ఈ అసమానత్వం.. దురాశకు పరాకాష్ట | Devinder Sharma Article On Vaccination | Sakshi
Sakshi News home page

ఈ అసమానత్వం.. దురాశకు పరాకాష్ట

Published Fri, May 7 2021 4:04 AM | Last Updated on Fri, May 7 2021 4:05 AM

Devinder Sharma Article On Vaccination - Sakshi

ప్రజారోగ్యం విషయంలో అధిక లాభాల సాధన కోసం దురాశ అవధులు మీరిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి బదులుగా ప్రపంచ వాణిజ్య సంస్థకి చెందిన వాణిజ్యసంబంధిత మేధో సంపత్తి హక్కుల కింద పేటెంట్‌ రక్షణ పొందిన అతికొద్ది వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు యావత్‌ ప్రపంచాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. పేదలంతా కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందనిదే తాము ఏకాంత దంత శిఖరాలపై సురక్షితంగా ఉండలేమన్న వాస్తవాన్ని సంపన్నులు అర్థం చేసుకోవాలి. కోవిడ్‌ మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల 22 వేలమంది చనిపోయారు. మానవ జీవితాలను పణంగా పెట్టి అతికొద్ది కంపెనీలు భారీ లాభాలు ఆర్జించడాన్ని ప్రపంచం ఎలా అనుమతిస్తుందన్నదే ప్రశ్న.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి బదులుగా, ప్రపంచ వాణిజ్య సంస్థ ట్రిప్స్‌ (టీఆర్‌ఐపీ) ఒప్పందం కింద రోగ భద్రతపై గుత్తాధిపత్యాన్ని ఉపయోగించుకుంటున్న కొద్దిమంది వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు యావత్‌ ప్రపంచాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారు. బడా మందుల కంపెనీలు మాత్రమే కాదు.. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు సైతం వ్యాక్సిన్‌లను దొంగ నిల్వలు పెట్టుకుంటున్నారు. అధికాదాయం కల దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి వ్యాక్సిన్‌ అందిస్తుండగా, స్వల్పాదాయం కల దేశాల్లో ప్రతి 500 మంది ప్రజల్లో ఒకరికి మాత్రమే వ్యాక్సిన్‌ అందటం అనేది నిజంగానే కలవరపెడుతోంది. దీన్ని బట్టే వ్యాక్సిన్‌ అసమానత్వం హద్దులు మీరిపోయిందని తెలుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, పేదదేశాలు ఇప్పటివరకు 0.2 శాతం వ్యాక్సిన్‌ డోసులను మాత్రమే పొందగా, ధనిక దేశాలు 87 శాతం వ్యాక్సిన్‌ డోసులను పొందగలిగాయి. ఇక డోసుల విషయానికి వస్తే అమెరికాలో 32 శాతం మంది, బ్రిటన్‌లో 27 శాతం మంది, భారత్‌లో 2 శాతం మంది, ఫిలిప్పైన్స్‌లో 0.3 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ రెండు డోసులూ పొందగలిగారు. 

ఈ నిష్పత్తిలో ప్రపంచం పూర్తిగా కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే సంవత్సరాల సమయం పట్టేటట్టుంది. పైగా పేదవారికి వైరస్‌ నుంచి భద్రత కల్పించకుండా ప్రాణాంతక వైరస్‌ నుంచి తాము సురక్షితంగా ఉండలేమని సంపన్నులు గ్రహించాల్సి ఉంది. పైగా ప్రజారోగ్యం విషయంలో అధిక లాభాల సాధన కోసం దురాశ అవధులు మీరిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి బదులుగా ప్రపంచ వాణిజ్య సంస్థకి చెందిన వాణిజ్య సంబంధిత మేధో సంపత్తి హక్కుల కింద పేటెంట్‌ రక్షణ పొందిన అతికొద్ది మంది వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు యావత్‌ ప్రపంచాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. 

బడా మందుల కంపెనీలు మాత్రమే కాదు.. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు సైతం వ్యాక్సిన్స్‌లను దొంగ నిల్వ చేస్తూ పేటెంట్‌ రక్షణను తాత్కాలికంగా అయినా సరే.. తొలగించేటటువంటి ఎలాంటి చర్యనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒక్క అమెరికానే 6 కోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ డోసులను నిల్వ చేసిపెట్టుకుంది. పైగా, అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లను (భారత్‌లో కోవిషీల్డ్‌ అంటున్నారు) దేశీయంగా వినియోగించడం పట్ల ఆమోదం తెలపలేదు. అలాంటప్పుడు ఈ వ్యాక్సిన్‌ని అమెరికా నిల్వ చేసిపెట్టుకోవడ అర్థంపర్థం లేని విషయమని అర్థమవుతుంది.

కోవిడ్‌–19 వ్యాక్సిన్‌పై పేటెంట్‌ రక్షణను రద్దు చేయడానికి డబ్లు్యటీఓ అనుమతించాలని కోరుతూ భారత్, దక్షిణాఫ్రికా, తదితర అభివృద్ధి చెందుతున్న దేశాలు దరఖాస్తు చేశాయి కానీ, అమెరికా, ఇంగ్లండ్, ఈయూ, జపాన్, కెనడా, స్విటర్లాండ్, నార్వే, బ్రెజిల్, ఆస్ట్రేలియాతో కూడిన సంపన్న వాణిజ్య మండలి ఇలాంటి ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మేధోసంపత్తి హక్కుల రద్దుపై భారత్, దక్షిణాఫ్రికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడికి ప్రపంచ ఔషధ దిగ్గజాలు ఉత్తరం రాశాయి. అవి అమెరికా ప్రభుత్వ యంత్రాంగంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చాయి. ఏ కంపెనీకైనా ఒక పేటెంటుపై 20 ఏళ్లపాటు గుత్తాధిపత్యాన్ని ట్రిప్స్‌ ఒడంబడిక కల్పిస్తోంది.

ట్రిప్స్‌ ఒడంబడికలో అభివృద్ధి చెందుతున్న దేశాలు పేటెంటుపై తప్పనిసరి లైసెన్సు తీసుకునే అవకాశాన్ని కూడా ఒక నిబంధన ద్వారా కల్పించినందువల్ల అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఉత్పత్తి దారులు పేటెంట్‌ పొందిన ఉత్పత్తిని చేయడానికి ఆయా ప్రభుత్వాలకు అనుమతించినట్లయింది కానీ, పేటెంట్‌ గుత్తాధిపత్యం గురించి ఆందోళన చెందకుండానే వర్థమాన దేశాలు దీన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు కానీ వ్యాపారపరమైన ప్రతీకార దాడికి గురవ్వాల్సి వస్తుందనే భయంతో ఈ అవకాశాన్ని ఎంచుకోవడానికి ఆ దేశాలు సిద్ధపడటం లేదు. చివరకు ఇండియన్‌ పెటెంట్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 92ని ఉపయోగించి, పెటెంట్‌ హక్కు ఉన్న ఔషధాన్ని తయారు చేసేందుకు తప్పనిసరి లైసెన్స్‌ను జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు సైతం సూచించినప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం ముందుకెళ్లలేదు.

లాభాన్ని ఆశించని ధర వద్ద భారత్‌కి తన వ్యాక్సిన్‌ అందిస్తానని ఫైజర్‌ కంపెనీ తాజాగా ప్రతిపాదించినప్పటికీ పేటెంట్‌ సమస్యపై అది వెనక్కు తగ్గడం లేదు. వ్యాక్సిన్‌ సరఫరా చేయాలంటే తనకు సైనిక స్థావరాలను, సార్వభౌమాధికార ఆస్తులను తనఖా పెట్టాలంటూ ఈ ఔషధ కంపెనీ దిగ్గజం కొన్ని లాటిన్‌ అమెరికన్‌ దేశాలను కోరిన విషయం ఈ ఫిబ్రవరిలో ఒక టీవీచానెల్‌లో ప్రసారమైంది. ఇప్పటికే ఫైజర్‌ ఏడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. అర్జెం టీనా, బ్రెజిల్‌ దేశాలతో సంప్రదిస్తోంది కూడా. అర్జెంటీనా విషయంలో నైతే, దాని బ్యాంకు రిజర్వులను, సైనిక స్థావరాలను, రాయబార కార్యాలయాలను తనకు అప్పగించాలని ఫైజర్‌ సంస్థ కోరింది. బ్రెజిల్‌ను కూడా సైనిక స్థావరాలను, సార్వభౌమాధికార ఆస్తులను అప్పగించాలని కోరుతూనే, న్యాయవివాదాల కోసం అయ్యే ఖర్చులను చెల్లించడానికి అంతర్జాతీయ ఫండ్‌ని కూడా ఏర్పర్చాలని ఫైజర్‌ బ్రెజిల్‌ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ఒప్పందాలు వెనక్కి పోయాయనుకోండి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సరసమైన ధరలకే వ్యాక్సిన్‌ అందించడానికి తాను నిబద్ధతతో ఉన్నానని ఫైజర్‌ చైర్మన్‌ ఆల్బర్ట్‌ బౌర్లా తెలిపారు. ఇది ఆ కంపెనీ ద్వంద్వ ప్రమాణాన్ని సూచిస్తుంది.

పైగా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఫైజర్‌ తన సొంత నిధులను వెచ్చించలేదు. ప్రజాధనంతో ఈ వ్యాక్సిన్లను రూపొందించారు. ఉదాహరణకు, ఆపరేషన్‌ రాప్‌ స్పీడ్‌ పథకం ద్వారా అమెరికా వివిధ కంపెనీలకు వ్యాక్సిన్‌ పరిశోధన, తయారీ, సరఫరాల కోసం 12 బిలియన్‌ డాలర్ల మేరకు ఆర్థిక సహాయం అందించింది. అలాగే లండన్‌ లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఇంపీరియల్‌ కాలేజీలకు బ్రిటన్‌ ప్రభుత్వం 84 మిలియన్‌ పౌండ్లను అందించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆ తర్వాత అస్ట్రాజెనెకాతో ప్రపంచ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. జర్మన్‌ ప్రభుత్వం ఫైజర్‌ భాగస్వామి బయోన్టెక్‌కి 445 మిలి యన్‌ యూరోలను సహాయంగా అందించింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ డి సాచ్‌ కీలక వ్యాఖ్య చేశారు. మోడెర్నా, బయెన్టెక్‌–ఫైజర్, తదితర కంపెనీల మేధో సంపత్తి ఈ కంపెనీల సృజనాత్మక కృషి ఫలితం కాదని, అమెరికా ప్రభుత్వం, ప్రత్యేకించి జాతీయ ఆరోగ్య సంస్థ నిధులతో కొనసాగుతున్న విద్యా పరిశోధన ఫలితం కాదు. ప్రజాధనంతో, అకడమిక్‌ సైన్స్‌ సహా యంతో భారీగా ఉత్పత్తవుతున్న వ్యాక్సిన్‌లపై ప్రైవేట్‌ కంపెనీలు విస్తృత హక్కును ప్రకటించుకోవడం గర్హనీయమని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి చెందిన దేశాలకు వ్యాక్సిన్‌ టెక్నాలజీని సరఫరా చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా తాను వ్యతిరేకిస్తానంటూ బిల్‌గేట్స్‌ చేసిన తాజా ప్రకటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉత్పత్తిని శరవేగంగా చేయగలిగే శక్తిసామర్థ్యాలు భారత్, కెనడా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ తదితర దేశాలకు చెందిన పలు కంపెనీలకు ఉన్నాయి. మేధోసంపత్తి హక్కు రద్దు ద్వారా జెనెరిక్‌ మందులను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి కారుచౌకగా వాటిని అందించవచ్చు. ఈ సంక్లిష్ట సమయంలో ప్రపంచానికి అవసరమైంది ఇదే. కోవిడ్‌–19 మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల 22 వేలమంది చనిపోయారన్న విషయం మర్చిపోవద్దు. పేటెంట్‌ హక్కుపై చర్చ జరుగుతున్నప్పటికీ, మానవ జీవితాలను పణంగా పెట్టి వేళ్లమీద లెక్కించే కంపెనీలు భారీ లాభాలు ఆర్జించడాన్ని ప్రపంచం ఎలా అనుమతిస్తుందన్నదే ప్రశ్న.

వ్యాసకర్త: దేవీందర్‌ శర్మ 
ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement