మళ్లీ ప్రాణం పోయడం మాత్రమే మన ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రతిష్ట చేసి, ప్రకృతిని కాపాడుతుంది. అది మాత్రమే పక్షులను, సీతాకోక చిలుకలను తిరిగి మన బాల్కనీలోకి రప్పిస్తుంది. అలాగే వాతావరణ మార్పు దుష్ప్రభావాల నుంచి మన భూగ్రహాన్ని పరిరక్షించవచ్చు.

దిశ, దశ రెండూ మారాలి
ఫైనాన్షియల్‌ టైమ్స్‌ చెప్పినట్లుగా గత నాలుగు దశాబ్దాలుగా సాగిన విధాన దిశను వెనక్కు మళ్లించడం తక్షణం సాగించాల్సి ఉంది. దీనికోసం ఒక నూతన అభివృద్ధి నమూనాను నిర్మించేందుకు సాహసంతో కూడిన విధాన నిర్ణయాలు జరగాల్సి ఉంది. అలాగే మార్కెట్‌ శక్తుల నుంచి లాబీలు జరిపే ఒత్తిడిని తట్టుకుని నిలిచే రాజకీయనాయకత్వం మద్దతు కూడా కావాలి. అంటే బలమైన ఆర్థిక చింతనను సవాలు చేసే అసాధారణ సామర్థ్యం మన నాయకత్వానికి ఉండాలి. సంపద సృష్టిమీదే పూర్తిగా ఆధారపడినటువంటి ఆర్థిక పురోగతి నమూనాను అప్పుడే తొలగించగలం. ఈ నమూనా ఇన్నాళ్లూ కింది నుంచి పైదాకా ఆదాయాలను నొక్కేసి సంపన్నులు బలిసేందుకే ఉపయోగపడింది. సమాజంలో స్థిరచిత్తం, వివేకం కలిగిన వారి వాణికి కొదవలేదు. అలాంటి వారిని కనుగొని, వారి పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం మళ్లీ వెనక్కు వెళ్లకూడని కొత్త మార్పు జరగబోతోంది. ఆ మార్పు కొనసాగుతుందని ఆశిద్దాం.


దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement