కర్షకుడే కదా కారుచౌక! | opinion on prices of vegetables decreasing over currency issue in india by Devinder sharma | Sakshi
Sakshi News home page

కర్షకుడే కదా కారుచౌక!

Published Sat, Dec 31 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

కర్షకుడే కదా కారుచౌక!

కర్షకుడే కదా కారుచౌక!

విశ్లేషణ
కారణాలు ఏమైనా కావచ్చు, చేతులు కాలేది మాత్రం రైతులకే. న్యూఢిల్లీలో అజాద్‌పూర్‌ లోని ఏపీఎంసీ మార్కెట్‌ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఎంతమాత్రం గిట్టుబాటు కాని ధరలకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకుని బాధాతప్త హృదయంతో తిరిగి పోవలసి వస్తున్నది. ఇది ఒక్క కూరగాయల రైతులు మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు. ఇండోర్‌లో పూల ధరలు దారుణంగా పడిపోయాయి. ‘ఇండియా స్పెండ్‌’ పూల సాగు రైతు చెప్పిన మాటలను ఉటంకించింది కూడా.


2016 సంవత్సరం చరిత్రపుటలలోకి నిష్క్రమిస్తున్న క్షణాలివి. ఈ సమ యంలో నేను కచ్చితంగా చెప్పగలిగేదొకటే. ఈ సంవత్సరం రైతులకీ, రైతు కూలీలకీ; మొత్తంగా వ్యవసాయ రంగానికి ఓ పీడకలగా గుర్తుండిపోతుంది. ఏడాది మధ్యలో రుతుపవనాలు వచ్చినప్పుడు దుర్భిక్ష ప్రాంతాలలో కాసిన్ని జల్లులు పడి ఉపశమనం కలిగించాయి. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. రబీ సాగుకు విత్తనాలు చల్లవలసిన సమయంలో రుతుపవనాలు వెనక్కి పోయాయి. అప్పుడే అత్యంత అసహజమైన నోట్ల రద్దు పిడుగుపాటులా పరిణమించింది. ఏ విధంగా చూసినా 2016 రైతులకీ, రైతు కూలీలకీ విపత్కర సంవత్సరమే.

నోట్ల రద్దు ఒక ముష్టిఘాతం. మరీ ముఖ్యంగా దేశ నలుమూలలకూ చెందిన రైతాంగానికి పలు కోణాల నుంచి ఈ చర్య కోలుకోలేని దెబ్బ. రెండేళ్ల కరువుకాటకాలను అ«ధిగమించి నిలదొక్కుకుంటున్న సమయంలో ఇలాంటి దెబ్బ తగలడమే విచారకరం. దీని నుంచి కోలుకోవడానికి మళ్లీ రెండేళ్లకు తక్కువకాకుండా సమయం పడుతుంది. యాభై రోజులలో వ్యవసాయా దాయాలు 50 నుంచి 60 శాతం పతనమవుతూ ఉండడం గమనించవచ్చు. దీని ఫలితంగా లక్షలాది మంది చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, పేద వర్గాలు ఎంత తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చవి చూడవలసి ఉంటుందో, అది వారి జీవన భద్రతకు ఎంత ముప్పుగా పరిణమిస్తుందో చెప్పడానికి మాటలు చాలవు.

రైతులను ముంచిన నోట్ల రద్దు
వచ్చే బడ్జెట్‌లో అసంఘటిత రంగ కార్మికులకు, రైతులకు, రైతు కూలీలకు ఏమైనా ఉపశమన చర్యలు ప్రకటిస్తే నిజంగా అదో అద్భుతమే. ఎందుకంటే వరద నష్టం నుంచి ఉపశమనం ప్రకటించవచ్చు. కరువు నుంచి రక్షించడానికి అలాంటి చర్యలు ప్రకటించవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు కలిగించే నష్టాలకు ఏమాత్రం తీసిపోని నోట్ల రద్దు ఉత్పాతం నుంచి ఉపశమనం ఎలా ప్రకటి స్తారు? ఈ విషయం గురించి కొంచెం ఆలోచించండి! ఈ సంవత్సరం ఇక ముగియనుండగా ఇప్పుడు కొత్త కందిపప్పు మార్కెట్‌లోకి వచ్చింది. కర్ణాటక లోని గుల్బర్గా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మార్కెట్లలో ఈ నిల్వలు దర్శనమిస్తున్నాయి. కానీ దీని ధర కనీస మద్దతు ధర కంటే ఎంతో దిగువన ఉంది. కనీస మద్దతు ధర క్వింటాల్‌ ఒక్కింటికి రూ. 5,050 ఉండగా హోల్‌సేల్‌ ధర రూ. 3,666 (ఆంధ్రప్రదేశ్‌), రూ. 4,625 (కర్ణాటక) మధ్య ఊగిసలాడుతున్నది.

మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఆ పంట మార్కెట్‌కు తరలితే ఈ ధర మరింత పతనమవుతుంది. రెండేళ్ల క్రితం రిటైల్‌ మార్కెట్లో కిలో రెండు వందల రూపాయల వరకు పెరిగిన కందిపప్పు ధర, ఈ సంవత్సరారంభంలో కూడా అదే స్థాయిలో కొనసాగింది. దీనితో కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ 4,625 నుంచి రూ. 5,050కు పెరిగింది. పెరిగిన ఈ ధరను చూసే రైతులు ఆ పంట వేశారు. పైగా గడచిన ఏడాది దిగుబడి 2.46 మిలియన్‌ టన్నులకు మించి, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 4.3 మిలియన్‌ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు. పెసర పంట కథ కూడా కంది పంట కథకు ఏమాత్రం తీసిపోదు. గడచిన ఏడాది కనీస మద్దతు ధర రూ. 4,850కి మించి ఈ సంవత్సరం రూ. 5,225 (క్వింటాల్‌ ఒక్కింటికి) ప్రకటించారు. కానీ మొన్న సెప్టెంబర్‌ నుంచి, అంటే సరిగ్గా పంటను మార్కెట్‌కు తరలించే సమయా నికల్లా ధరలు పడిపోయాయని నివేదికలు వచ్చాయి. ఫలితంగా దేశమం తటా పెసర రైతులు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎంతో తక్కువకే విధిలేని పరిస్థితిలో దిగుబడులను అమ్ముకున్నారు. నోట్ల రద్దు ముమ్మాటికీ రైతుల బాధలను తీవ్రం చేసింది. వ్యవసాయ మార్కెట్లు కూడా పుంజుకునే పరిస్థితిలో లేవు.

చేతులు కాలుతున్నది కర్షకులకే
ఉదాహరణకి కొత్త ముంబైలోని ఏపీఎంసీ మార్కెట్‌నే తీసుకోండి. అక్కడ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నదని సీఎన్‌బీసీ టీవీ నివేదిక వెల్లడిం చింది. రూ. 1,000, రూ. 500 నోట్ల రద్దును నవంబర్‌ 8న ప్రకటిం చిన తరువాత, ఈ యాభై రోజులలో వ్యవసాయ దిగుబడుల ధరలు యాభై నుంచి అరవై శాతం పడిపోయాయి. ఎనిమిది నుంచి పది టన్నుల కూరగా యలు కొత్త ముంబై మార్కెట్‌లో వృథా అవుతున్నాయి. కాబట్టి ఎక్కువ మంది రైతులు ఒట్టి చేతులతో తిరిగిపోవడం అనివార్యం.

నోట్ల సంక్షోభం వల్ల సాధారణ వినియోగదారులు తమ కనీస అవ సరాలకు సంబంధించిన వస్తువులు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు, చేతులు కాలేది మాత్రం రైతు లకే. న్యూఢిల్లీలో అజాద్‌పూర్‌లోని ఏపీఎంసీ మార్కెట్‌ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది.

ఎంతమాత్రం గిట్టుబాటు కాని ధరలకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకుని బాధాతప్త హృదయంతో తిరిగి పోవలసి వస్తున్నది. ఇది ఒక్క కూరగాయల రైతులు మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు. ఇండోర్‌లో పూల ధరలు దారుణంగా పడిపోయాయి. ఇండియా స్పెండ్‌ పూల సాగు రైతు చెప్పిన మాటలను ఉటం కించింది కూడా. ఆ రైతు ఇలా చెప్పాడు: ‘నాలుగు రోజుల క్రితం, ఆఖరికి నోట్ల రద్దు ప్రకటించిన తరువాత నాలుగు రోజుల వరకు కూడా కిలో బంతిపూలు రూ. 30 నుంచి రూ. 40 రూపాయలకు అమ్ముకున్నాను. ఇప్పుడు మాత్రం కిలో పూలు నాలుగు రూపాయలు లేదా మూడు రూపాయలకే అమ్ముకుంటున్నాను’. అంటే నోట్ల రద్దు చర్య తరు వాత పూల సాగు రైతులు వారి ఆదాయాలలో యాభై నుంచి ఎనభై శాతం కోల్పోయారు.

ఇది ముష్టిఘాతమే
పత్తి, సోయాబీన్, బాసుమతి బియ్యం రైతుల పరిస్థితి మాత్రమే కాదు; శీతాకాల కూరగాయలు టొమేటో, బంగాళదుంప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మటర్, పాలక్, గాజర్‌ పంటలు పండించే రైతుల కథ కూడా పైన చెప్పిన ఉదాహరణలకు ఏమీ భిన్నంగా లేదు. చిత్రం ఏమిటంటే నోట్ల రద్దు తరువాత రైతాంగానికి ముష్టిఘాతం తగిలిందని చెబితే ఆ వాస్తవాన్ని అధికార పార్టీ అధికార ప్రతినిధి కూడా అంగీకరించడం లేదు. రైతాంగాన్ని రెండేళ్ల వరస కరువు కొట్టిన దెబ్బను మించి, నోట్ల రద్దు ఇంకా పెద్ద దెబ్బ కొట్టిందని నేను ముందునుంచీ చెబుతున్నాను. దీని గురించి వివరాలు నన్ను అడగడానికి కూడా ఒక సందర్భంలో ఒక టీవీ యాంకర్‌ వెనుకాడాడు. అయితే రైతాంగాన్ని చుట్టు ముట్టిన ఈ విషాదాన్ని ఢిల్లీకి చెందిన రచయిత అషీమ్‌ చౌదురి ధైర్యంగా వెల్లడించారు. దీనిని విషాదమని నేను కూడా ఎందుకు అంటున్నానంటే, రైతులు వారి ప్రమేయం లేకుండా ఒక మానవ నిర్మిత సంక్షోభంలో వారు కూరుకుపోయారు.

అయితే చాలామంది ఆర్థిక వేత్తలు, నిధుల నిర్వహణ వ్యవస్థలలోని వారు ఈ సంక్షోభం తాత్కాలికమని చెబుతున్నారు. వీరి వ్యాపార లావా దేవీలు త్వరలో సాధారణ స్థితికి వస్తా యని వారికి నమ్మకం ఉంది కాబట్టి వారి వరకు ఇది తాత్కాలిక సంక్షోభమే కావచ్చు.
నోట్ల రద్దు తరువాత రోజుకు లభిస్తున్న చిన్నపాటి మొత్తాలతో చిన్న వ్యాపారులు, చిన్న రైతులు, భూమి లేని రైతు కూలీలు ఎలా నెట్టుకు రాగలు గుతారు?  వారి జీవనోపాధి మార్గాలు కూడా మూసుకు పోయాయి. నోట్ల రద్దు చర్య తదుపరి అంకంలో రైతుల దుస్థితిని అషీమ్‌ చౌదురి ఉద్వేగ పూరితంగానే అయినా వాస్తవికంగా రాసిన ఈ చిన్న రచనలో పొందు పరిచారు. ఇది నోట్ల రద్దు చర్య జరిగిన ఒక మాసం తరువాత రాశారు.

‘హస్తినలో ఆ రహదారి పక్క కూరగాయల మార్కెట్‌కు వెళ్లాను.
ఏం జరిగిందో ఊహించగలరా? ఒక కిలో బంగాళదుంపలనీ, ఒక కిలో బీన్స్‌నీ, లేదంటే ఒక కిలో క్యాబేజీ, కాకపోతే మూడు కట్టల పాలక్‌ కేవలం ఓ పది రూపాయల నోటు కొనుగోలు చేయగలిగింది.

అంత చౌకగా కూరగాయలు దొరుకుతున్నందుకు నేను సంతోషించాలి. కానీ నేను రైతు దుస్థితిని తలచుకుని దుఃఖపడ్డాను.
ఆరుగాలాలు పండించిన రైతుకు దక్కుతున్న ధర ఎంత? నెలల తరబడి నీరు పెట్టి, శ్రమించినందుకు కిలో బంగాళదుంపలకి, కేవలం రెండు రూపాయలు.
అంటే ఒక బీడీ కట్ట కొనుక్కోవాలని అనుకున్నా, లేదా ఒక గోల్డ్‌ఫ్లేక్‌ సిగరెట్‌ తీసుకోవాలన్నా అతడు ఏడు కిలోల బంగాళదుంపలు పండించాలి.
రైతుకి నిరంతరం మిగిలేది నిరాశే. మోదీ గారూ! నోట్ల రద్దు అంతకు మించి వారి వెన్ను విరిచింది.

నాకు చౌకగా దొరికే కూరగాయలంటే ఇష్టమే.
కానీ రైతు అంత చౌకగా అమ్ముడుపోవడం మాత్రం నాకు సమ్మతం కాదు.
జై జవాన్‌! మర్‌ కిసాన్‌.


( వ్యాసకర్త  : దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు
Email :  hunger55@gmail.com )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement