రైతన్నకు రాహు(ల్) కాలం | Farmers suffer with Rahul Gandhi policy | Sakshi
Sakshi News home page

రైతన్నకు రాహు(ల్) కాలం

Published Wed, Jan 22 2014 12:17 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రైతన్నకు రాహు(ల్) కాలం - Sakshi

రైతన్నకు రాహు(ల్) కాలం

 విశ్లేషణ: దేవిందర్ శర్మ, వ్యవసాయరంగ నిపుణులు
 
 వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టం నుంచి పళ్లు, కూరగాయలను మినహాయించాలంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చి రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలకు తెరతీశారు. ప్రభుత్వం వ్యవసాయోత్పత్తులకు సేకరణ ధరల విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాతనే రైతులు ఖాయంగా గిట్టుబాటు రేటును పొందడం మొదలైంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ కనీస మద్దతు ధరల వల్ల రైతులు ప్రయోజనం పొందుతున్నందున ఈ విధానాన్ని మరింత పటిష్టం చేయాలే తప్ప రద్దు చేయకూడదు.
 
 
 
 వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) చట్టం నుంచి పళ్లు, కూరగాయలను మినహాయించాల్సిందిగా కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరినట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో చెప్పారు. రాహుల్ హుకుం వెలువడిందే తడవుగా అనేక కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జనవరి 15వ తేదీనాటికే ఆమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఈ చర్యలు ఏమైనా తోడ్పడ్డాయా? అసలు వాస్తవం ఏమిటంటే...
 రాహుల్ గాంధీ నిర్ణయం అమల్లోకి వచ్చి ధరలపై ప్రభావం చూపడానికి చాలా ముందే డిసెంబర్‌లోనే నిత్యావసరాల ధరలు తగ్గిపోయాయన్నది ఇక్కడ గుర్తించాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీఎంసీ చట్టం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందా లేక అసలు తప్పంతా వేరే చోట ఉందా అన్నది గుర్తించడం ఎంతో ముఖ్యం. ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం.
 
 రైతుకు దక్కేది నాలుగు శాతమే!
 
 2012 డిసెంబర్‌లో మల్టీబ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిన మరునాడే ఒక ప్రధాన దినపత్రికలో ఆసక్తికరమైన కథనం వెలువడింది. రైతులనూ, వినియోగదారులనూ బడా రిటైల్ కంపెనీలు ఎడాపెడా ఎలా దోచేస్తున్నాయో ఈ కథనం కళ్లకు కట్టినట్టు వివరించింది. ఉదాహరణకు హోల్‌సెల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేసే భారతీ వాల్‌మార్ట్ పంజాబ్‌లోని కాం ట్రాక్టు రైతుల నుంచి బేబీ కార్న్ కిలోకు రూ.8 చొప్పున కొనుగోలు చేసి హోల్‌సేల్‌లో కిలోకు రూ.100 ధరకు విక్రయిస్తోంది. చివరకు వినియోగదారులు కిలోకు రూ.200 చెల్లించాల్సివస్తోంది. మరోవిధంగా చెప్పాలంటే వినియోగదారుడు చెల్లించిన అంతిమ ధరలో నాలుగు శాతం మాత్రమే రైతుకు దక్కుతోందన్నమాట. ఇక ధాన్యం విషయాన్నే తీసుకుందాం. ఏపీఎంసీ చట్టాన్ని బీహార్ 2006లోనే రద్దు చేసింది. రైతులు తమ పంటను ఇష్టం వచ్చిన వారికి తమకు నచ్చిన రేటుకు అమ్ముకునే స్వేచ్ఛను కల్పించింది. ఈ ఏడాది పంజాబ్ రైతులు తమ ధాన్యాన్ని క్వింటాలుకు సేకరణ ధర రూ.1,310 పొందగా, బీహార్ రైతులు అతి కష్టంమీద క్వింటాలుకు రూ.800-900 స్థాయిలో మాత్రమే అమ్ముకోగలిగారు. నిజానికి ఇది ఘోరమైన రేటు. ప్రైవేటు వ్యాపారులు నిర్దాక్షిణ్యంగా సాగించిన దోపిడీకి ఇదొక ఉదాహరణగా పేర్కొనవచ్చు.
 
 రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా కృషి చేయాల్సిన వ్యవసాయ ఖర్చులు, ధరలకు సంబంధించిన కమిషన్ (సీఏసీపీ), వ్యవసాయానికి సంబంధించినంతవరకు బీహార్‌లో మార్కెటింగ్ సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయని పేర్కొనడం విచిత్రంగా కనిపిస్తుంది. అనేక మండీలు (దుకాణాలు) ఉన్నందున పంజాబ్‌లోని రైతులకు ప్రతి ఏటా ఖాయంగా గిట్టుబాటు రేటు లభిస్తుంది. మార్కెట్ సౌకర్యాలు విస్తరిస్తున్న సమయంలో ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేసి మార్కెట్లకు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాల్సిందిగా సీఏసీపీ పంజాబ్ ప్రభుత్వాన్ని కోరుతోంది. మరో రకంగా చెప్పాలంటే పంజాబ్ రైతులను బీహార్ రైతుల బాట పట్టాల్సిందిగా కోరుతోందన్నమాట.
 
 లబ్ధి పొందేది 30 శాతం మంది రైతులే
 
 భారతదేశంలో దాదాపు 30 శాతం మంది రైతులు మాత్రమే ప్రభుత్వం ప్రకటించే సేకరణ ధరలను (కనీస మద్దతు ధరలు) పొందుతారు. మిగిలిన 70 శాతం మంది రైతులు గిట్టుబాటు ధరల కోసం మార్కెట్‌పై ఆధారపడాల్సిందే. ఈ విషయం బహుశా రాహుల్ గాంధీకి ఎవరూ చెప్పి ఉండరు. ఒకవేళ మార్కెట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన ఈ 70 శాతం రైతులకు వ్యవసాయం ప్రోత్సాహకరంగా ఉంటే, జీవనప్రమాణాలు పెంచే విధంగా ఉంటే ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా ఈపాటికే పంజాబ్, హర్యానాలోని రైతులు డిమాండ్ చేసి ఉండేవారు. మరి అలా జరగలేదు. దానికి స్పష్టమైన కారణాలున్నాయి. ఏపీఎంసీ చట్టంలో అనేక లొసుగులు ఉన్నప్పటికీ ఇది రైతులకు కచ్చితంగా గిట్టుబాటు ధరను ఇస్తుంది. ఈ కారణం వల్లనే ఇతర పంటలకు ఖాయంగా తగిన రేటు వస్తుందన్న గ్యారంటీ లేనందున పంజాబ్ రైతులు ఇతర పంటలకు మళ్లకుండా అనేక ఏళ్లుగా గోధుమలు, వరినే సాగు చేస్తున్నారు.
 
 ఏపీఎంసీ వ్యవస్థ గుత్తాధిపత్య మార్కెట్‌కు బాటలు వేస్తుందనీ, స్వేచ్ఛా వాణిజ్యానికి ఆటంకాలు కల్పించి రైతులకు సరైన రేటు రానివ్వదంటూ కొందరు ఆర్థికవేత్తలు చేసే వాదనలు నవ్వు తెప్పిస్తాయి. ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. ఏపీఎంసీ చట్టం ప్రకారం ఎంపిక చేసిన మండీల వద్దకు రైతులు తమ ఉత్పత్తులను తెస్తారు. మొదట ప్రైవేట్ వ్యాపారులను కొనుగోలు చేసేందుకు అనుమతిస్తారు. వారు కొనుగోలు చేయగా ఏమైనా మిగిలితే ఆ సరుకును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఆ తర్వాత మాత్రమే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగుతాయి. ఇదే వ్యాపారులకు చికాకు కలిగిస్తుంది. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించడం వ్యాపారులకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు. బీహార్‌లోని రైతుల నుంచి క్వింటాలుకు రూ.800-900కే ధాన్యాన్ని కొంటున్నప్పుడు పంజాబ్‌లోని రైతులకు ఏకం గా రూ.1,310 ధర ఎందుకు చెల్లించాలని వారికి అనిపిస్తుంది. ఏపీఎంసీని పూర్తిగా తొలగించాలని గుర్గావ్ వాణిజ్య, పారిశ్రామిక మండలి ఇప్పటికే హర్యానా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రైతుల నుంచి తక్కువ ధరకే ముడి సరుకులను కొనుగోలు చేయాలన్నది పారిశ్రామికవేత్తల ఆలోచన.
 
 మార్కెటింగ్ సౌకర్యాలు అంతంత మాత్రమే
 
 బీహార్‌లో ఏపీఎంసీ చట్టం రద్దయి ఏడేళ్లయిన తర్వాత కూడా వ్యవసాయంలో మార్కెటింగ్ సౌకర్యాలు విస్తృతం కాలేదు. రైతులను వారి ఖర్మానికి వదిలేశారు. ప్రభుత్వం మార్కెటింగ్ హంగులను పెంచలేదు సరి కదా, ప్రైవేటు రంగం ఈ దిశగా ఎలాంటి పెట్టుబడులూ పెట్టలేదు. నిజానికి వ్యవసాయ రంగంలో పచ్చగా ఉన్న పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న మౌలిక సౌకర్యాలను దోచుకుని ఇంకా లాభాలను గడించేందుకు పారిశ్రామికవర్గాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ప్రభుత్వం వ్యవసాయోత్పత్తులకు సేకరణ ధరల విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాతనే రైతులు తమ పంటకు ఖాయంగా గిట్టుబాటు రేటును పొందడం మొదలైంది. ఇది ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. రైతుకు గిట్టుబాటు ధర, కచ్చితమైన మార్కెట్‌తో హరిత విప్లవానికి పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ కనీస మద్దతు ధరల విధానంవల్ల రైతులు ప్రయోజనం పొందుతున్నందున ఈ విధానాన్ని మరింత పటిష్టం చేయాలే తప్ప రద్దు చేయకూడదు.
 
 దళారులను అరికట్టాలి
 
 ఇప్పుడు పనిచేస్తున్న మండీలలో కొన్ని లోపాలు ఉన్న మాటను ఎవరూ కాదనలేరు. వీటిని సరిదిద్దేందుకు ఏపీఎంసీ చట్టంలో తగిన నిబంధనలు కూడా ఉన్నాయి. రాజకీయ జోక్యం, శక్తిమంతమైన దళారుల వల్ల ప్రభుత్వం ఎన్నడూ దీనిలో జోక్యం చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఈ గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఏపీఎంసీ కమిటీ చైర్మన్‌గా ఒక రాజకీయ నాయకుడిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నియమిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు.  మండీల పరిధి నుంచి కూరగాయలను తప్పించడం, అది కూడా ఏపీఎంసీ చట్టానికి 2005 నాటి సవరణ తర్వాత నిర్ణయం తీసుకోవడం చూస్తే... ప్రైవేటు కొనుగోలుదారులకు రాజమార్గం కల్పించిన ట్టే. అంటే ప్రైవేటు వ్యాపారులు మండీలను పక్కకు నెట్టి ఇకనుంచి నేరుగా రైతుల నుంచి గోధుమలు, ధాన్యం కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న సేకరణ విధానాన్ని రాహుల్ గాంధీ ఈ పద్ధతిలో గండికొడుతున్నారన్న మాట. ఇది మొదటి చర్య మాత్రమే. త్వరలో ఇలాంటివి మరిన్ని నిర్ణయాలు రానున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా ఆహారరంగంలో మనం ఎంతో శ్రమకోర్చి నిర్మించుకున్న స్వయంసమృద్ధి పునాదులను రాహుల్ చాలా తెలివిగా పెకలించి వేస్తున్నారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement