'మేం చెబుతున్నా వినకుండా నో.. నో.. అనేశారు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఎన్డీయే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్‌టీకోసం అర్థరాత్రి పార్లమెంటును ఓపెన్ చేసిన ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు కనీసం నిముషం కూడా అనుమతించడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆయన రాజస్థాన్‌లో మాట్లాడుతూ..
'ఈ రోజు లోక్‌సభలో మేం రైతుల సమస్యలపై మాట్లాడాలని అనుకున్నాము. ప్రధాని నరేంద్రమోదీ కూడా సభలో ఉన్నారు. కానీ, మాట్లాడేందుకు మాకు అనుమతించలేదు. ధనికులకు, బడా పారిశ్రామికవేత్తలకు సంరక్షణ బాధ్యతను మాత్రమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూసుకుంటుంది.. పేదల గురించి కాదు. ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆత్రుతగా జీఎస్‌టీనీ ప్రవేశపెట్టారు. ఇదొక్కటి చాలు బీజేపీ ప్రవర్తనను తెలుసుకునేందుకు' అని చెప్పారు. 'చిన్న వ్యాపారులు నష్టపోతారని, రెండు మూడు నెలల తర్వాత జీఎస్‌టీని ప్రవేశపెట్టాలని మేం కోరాం. కానీ వారు మాత్రం కుదరదని జూలై 1 అర్దరాత్రి ప్రవేశపెట్టారు. దీనివల్ల బడా వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగదు. నష్టపోయేది చిరు వ్యాపారులే' అని రాహుల్ అన్నారు.