Cost price to farmers
-
అన్నదాతల బ్యాలెట్ పోరు
సాక్షి, హైదరాబాద్: గిట్టుబాటు ధర కోసం అన్నదాతలు బ్యాలెట్ పోరాటానికి సిద్ధమయ్యారు. రోడ్డెక్కి పోరాడినా, ధర్నాలు చేసినా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఇక బ్యాలెట్ పోరుతోనైనా మార్పు వస్తుందన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు సోమవారం నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి 500 నుంచి వెయ్యి మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించటం గమనార్హం. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బోధన్, నిజామాబాద్ అర్బన్ మినహా నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఇప్పటికే నామినేషన్ల అంశంపై తీర్మానాలు చేశారు. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న గ్రామాభివృద్ధి కమిటీలు, రైతు సంఘాలు, కొన్నిచోట్ల కుల సంఘాలు ఏకమై తీర్మానాలు చేశాయి. చిన్న గ్రామమైతే 2 నుంచి 5 నామినేషన్లు, పెద్ద గ్రామాలైతే 5 నుంచి 10 చొప్పున నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. నామినేషన్‌కు ఆవసరమయ్యే డిపాజిట్, ఇతర ఖర్చులను కూడా గ్రామ కమిటీలు, రైతు సంఘాలే భరించాలని కూడా తీర్మానించారు. ఫ్లోరైడ్ బాధితులు గతంలో నల్లగొండ లోక్‌సభకు 184 నామినేషన్లు దాఖలు చేసిన సంఘటన స్ఫూర్తిగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2014 ఎన్నికల సమయంలో కూడా నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 27 మంది పసుపు రైతులు నామినేషన్లు వేశారు. గిట్టుబాటు ధరే లక్ష్యంగా... పసుపు, ఎర్రజొన్నలు సాగు చేసిన రైతులకు దశాబ్దాల కాలంగా గిట్టుబాటు ధర లభించటంలేదు. కేంద్రం కనీస మద్దతు ధరను ప్రకటించటం లేదు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, జాతీయ రహదారుల ముట్టడి, వంటా వార్పు... ఇలా రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపారు. ఎర్రజొన్నలు క్వింటాలుకు రూ.8,500, పసుపు క్వింటాలుకు రూ. 15 వేల చొప్పున మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ వారి డిమాండ్లు నెరవేరడంలేదు. ఈ నేపథ్యంలో పసుపు, ఎర్రజొన్న రైతులంతా ఏకమై ప్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే లక్ష్యంతో వందల సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. -
గిట్టుబాటు కోసం రైతుల కలెక్టరేట్ ముట్టడి
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఎర్రజొన్న, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సోమవారం రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. సుమారు రెండు వేల మంది రైతులు తరలిరాగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. చివరకు కొంత మంది రైతు సంఘం నాయకులను లోనికి ప్రవేశం కల్పించడంతో వారు కలెక్టర్ రామ్మోహన్‌రావును కలసి వినతిపత్రం సమర్పించారు. ఎర్రజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేసి క్వింటాలుకు రూ.3,500 చెల్లించాలని, పసుపు క్వింటాలుకు రూ.15,000 ధర ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం ఆదుకోకపోతే పెట్టిన పెట్టుపడి కోల్పోయి అప్పులపాలయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కమిటీ వేస్తున్నట్లు కలెక్టర్ రామ్మోహన్రావు రైతులకు హామీ ఇచ్చారు. కాగా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించుకున్న రైతులు, ఈ నెల 20న ఎమ్మెల్యేలను కలసి సమస్యను విన్నవించాలని, వారు స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. -
రహదారుల దిగ్బంధం
ఆర్మూర్: పసుపు, ఎర్రజొన్న రైతులు పోరుబాట పట్టారు. వారం రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసన తెలుపుతున్న అన్నదాతలు.. శనివారం రహదారుల దిగ్బంధనం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత రైతాంగం శనివారం 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించింది. ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో, జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో రోడ్లపై బైఠాయించారు. వంటావార్పుతో నిరసనను హోరెత్తించారు. జక్రాన్‌పల్లిలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఆందోళనలను నియంత్రించడంలో భాగంగా నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 14 గ్రామాల్లో రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ను విధించారు. అర్ధరాత్రి రైతు నాయకులను అరెస్టు చేసి ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినా రైతులు నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా పోరుబాట పట్టారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న పంటకు క్వింటాలుకు రూ. 3,500, పసుపు పంటకు రూ.15 వేల గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ట్రాఫిక్ మళ్లింపు పోలీసు యంత్రాంగం అప్రమత్తమై.. ట్రాఫిక్‌ను దారి మళ్లించింది. జాతీయ రహదారిపై నుంచి వస్తున్న వాహనాలను ఇతర మార్గం ద్వారా డైవర్ట్ చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాలేదు. ధర్నా విరమించాలని సీపీ కార్తికేయ, ఆర్మూర్ ఏసీపీ రాములు రైతులను కోరినా వినిపించుకోలేదు. కలెక్టర్ రామ్మోహన్రావు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆందోళనను శనివారం రాత్రి 9 గంటలకు విరమించారు. జక్రాన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై వంటావార్పులో పాల్గొన్న మహిళా రైతులు రేపు కలెక్టరేట్ ముట్టడి రాత్రి సమావేశమైన రైతులు.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధికారులు అందుబాటులో ఉండరని భావించిన రైతులు.. సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. -
గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు
ఆర్మూర్: పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత రైతులు మంగళవారం రోడ్డెక్కారు. సుమారు నాలుగు గంటల పాటు జాతీయ రహదారిపైనే బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిషేధాజ్ఞలు విధించినప్పటికీ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది రైతులు తరలివచ్చి ఆర్మూర్ మండలం మా మిడిపల్లి చౌరస్తాలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఎర్రజొన్న క్వింటాలుకు రూ.3,500, పసుపు క్వింటాలుకు రూ.15 వేలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టులు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలని, తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. ఈ నెల 16న బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని ముప్కాల్, వేల్పూర్ మండల కేంద్రాల్లో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి లో, ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మామిడిపల్లిలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, రైతులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వాహనాలను వేరే మార్గం నుంచి తరలించారు. -
మద్దతుధరలా! గిట్టుబాటుధరలా?
సంధర్భం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జూలై 4న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి 14 వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తి ఖర్చుపై యాభై శాతం అమ్మకపు ధర నిర్ణయిం చినట్టు ప్రకటించింది. కానీ ఈ ధరలు పరిశీలిస్తే ఉత్పత్తి ధరలు ఎవరు నిర్ణయించారో ప్రకటించలేదు. అటు రాష్ట్రం గానీ, ఇటు కేంద్రం గానీ సాంకేతికంగా ధర నిర్ణయించకుండా, ధర నిర్ణాయక సంఘం 2016–17లో నిర్ణయించిన ఉత్పత్తి వ్యయాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ఉత్పత్తి వ్యయంలో ప్రధానంగా మూడు భాగాలుం టాయి. 1. ఏ2= విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహా రక మందులు, యంత్రాల అద్దెలు, తదితర నగదు కొనుగోళ్లు 2. ఎఫ్ఎల్ అంటే కుటుంబ శ్రమ, కూలీల శ్రమ 3. సీ2 అంటే పెట్టుబడికి తెచ్చిన అప్పులపై వడ్డీ, భూమి అద్దె, ఇతర వ్యయాలు. పై మూడు వ్యయాలను కలిపితే ఉత్పత్తి వ్యయం అవుతుంది. కానీ ధరల నిర్ణాయక సంఘం మొదటి రెండింటి వ్యయాలను కలిపి రైతు పెట్టుబడిగా నిర్ణయించారు. ప్రస్తుత ప్రధాని ప్రకటించిన ధరలకు మొదటి రెండు వ్యయాలను మాత్రమే గుర్తించి దానిని వ్యవసాయ పెట్టుబడిగా చూపి, యాభై శాతం కలిపి ధరలు నిర్ణయించినట్టు ప్రకటించారు. అందువల్ల మూడవ వ్యయం అనగా బ్యాంకు రుణాలు, వడ్డీ, పంటల కోసం వినియోగించే నీటి పారుదలా విద్యుత్తు వ్యయాలు, భూమి అద్దెలు గుర్తించలేదు. ఉదాహరణకు 2017–18లో ధాన్యానికి ఏ2 వ్యయం కింద క్వింటాకు రూ. 839లు వ్యయం కాగా ఏ2+ఎఫ్ఎల్కు జరిగిన వ్యయం రూ.1,117గా ఉంది. మూడు వ్యయాలను లెక్కకట్టి (సీ2)గా రూ.1,484గా వ్యయం జరిగింది. ప్రధాని 1,117ను మాత్రమే తీసుకుని దానికి 50 శాతం కలిపి 1,750ని క్వింటాల్‌కి ధరగా నిర్ణయించారు. వాస్తవానికి రూ.1,484ను గుర్తించి అదనంగా 50 శాతం అనగా రూ. 742 కలిపి రూ. రూ. 2,226 నిర్ణయించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి మూడు వ్యయాలు కలిసి రూ 2,070గా నిర్ణయిం చింది. దీనికి యాభై శాతం కలుపగా రూ. 3,105గా క్వింటాల్ ధర నిర్ణయించాలి. ఆ విధంగా అన్ని పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించి యాభై శాతం కలిపి ధరలు ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర వాస్తవానికి ప్రస్తుత పెట్టుబడి అవుతుంది. గత వారం రోజుల క్రితం డీఏపీ బస్తా రూ.1,076 నుంచి రూ. 1,290కి పెంచారు. విత్తనాలు, డీజిల్, యంత్రాలు, యంత్ర విడిభాగాలు, క్రిమిసంహారక మందుల ధరలను 25 శాతం నుంచి 30 శాతం వరకు పెంచారు. ఈ పెంపుదల 2018–19 పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. గత నాలుగేళ్లుగా మార్కెట్లలో కనీస మద్దతు ధరల అమలు జరగలేదు. ప్రతి పంట మార్కెట్‌కు రాగానే నాణ్యతా ప్రమాణాల పేరుతో మధ్య దళారులు, కనీస మద్దతు ధరలకు రూ. 200 నుంచి రూ.400 వరకు కోతలు పెడుతున్నారు. ఆ విధంగా ప్రధానంగా వరి, మొక్కజొన్న, పప్పులు, పత్తి, వేరుశనగ, సోయా పంటలకు తెలంగాణలో రూ. 8,490 కోట్లు, ఆంధ్రలో రూ. 9,800 కోట్లు రైతులు నష్టపోయారు. అంతేకాక 2017–18లో ప్రకటించిన కనీస మద్దతు ధరలకు, ఉత్పత్తి వ్యయంపై యాభై శాతం కలుపగా వచ్చిన మొత్తానికి తేడాలు పరిశీలిస్తే... తెలంగాణలో రూ. 24,592 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 29 వేల కోట్లు రైతులు నష్టపోయారు. రైతులు నష్టపోయినదంతా వ్యాపారులకు పెట్టుబడిగా పోగుపడింది. ఇప్పటికీ వ్యవసాయ రంగం నుంచే పెట్టుబడి సమీకరణ జరుగుతుందనడానికి ఇది మంచి ఉదాహరణ. వ్యవసాయ రంగం నుంచి 86 శాతం ఉన్న సన్న, చిన్నకారు రైతులను తొలగించడానికి మార్కెట్ ధరలను తగ్గిస్తున్నారు. నిజానికి రైతుల మేలుకోరే ప్రభుత్వాలు మార్కెట్లలో పెట్టుబడిపై యాభై శాతం లాభం వచ్చేవిధంగా ధర నిర్ణయించి అమలు చేయాలి. అందుకు మార్కెట్లలో తక్కువ అమ్మినప్పటికీ మిగిలిన లోటును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భర్తీ చేయాలి. అందుకు మార్కెట్ జోక్యం పథకం కింద ప్రతి రాష్ట్రం తగిన మొత్తంలో నిధులు కేటాయించాలి. గిట్టుబాటు ధర అంటే పెట్టుబడిపోగా అదనంగా రైతుకు మిగిలే ఆదాయం. కనీస మద్ధతు ధర అంటే పెట్టుబడికి తక్కువగా ధర నిర్ణయించి అమలు జరపడానికి చేసే ప్రయత్నం. అందువల్ల రైతులు గిట్టుబాటు ధరను కోరుకుంటున్నారు. గిట్టుబాటు ధర ఏర్పాటుకు ముసాయిదా చట్టాన్ని రైతు సంఘాలు ప్రవేశపెట్టాయి. ఆ చట్టాన్ని ఆమోదించాలి. అంతే కానీ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంత ధరను పెంచినట్టు ప్రకటించటం రైతులను మోసగించటమే. వ్యాసకర్త సారంపల్లి మల్లారెడ్డి అధ్యక్షులు, అఖిల భారత కిసాన్ సభ. ఫోన్ నెంబర్: 94900 98666 -
ఇకనైనా ఆగేనా.. కన్నీళ్ల సాగు
ఈ రైతు పేరు నగరం గణేశ్. నిజామాబాద్ జిల్లా ఘన్పూర్. కంది పప్పు రేటు బాగానే ఉందని తనకున్న రెండెకరాల్లో కంది పంట వేశాడు. ఎకరానికి రూ.9,800 వరకు ఖర్చు చేసి మూడు క్వింటాళ్ల కందులు పండించాడు. తీరా మార్కెట్‌కు తీసుకెళ్తే వ్యాపారులు క్వింటాలుకు రూ.4,200 ధర చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వెళ్తే.. తేమ, తాలు అని కొర్రీలు వేసి కొనడం లేదు. రూ.4,200కు అమ్మితే పంటకు రూ.12,600 వస్తుంది. పెట్టుబడి తీసేస్తే.. మిగిలేది రూ.2,800. అంటే తొమ్మిది నెలల పాటు గణేశ్, ఆయన భార్య కష్టానికి కనీసం రూ.3 వేలు కూడా దక్కడం లేదన్నమాట! క్వింటాలుకు కనీసం రూ.7 వేలైనా ఇస్తే గిట్టుబాటు అవు తుందని గణేశ్ చెబుతున్నాడు. ఇది ఒక్క గణేశ్ వ్యథ కాదు.. కందికి మాత్రమే పరిమితమైన సమస్య కూడా కాదు. లక్షలాది మంది రైతుల గోస. వరి, పత్తి, మిర్చి, పసుపు.. ఇలా ఏ పంట చూసినా అన్నదాతకు మిగిలేది అప్పులు.. కష్టాలు.. కన్నీళ్లే! కాలం కలిసొచ్చినా మార్కెట్ గాలానికి చిక్కేవారు కొందరు.. దళారులు ఆడే జూదంలో ఓడిపోయే వారు ఇంకొందరు. విత్తనం నకిలీ.. ఎరువు నకిలీ.. పురుగు మందులు నకిలీ.. వీటన్నింటితోపాటు చీడపీడలను తట్టుకొని పంట పండిస్తే కనీస మద్దతు ధర కరువు! 1.ఇన్ని సవాళ్ల నడుమ సాగుతున్న వ్యవసాయ రంగాన్ని కేంద్రం గట్టెక్కిస్తుందా..? 2. గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో అయినా రైతన్న కడగండ్లను తుడిచే కార్యాచరణ ప్రకటిస్తుందా..? 3. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ దిశగా అడుగులేస్తుందా? వేచి చూడాల్సిందే..!! -
కర్షకుడే కదా కారుచౌక!
విశ్లేషణ కారణాలు ఏమైనా కావచ్చు, చేతులు కాలేది మాత్రం రైతులకే. న్యూఢిల్లీలో అజాద్‌పూర్ లోని ఏపీఎంసీ మార్కెట్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఎంతమాత్రం గిట్టుబాటు కాని ధరలకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకుని బాధాతప్త హృదయంతో తిరిగి పోవలసి వస్తున్నది. ఇది ఒక్క కూరగాయల రైతులు మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు. ఇండోర్‌లో పూల ధరలు దారుణంగా పడిపోయాయి. ‘ఇండియా స్పెండ్’ పూల సాగు రైతు చెప్పిన మాటలను ఉటంకించింది కూడా. 2016 సంవత్సరం చరిత్రపుటలలోకి నిష్క్రమిస్తున్న క్షణాలివి. ఈ సమ యంలో నేను కచ్చితంగా చెప్పగలిగేదొకటే. ఈ సంవత్సరం రైతులకీ, రైతు కూలీలకీ; మొత్తంగా వ్యవసాయ రంగానికి ఓ పీడకలగా గుర్తుండిపోతుంది. ఏడాది మధ్యలో రుతుపవనాలు వచ్చినప్పుడు దుర్భిక్ష ప్రాంతాలలో కాసిన్ని జల్లులు పడి ఉపశమనం కలిగించాయి. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. రబీ సాగుకు విత్తనాలు చల్లవలసిన సమయంలో రుతుపవనాలు వెనక్కి పోయాయి. అప్పుడే అత్యంత అసహజమైన నోట్ల రద్దు పిడుగుపాటులా పరిణమించింది. ఏ విధంగా చూసినా 2016 రైతులకీ, రైతు కూలీలకీ విపత్కర సంవత్సరమే. నోట్ల రద్దు ఒక ముష్టిఘాతం. మరీ ముఖ్యంగా దేశ నలుమూలలకూ చెందిన రైతాంగానికి పలు కోణాల నుంచి ఈ చర్య కోలుకోలేని దెబ్బ. రెండేళ్ల కరువుకాటకాలను అ«ధిగమించి నిలదొక్కుకుంటున్న సమయంలో ఇలాంటి దెబ్బ తగలడమే విచారకరం. దీని నుంచి కోలుకోవడానికి మళ్లీ రెండేళ్లకు తక్కువకాకుండా సమయం పడుతుంది. యాభై రోజులలో వ్యవసాయా దాయాలు 50 నుంచి 60 శాతం పతనమవుతూ ఉండడం గమనించవచ్చు. దీని ఫలితంగా లక్షలాది మంది చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, పేద వర్గాలు ఎంత తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చవి చూడవలసి ఉంటుందో, అది వారి జీవన భద్రతకు ఎంత ముప్పుగా పరిణమిస్తుందో చెప్పడానికి మాటలు చాలవు. రైతులను ముంచిన నోట్ల రద్దు వచ్చే బడ్జెట్లో అసంఘటిత రంగ కార్మికులకు, రైతులకు, రైతు కూలీలకు ఏమైనా ఉపశమన చర్యలు ప్రకటిస్తే నిజంగా అదో అద్భుతమే. ఎందుకంటే వరద నష్టం నుంచి ఉపశమనం ప్రకటించవచ్చు. కరువు నుంచి రక్షించడానికి అలాంటి చర్యలు ప్రకటించవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు కలిగించే నష్టాలకు ఏమాత్రం తీసిపోని నోట్ల రద్దు ఉత్పాతం నుంచి ఉపశమనం ఎలా ప్రకటి స్తారు? ఈ విషయం గురించి కొంచెం ఆలోచించండి! ఈ సంవత్సరం ఇక ముగియనుండగా ఇప్పుడు కొత్త కందిపప్పు మార్కెట్లోకి వచ్చింది. కర్ణాటక లోని గుల్బర్గా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మార్కెట్లలో ఈ నిల్వలు దర్శనమిస్తున్నాయి. కానీ దీని ధర కనీస మద్దతు ధర కంటే ఎంతో దిగువన ఉంది. కనీస మద్దతు ధర క్వింటాల్ ఒక్కింటికి రూ. 5,050 ఉండగా హోల్‌సేల్ ధర రూ. 3,666 (ఆంధ్రప్రదేశ్), రూ. 4,625 (కర్ణాటక) మధ్య ఊగిసలాడుతున్నది. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆ పంట మార్కెట్‌కు తరలితే ఈ ధర మరింత పతనమవుతుంది. రెండేళ్ల క్రితం రిటైల్ మార్కెట్లో కిలో రెండు వందల రూపాయల వరకు పెరిగిన కందిపప్పు ధర, ఈ సంవత్సరారంభంలో కూడా అదే స్థాయిలో కొనసాగింది. దీనితో కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ 4,625 నుంచి రూ. 5,050కు పెరిగింది. పెరిగిన ఈ ధరను చూసే రైతులు ఆ పంట వేశారు. పైగా గడచిన ఏడాది దిగుబడి 2.46 మిలియన్ టన్నులకు మించి, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 4.3 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు. పెసర పంట కథ కూడా కంది పంట కథకు ఏమాత్రం తీసిపోదు. గడచిన ఏడాది కనీస మద్దతు ధర రూ. 4,850కి మించి ఈ సంవత్సరం రూ. 5,225 (క్వింటాల్ ఒక్కింటికి) ప్రకటించారు. కానీ మొన్న సెప్టెంబర్ నుంచి, అంటే సరిగ్గా పంటను మార్కెట్‌కు తరలించే సమయా నికల్లా ధరలు పడిపోయాయని నివేదికలు వచ్చాయి. ఫలితంగా దేశమం తటా పెసర రైతులు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎంతో తక్కువకే విధిలేని పరిస్థితిలో దిగుబడులను అమ్ముకున్నారు. నోట్ల రద్దు ముమ్మాటికీ రైతుల బాధలను తీవ్రం చేసింది. వ్యవసాయ మార్కెట్లు కూడా పుంజుకునే పరిస్థితిలో లేవు. చేతులు కాలుతున్నది కర్షకులకే ఉదాహరణకి కొత్త ముంబైలోని ఏపీఎంసీ మార్కెట్‌నే తీసుకోండి. అక్కడ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నదని సీఎన్‌బీసీ టీవీ నివేదిక వెల్లడిం చింది. రూ. 1,000, రూ. 500 నోట్ల రద్దును నవంబర్ 8న ప్రకటిం చిన తరువాత, ఈ యాభై రోజులలో వ్యవసాయ దిగుబడుల ధరలు యాభై నుంచి అరవై శాతం పడిపోయాయి. ఎనిమిది నుంచి పది టన్నుల కూరగా యలు కొత్త ముంబై మార్కెట్లో వృథా అవుతున్నాయి. కాబట్టి ఎక్కువ మంది రైతులు ఒట్టి చేతులతో తిరిగిపోవడం అనివార్యం. నోట్ల సంక్షోభం వల్ల సాధారణ వినియోగదారులు తమ కనీస అవ సరాలకు సంబంధించిన వస్తువులు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు, చేతులు కాలేది మాత్రం రైతు లకే. న్యూఢిల్లీలో అజాద్‌పూర్‌లోని ఏపీఎంసీ మార్కెట్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఎంతమాత్రం గిట్టుబాటు కాని ధరలకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకుని బాధాతప్త హృదయంతో తిరిగి పోవలసి వస్తున్నది. ఇది ఒక్క కూరగాయల రైతులు మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు. ఇండోర్‌లో పూల ధరలు దారుణంగా పడిపోయాయి. ఇండియా స్పెండ్ పూల సాగు రైతు చెప్పిన మాటలను ఉటం కించింది కూడా. ఆ రైతు ఇలా చెప్పాడు: ‘నాలుగు రోజుల క్రితం, ఆఖరికి నోట్ల రద్దు ప్రకటించిన తరువాత నాలుగు రోజుల వరకు కూడా కిలో బంతిపూలు రూ. 30 నుంచి రూ. 40 రూపాయలకు అమ్ముకున్నాను. ఇప్పుడు మాత్రం కిలో పూలు నాలుగు రూపాయలు లేదా మూడు రూపాయలకే అమ్ముకుంటున్నాను’. అంటే నోట్ల రద్దు చర్య తరు వాత పూల సాగు రైతులు వారి ఆదాయాలలో యాభై నుంచి ఎనభై శాతం కోల్పోయారు. ఇది ముష్టిఘాతమే పత్తి, సోయాబీన్, బాసుమతి బియ్యం రైతుల పరిస్థితి మాత్రమే కాదు; శీతాకాల కూరగాయలు టొమేటో, బంగాళదుంప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మటర్, పాలక్, గాజర్ పంటలు పండించే రైతుల కథ కూడా పైన చెప్పిన ఉదాహరణలకు ఏమీ భిన్నంగా లేదు. చిత్రం ఏమిటంటే నోట్ల రద్దు తరువాత రైతాంగానికి ముష్టిఘాతం తగిలిందని చెబితే ఆ వాస్తవాన్ని అధికార పార్టీ అధికార ప్రతినిధి కూడా అంగీకరించడం లేదు. రైతాంగాన్ని రెండేళ్ల వరస కరువు కొట్టిన దెబ్బను మించి, నోట్ల రద్దు ఇంకా పెద్ద దెబ్బ కొట్టిందని నేను ముందునుంచీ చెబుతున్నాను. దీని గురించి వివరాలు నన్ను అడగడానికి కూడా ఒక సందర్భంలో ఒక టీవీ యాంకర్ వెనుకాడాడు. అయితే రైతాంగాన్ని చుట్టు ముట్టిన ఈ విషాదాన్ని ఢిల్లీకి చెందిన రచయిత అషీమ్ చౌదురి ధైర్యంగా వెల్లడించారు. దీనిని విషాదమని నేను కూడా ఎందుకు అంటున్నానంటే, రైతులు వారి ప్రమేయం లేకుండా ఒక మానవ నిర్మిత సంక్షోభంలో వారు కూరుకుపోయారు. అయితే చాలామంది ఆర్థిక వేత్తలు, నిధుల నిర్వహణ వ్యవస్థలలోని వారు ఈ సంక్షోభం తాత్కాలికమని చెబుతున్నారు. వీరి వ్యాపార లావా దేవీలు త్వరలో సాధారణ స్థితికి వస్తా యని వారికి నమ్మకం ఉంది కాబట్టి వారి వరకు ఇది తాత్కాలిక సంక్షోభమే కావచ్చు. నోట్ల రద్దు తరువాత రోజుకు లభిస్తున్న చిన్నపాటి మొత్తాలతో చిన్న వ్యాపారులు, చిన్న రైతులు, భూమి లేని రైతు కూలీలు ఎలా నెట్టుకు రాగలు గుతారు? వారి జీవనోపాధి మార్గాలు కూడా మూసుకు పోయాయి. నోట్ల రద్దు చర్య తదుపరి అంకంలో రైతుల దుస్థితిని అషీమ్ చౌదురి ఉద్వేగ పూరితంగానే అయినా వాస్తవికంగా రాసిన ఈ చిన్న రచనలో పొందు పరిచారు. ఇది నోట్ల రద్దు చర్య జరిగిన ఒక మాసం తరువాత రాశారు. ‘హస్తినలో ఆ రహదారి పక్క కూరగాయల మార్కెట్‌కు వెళ్లాను. ఏం జరిగిందో ఊహించగలరా? ఒక కిలో బంగాళదుంపలనీ, ఒక కిలో బీన్స్‌నీ, లేదంటే ఒక కిలో క్యాబేజీ, కాకపోతే మూడు కట్టల పాలక్ కేవలం ఓ పది రూపాయల నోటు కొనుగోలు చేయగలిగింది. అంత చౌకగా కూరగాయలు దొరుకుతున్నందుకు నేను సంతోషించాలి. కానీ నేను రైతు దుస్థితిని తలచుకుని దుఃఖపడ్డాను. ఆరుగాలాలు పండించిన రైతుకు దక్కుతున్న ధర ఎంత? నెలల తరబడి నీరు పెట్టి, శ్రమించినందుకు కిలో బంగాళదుంపలకి, కేవలం రెండు రూపాయలు. అంటే ఒక బీడీ కట్ట కొనుక్కోవాలని అనుకున్నా, లేదా ఒక గోల్డ్‌ఫ్లేక్ సిగరెట్ తీసుకోవాలన్నా అతడు ఏడు కిలోల బంగాళదుంపలు పండించాలి. రైతుకి నిరంతరం మిగిలేది నిరాశే. మోదీ గారూ! నోట్ల రద్దు అంతకు మించి వారి వెన్ను విరిచింది. నాకు చౌకగా దొరికే కూరగాయలంటే ఇష్టమే. కానీ రైతు అంత చౌకగా అమ్ముడుపోవడం మాత్రం నాకు సమ్మతం కాదు. జై జవాన్! మర్ కిసాన్. ( వ్యాసకర్త : దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు Email : hunger55@gmail.com )