సమాజ టీకా తోడవ్వాలి! | Corona Virus And Vaccination Guest Column By Dileep Reddy | Sakshi
Sakshi News home page

సమాజ టీకా తోడవ్వాలి!

Published Fri, Apr 2 2021 12:41 AM | Last Updated on Fri, Apr 2 2021 12:41 AM

Corona Virus And Vaccination Guest Column By Dileep Reddy - Sakshi

వైరస్‌ విజృంభణతో ‘కోవిడ్‌–19 రెండో ఉధృతి’ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ప్రభుత్వ అలసత్వం, ప్రజల నిర్లక్ష్యం.. వెరసి కోవిడ్‌ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికి వైద్య టీకాతో పాటు సామాజిక టీకా ముఖ్యం. ‘బహుముఖ పంథా కావాలి. ప్రభుత్వం– సమాజం కలిసి చేయాల్సిన కర్తవ్యమిది. అన్ని ఉపకరణాల్నీ ప్రభావవంతంగా వాడాలి. క్రమం తప్పని పరీక్షలు, వ్యాధి కట్టడి, పాజిటివ్‌లపై నిఘా, వైద్య రక్షణ, కోవిడ్‌– సముచిత అలవాట్లు, టీకా... వీటన్నిటి సమర్థ నిర్వహణతోనే కోవిడ్‌పై విజయం సాధ్యం’ అన్న నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వి.కె. పాల్‌ మాటలు అక్షర సత్యాలు.

దేశం మరో లాక్‌డౌన్‌కి సిద్దంగా లేదు. మంచిది కూడా కాదు! కానీ, పరిస్థితులు వికటించి, అదే జరిగితే... ఆర్థిక వ్యవస్థ కోలుకో లేనంత అధ్వానంగా మారి మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉంది. సామాన్యుడితో పాటు అప్పుడిక అందరి బతుకూ దుర్భరం. అంతా ఒక్కటై ఆ దుస్థితి రాకుండా అడ్డుకోవాలి. వైరస్‌ విజృంభణతో ‘కోవిడ్‌–19 రెండో ఉధృతి’ ప్రమాదఘంటికలు మోగి స్తోంది. ప్రభుత్వ అలసత్వం, ప్రజల నిర్లక్ష్యం... వెరసి కోవిడ్‌ మహ మ్మారి వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇది ఏకరీతిలో లేదు. ఉన్నచోట క్రమంగా–వేగంగా విస్తరిస్తున్న తీరే ఆందో ళన కలిగిస్తోంది. ఏడాది కిందట తొలిసారి వచ్చినప్పటికంటే ఇప్పుడు వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వైరస్‌ ఉత్పరివర్తన వల్ల వచ్చిన వైవిధ్యం కూడా ఓ కారణం. జనం కరోనా బారిన పడ్డాక... రికవరీ రేటు తగ్గుతోంది. పాజిటివిటీ రేటు ఎక్కు వౌతోంది. ఆందోళనకరంగా మరణాల రేటు పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు అని లెక్క లేకుండా ఆస్పత్రుల్లో కోవిడ్‌ వార్డులు మళ్లీ తెర చుకుంటున్నాయి, నిండుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అసాధారణంగా కేసులు పెరిగాయి. అక్కడ్నుంచి ఎక్కువ రాకపోకలున్న పొరుగు రాష్ట్రాల్లోనూ కొత్తగా కేసులు నమోదవుతున్నాయి, రోజు రోజుకు అధి కమవుతున్నాయి. గమనించి, లోతుగా విశ్లేషిస్తే గణాంకాలు భయం కలిగిస్తున్నాయి. తగు చర్యలతో నియంత్రించాల్సిన వ్యవస్థలు ఇప్పుడిప్పుడే నిద్రమత్తు వదిలినట్టు జాగృతమవుతున్నాయి. ‘పరిస్థితులు అధ్వానం నుంచి మరింత దయనీయ స్థితికి జారిపోతున్నాయం’టూ తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ప్రజలు ఇంకా మెలుకున్నట్టు కనిపించడం లేదు! టీకా (వాక్సిన్‌) అందుబాటులోకి వచ్చి, మనదేశం వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నా... జనానికి టీకా ఇస్తున్న/వారు తీసుకుంటున్న ప్రక్రియలో మందకొడితనం నిరాశ కలిగిస్తోంది. లక్ష్యానికి ఆమడ దూరమే! దేశంలో అత్యధికులు కరోనాను తేలికగా తీసుకుంటున్నారు. టీకా తీసుకున్నప్పటికీ కోవిడ్‌ జాగ్రత్తలు అవసరమే అని ఎంత చెబు తున్నా... పౌరుల నిర్లక్ష్యం పతాక స్థాయిలో ఉంది. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం/శానిటైజ్‌ చేసుకోవడం వంటి కనీస పద్ధతులు అనుసరించడంలోనూ తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇతర కారణాలకు తోడు ఈ నిర్లక్ష్యమే ప్రమాద తీవ్రతను ఎక్కువ చేస్తోంది.

ఇలా అయితే ఎలా?
అవగాహన వేరు చైతన్యం వేరు. అవగాహన లేక ఆచరించకపోవడం ఒక స్థితి. దాన్ని అధిగమించడానికి ఏమైనా చేయొచ్చు! అవగాహన ఉండీ ఆచరించకపోవడమే నిర్లక్ష్యం! ఒక అంతర్గత సర్వే ప్రకారం, కోవిడ్‌ వ్యాప్తి నివారణకు మాస్క్‌ ధరించడంతో పాటు కనీస జాగ్ర త్తలు ముఖ్యమని 90 శాతం మందికి తెలుసు. కానీ, 44 శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు. అది కూడా నగర, పట్టణ ప్రాంతాల్లోనే, గ్రామీణ ప్రాంతాల్లో అదీ లేదు. కనీస దూరాలు ఎవరూ పాటించడం లేదు. ప్రతి చిన్న అవసరానికీ, ఒకోసారి అవసరం లేకున్నా లెక్కలేకుండా గుమిగూడుతున్నారు. గోప్య కెమెరాలతో నిఘా పెట్టి, మాస్క్‌లేని వారికి వెయ్యేసి రూపాయల జరిమానా విధించే పరిస్థితి తెచ్చారు. విమానాశ్రయాల్లో కూడా కనీస పద్ధతులు పాటించనివారిపై చర్యలకు నిర్ణయించారు. సంతలు, బార్లు, వర్తక– వాణిజ్య కేంద్రాల వద్దే కాకుండా పండుగలు, పబ్బాలు, గుడి– గోపురాలు, శుభకార్యాలు .. ఇలా అన్నింటికీ తోసుకొని వెళ్లడమే, ఒక రికొకరు రాసుకు–పూసుకు తిరగడమే! నెల పాటు జరిగే కుంభమేళా ఉత్సవాలు గురువారమే మొదలయ్యాయి. లక్షలాది మంది పోగవుతారు. అప్పటికీ ఉత్తరాఖండ్‌ హైకోర్టు కఠిన నిబంధనల్ని నిర్దేశిం చింది. 72 గంటల లోపు తీసుకున్న కోవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ ఉంటేనే ఉత్సవాల్లోకి అనుమతించాలంది. హరిద్వార్‌ ప్రాంతంలోకి రావడానికీ ఆంక్షలు పెట్టారు. ఇలాంటి కట్టడి అంతటా రావాలి.  పౌరులు తమ వంతు బాధ్యత గుర్తించాలి. కోవిడ్‌ వ్యాప్తి అరికట్టే కనీస నిబంధ నలు–పద్ధతులు (ప్రొటోకాల్స్‌) పాటించకుండా, పౌరులు సహకరించ కుండా ప్రభుత్వ చర్యలతోనే అంతా అయిపోవాలనుకోవడం అత్యాశే! మహారాష్ట్రతో పాటు గుజరాత్, హర్యానా, జమ్మూ–కాశ్మీర్, బీహార్, పంజాబ్, ఢిలీ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ నమోద వుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్, తమిళనాడుతో పాటు కొన్ని ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. వైద్య టీకాతో పాటు సామా జిక టీకా ముఖ్యం. ‘బహుముఖ పంథా కావాలి. ప్రభుత్వం– సమాజం కలిసి చేయాల్సిన కర్తవ్యమిది. అన్ని ఉపకరణాల్నీ ప్రభా వవంతంగా వాడాలి. క్రమం తప్పని పరీక్షలు, వ్యాధి గుర్తించి కట్టడి, పాజిటివ్‌ల పై నిఘా, వైద్య రక్షణ, కోవిడ్‌–సముచిత అలవాట్లు, టీకా... వీటన్నిటి సమర్థ నిర్వహణతోనే కోవిడ్‌ పై విజయం సాధ్యం’ అన్న నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రభుత్వ సాధికార కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ వినోద్‌ కె పాల్‌ మాటలు అక్షర సత్యాలు.

టీకా ప్రక్రియ వేగం పెరగాలి
కోవిడ్‌ టీకా ఇచ్చే ప్రక్రియ వేగిరపరచడంలో ప్రభుత్వం వద్ద వ్యూహం కొరవడింది. పౌరుల్లో బాధ్యత లోపించింది. టీకా ఉత్పత్తిలో, ప్రపం చంలోనే మూడో పెద్ద దేశం భారత్‌లో టీకాలిచ్చే ప్రక్రియ మంద కొడిగా సాగుతోంది. మనకున్న వ్యవస్థలకు ఇది మరింత వేగంగా జరగాలి. జూన్‌ మాసాంతానికి 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలన్నది లక్ష్యం. కానీ, గడచిన రెండున్నర మాసాల్లో ఇచ్చింది 6 కోట్ల మందికే! ఇదే సమయంలో 6.4 కోట్ల టీకా డోసుల్ని మనదేశం 82 దేశాలకు పంపిణీ చేయగలిగింది. రాష్ట్రాలతో చర్చించి, ప్రణాళిక రచించి, కేంద్రం తగు కార్యాచరణ చేపట్టాలి. టీకా ఉత్పత్తి, అట్టడుగు కేంద్రా లకు చేర్చడం, వినియోగంలో వృధా అరికట్టడం, పౌరులు ముందు కొచ్చేలా చైతన్యపరచడం... ఇలా కొన్ని సమస్యల్ని ఇంకా అధిగమిం చాలి.

ప్రయివేటు ఆస్పత్రుల సహకారంతో టీకా కేంద్రాలు పెంచినా, గ్రామీణ ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయికి టీకా మందు అందుబాటులోకి తెచ్చినా.. ఇదీ పరిస్థితి! కరోనా మృతుల్లో 88 శాతానికి మించి 45 ఏళ్లు పైబడ్డ వాళ్లే! షరతులతో పనిలేకుండా, 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా ఇచ్చే ప్రక్రియ గురువారం మొదలైంది. ఇప్పుడిక వేగం పెరగాలి. ఈ లక్ష్యం వచ్చే రెండు వారాల్లో నూరు శాతం పూర్తి కావాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్రాలను నిర్దేశిం చింది. ఇంకా టీకా రెండో డోసు ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత పది–పదిహేను రోజులకు గాని యాంటీబాడీలు శరీరంలో వృద్ధి చెందవంటారు. ఆ తర్వాతే ‘సామూహిక రోగనిరోధకత’ గురించి ఆలోచించాలి. అందుకని, పౌరులు చొరవ చూపాలి. ఎవరికి వారు బాధ్యతగా భావించి, కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవాలి. ఇంకా... కోవిషీల్డా? కోవాక్సినా? అనే మీమాంస ప్రజల్లో ఉంది. నిజానికి ఏదైనా ఒకటే! ఉత్పత్తిలో తగు ప్రమాణాలు లేవని బ్రెజిల్‌ వంటి దేశాలు కోవ్యాక్సిన్‌ అనుమతి నిరాకరించడం ఇలాంటి సందేహాలకు కారణం కావచ్చు! ఉత్పత్తిదారు–ప్రభుత్వం ఈ సందేహాల్ని నివృత్తి చేయాలి. మరో టీకా స్పుత్నిక్‌–వి(రష్యా)ని దేశంలోకి అనుమతిం చడం ఇప్పుడు పరిశీలనలో ఉంది. అదీ వస్తే మరింత మేలు.

మేలుకోకుంటే ప్రమాదమే!
మన వాతావరణం, జీవనశైలి, ఇక్కడి పరిస్థితులు ఇన్నాళ్లూ కాపాడాయి. కిందటి వారంతో పాలిస్తే దేశంలో గత వారం కోవిడ్‌ మరణాల రేటు 51 శాతం పెరిగింది. ఇంకా చాలా మరణాలు కోవిడ్‌ వల్లే అయినా, అధికారికి లెక్కల్లో అంతకు ముందరి జబ్బుల కిందే చూపుతున్నారు. ఆస్పత్రులకు వచ్చిన కోవిడ్‌ కేసులు తెలంగాణ రాష్ట్రంలోనూ పది రోజుల్లో రెట్టింపయ్యాయి. కేసులు బాగా పెరుగు తున్న, వేగంగా వ్యాధి విస్తరిస్తున్న జిల్లాల సంఖ్య దేశంలో 47కు చేరింది. వాటిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణెతో కలుపుకొని పది జిల్లాల్లో తీవ్ర పరిస్థితులు న్నాయి. మన నిర్లక్ష్యం స్థాయి ఇలాగే ఉంటే.... పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అందరూ బాగుంటేనే, అందులో ఎవరమైనా బాగుంటాం. అందుకే తస్మాత్‌ జాగ్రత్త!


దిలీప్‌ రెడ్డి 
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement