వ్యవసాయరంగంలో నిజ ఆదాయాలు పడిపోవడమే ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టంభనకు, మాంద్యానికి అసలు కారణం. ఆహారధాన్యాల ఉత్పత్తిలో పెరిగిన లాభం రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలో విఫలమైంది. గత రెండేళ్లలో వ్యవసాయరంగంలో నిజ ఆదాయం దాదాపు సున్నా శాతానికి పడిపోయింది. అందుకే దేశం ముందున్న అతిపెద్ద సమస్య ఏదంటే గ్రామీణ గృహ వినియోగాన్ని పెంచడమే. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో ఆదాయాలను పెంచడంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. ప్రతి రైతు కుటుంబానికీ ఏడాదికి రూ. 18,000లు లేక నెలకు రూ. 1,500లు అందేలా పీఎమ్ కిసాన్ పథకాన్ని విస్తరించాలి. జాతీయ ఉపాధి హామీ పథకానికి కూడా అదనపు కేటాయింపులు జరపాలి. వ్యవసాయ రంగంలో ధరల పాలసీ నుంచి ఆదాయ పాలసీకి అడుగులు పడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
మరో సంవత్సరం గడిచిపోయింది. రైతులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంచనాలు ఎక్కువగా ఉంటున్న సమయంలో 2019 కూడా చరిత్రలో కలిసిపోయింది. కానీ పంటలకోసం పెడుతున్న వ్యయాన్ని రాబట్టుకోవడంలోనే వ్యవసాయదారులు సతమతమవుతున్నారు. హామీ ఇచ్చిన మేరకు ధాన్యసేకరణ జరుగుతున్న కొన్ని పంటలను మినహాయిస్తే దేశవ్యాప్తంగా వ్యవసాయ పంటల ధరలు పడిపోతుండటంతో, రైతులు భారీ నష్టాల బారిన పడుతున్నారు. వ్యవసాయమే ఒక సంక్షోభంగా మారిపోపడంతో వ్యవసాయ కూలీలు కూడా ఆ భారాన్ని మోయాల్సి వచ్చింది. పైగా వ్యవసాయరంగంలో వేతనాలు అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
దాదాపు రెండు దశాబ్దాలుగా భారతీయ వ్యవసాయ రంగంలో నిజ ఆదాయాలు పడిపోతూ వస్తున్నాయి. 2019లో కూడా ఈ ధోరణి కొనసాగింది. గత సంవత్సరం ఏప్రిల్‌లో దేశంలో 42 శాతం భూభాగంలో తీవ్ర కరువు తాండవించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, బిహార్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కరువు తీప్రరూపం దాల్చింది. లోక్‌సభ ఎన్నికల సమయంలోనే కరువు ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో రైతుల దుస్థితి అంశం ఎన్నికల ప్రచారంలో పతాక స్థాయిని అందుకుంటుందని నేను భావిం చాను. కానీ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో కొంత మేరకు తప్పితే వ్యవసాయ సంక్షోభం దేశవ్యాప్తంగా రాజకీయనేతల స్పందనను ఆకర్షించడంలో విఫలమైంది.
తీవ్రమైన కరువుకు తోడుగా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు గతి తప్పడంతో పంట లకు భారీ నష్టం వాటిల్లింది. దీనికి తోడుగా, మహారాష్ట్రలో మూడేళ్ల నిరంతర కరువుబారిన పడి అల్లాడిపోయిన మరట్వాడ ప్రాంతంలో గత ఆగస్టు నెలలో ఉన్నట్లుండి కుండపోత వర్షాలు కురవడంతో అక్కడ అధిక వర్షంతో కరువు అనే కొత్త సమస్య వచ్చిపడింది. కానీ ఇంత విపత్కర స్థితిలోనూ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2018–19లో 281.37 మిలియన్ టన్నులకు పెరిగింది. 2013–14 నుంచి 2017–18 మధ్య అయిదేళ్లలో సాధించిన సగటు ఉత్పత్తికంటే 15.63 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉత్పత్తయింది.
అయితే కరువులు, భారీ వర్షాల నడుమనే రికార్డు స్థాయిలో పంటలు పండినప్పటికీ ఆహారధాన్యాల ఉత్పత్తిలో పెరిగిన లాభం రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలో విఫలమైంది. నీతి ఆయోగ్ ప్రకారం గత రెండేళ్లలో వ్యవసాయరంగంలో నిజ ఆదాయం దాదాపు సున్నాగా ఉండిపోయిందని తెలిసింది. అంతకు ముందు అయిదేళ్ల కాలంలో అంటే 2011–12 నుంచి 2015–16 మధ్య కాలంలో రైతుల నిజ ఆదాయం ప్రతి సంవత్సరమూ అర్ధ శాతం మాత్రమే పెరుగుదలను నమోదు చేసింది.
దురదృష్టవశాత్తూ, నిరుద్యోగం 45 ఏళ్లలో అత్యంత అధిక స్థాయికి పెరిగిపోవడం, ఆర్థిక వ్యవస్థ నిత్య మాంద్యంలో కూరుకుపోవడానికి 2019 సాక్షీభూతమై నిలిచింది. గ్రామీణ ప్రాంతంలో వినియోగాన్ని పెంచాలంటే వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి. ఆ విధంగానే మరింత డిమాండును అక్కడ సృష్టించవచ్చు. రైతులు పండించిన ప్రతి పంటకూ లాభం సాధించినప్పుడు మాత్రమే వ్యవసాయం ఉత్తమంగా మార్పు చెందగలదు. వ్యవసాయరంగం లాభదాయకంగా మారినప్పుడు పల్లెల నుంచి నగరాలకు వలస వెళ్లడం మారి నగరాల నుంచి పల్లెలకు వలస వెళ్లే ప్రక్రియ మొదలవుతుంది. దీంతో భారీ స్థాయిలో నిరుద్యోగ యువతకు వ్యవసాయ రంగం ఉపాధి కలిగిస్తుంది. అందుకే వెనకడుగేస్తున్న భారతీయ ఆర్థిక వ్యవస్థను తిరిగి ముందుకు తీసుకెళ్లగల శక్తి వ్యవసాయరంగానికి మాత్రమే ఉందని నేను తరచుగా చెబుతూ వస్తున్నాను.
గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రంగ ఆదాయాలు పతన బాట పట్టుతూ వస్తున్న చరిత్రకు వినియోగ వ్యయంపై ఖర్చుకు సంబంధించిన సర్వే రిపోర్టు సాక్షీభూతమై నిలిచింది.
ముందుగానే లీకైన 2017–18 సర్వే రిపోర్టు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలు ఆహార పదార్థాలపై సగటున నెలకు కేవలం రూ. 580లు మాత్రమే ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది. అంటే ఈ దేశంలో ఒక రైతుకుటుంబం ఒక రోజుకు ఆహారంపై పెడుతున్న ఖర్చు రూ. 19లు మాత్రమే అన్నమాట. ప్రపంచ క్షుద్బాధా సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) ప్రకారం 117 దేశాల్లో భారత్ 102వ స్థానంలో నిలిచింది. వ్యవసాయంపై నేటికీ 60 కోట్లమంది ఆధారపడి ఉన్న దేశంలో పడిపోతున్న వ్యవసాయరంగ ఆదాయాలకు, పడిపోతున్న గృహ ఆహార వినియోగానికి, ఆందోళన కలిగిస్తున్న ఆకలి బాధలకు మధ్య లింకును కనుగొనడం సులభమే అవుతుంది. అందుకే దేశం ముందున్న అతిపెద్ద సమస్య ఏదంటే గ్రామీణ గృహ వినియోగాన్ని పెంచడమే. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో ఆదాయాలను పెంచడంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంది.
2019 మధ్యంతర బడ్జెట్‌లో, వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష నగదు మద్దతును కల్పించడానికి ఒక ప్రయత్నం జరిగింది. నిత్యం బాధలకు గురవుతున్న రైతుల నష్టాలను పాక్షికంగా తగ్గించడానికి ఈ ప్రయత్నం చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు ఇలాంటి పథకం అందించాలని నేను పదేపదే చెబుతూ వస్తున్నాను. ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళన్ నిధి పథకం కింద దేశంలో భూమి ఉన్న ప్రతి రైతుకూ సంవత్సరానికి 6 వేల రూపాయలను అందించేలా ఒక ప్రొవిజన్‌ని చేర్చారు. దీనికోసం రూ. 75 వేల కోట్లను అదనంగా బడ్జెట్‌లో కేటాయించారు. 2018–19 బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయించిన రూ.57,000లతో పోల్చితే 2019 మధ్యంతర బడ్జెట్‌లో 114 శాతం పెరుగుదల కనబడుతుంది. అంటే ప్రత్యక్ష నగదు పథకం ద్వారా దేశంలోని ప్రతి రైతు కుటుంబానికి నెలకు రూ. 500ల కనీస సహాయం అందుతుందన్నమాట. వాస్తవానికి ఇది తక్కువ మొత్తంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయంలో ఇది సమూల మార్పుగానే భావించాలి. వ్యవసాయరంగంలో ధరల పాలసీ నుంచి ఆదాయ పాలసీకి అడుగులు పడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
దిగజారిపోతున్న దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం కలిగించడానికి పరిశ్రమల రంగానికి ప్రోత్సాహకాన్ని ఇవ్వడానికని చెప్పి గత సంవత్సరం కేంద్రప్రభుత్వం మన కార్పొరేట్ రంగానికి రూ. 1.45 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను రాయితీలను ప్రకటించింది. అంతే కాకుండా బ్యాంక్ మూలధనం కింద రూ. 75,000 కోట్లను, రియల్ ఎస్టేట్ ఉద్ధరణ కోసం మరో రూ. 25,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. కానీ దేశంలో నిజంగా వినియోగంపై డిమాండును పెంచాలంటే అసలైన మార్గం గ్రామీణ పేదల చేతుల్లోకి మరింత ధనం చేరేలా ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇది జరగాలంటే, ప్రధానమంత్రి–కిసాన్ పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం సమర్థ అమలుపై మరింతగా దృష్టిని సారించాల్సి ఉంటుంది. ఈ రెండు పథకాలూ మిగిలిన అన్ని ప్రభుత్వ పథకాల కంటే ఎంతో భిన్నమైనవి. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేవి.
ఈ సందర్భంగా నా సూచన ఏమిటంటే పీఎమ్ కిసాన్ పథకం కింద దేశీయ రైతులకు రూ. 1.50 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని అందించాలి. దీనివల్ల ప్రతి రైతు కుటుంబానికీ సంవత్సరానికి రూ. 18,000లు లేక నెలకు రూ. 1,500లు అందుతాయి. దీనికి అదనంగా పీఎమ్–కిసాన్ పథకాన్ని వ్యవసాయరంగంలో 40 శాతంగా ఉన్న భూమిలేని కౌలుదార్లకు కూడా అమలు చేసేలా విస్తరించాలి. అదే సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి కూడా అదనపు కేటాయింపులు జరపాలి. పైగా దాని అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. మొత్తంమీద నిజంగా అవసరమైనవారికి ఈ విశిష్ట పథకాల వల్ల కలిగే ప్రయోజనాన్ని అందించడం ప్రధానం కావాలి.
వీటితోపాటు వ్యవసాయరంగంలో, గ్రామీణాభివృద్ధి రంగంలో అనేక సంస్కరణలను తీసుకురావాలి. అప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతాల వినియోగంలో పెరుగుదల సాధ్యమై ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతుంది. కార్పొరేట్ రంగంకోసం పన్నుల రాయితీని లేక పన్ను కోతను కొంతకాలం నిలిపి ఉంచవచ్చు. కానీ పేదప్రజలకు రాయితీలను అందించడంలో ఏ పరిస్థితుల్లోనూ జాప్యం చేయవద్దు.
వ్యాసకర్త : దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్ : hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment