రైతు నగరం గణేశ్
ఈ రైతు పేరు నగరం గణేశ్. నిజామాబాద్ జిల్లా ఘన్‌పూర్. కంది పప్పు రేటు బాగానే ఉందని తనకున్న రెండెకరాల్లో కంది పంట వేశాడు. ఎకరానికి రూ.9,800 వరకు ఖర్చు చేసి మూడు క్వింటాళ్ల కందులు పండించాడు. తీరా మార్కెట్‌కు తీసుకెళ్తే వ్యాపారులు క్వింటాలుకు రూ.4,200 ధర చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వెళ్తే.. తేమ, తాలు అని కొర్రీలు వేసి కొనడం లేదు. రూ.4,200కు అమ్మితే పంటకు రూ.12,600 వస్తుంది. పెట్టుబడి తీసేస్తే.. మిగిలేది రూ.2,800. అంటే తొమ్మిది నెలల పాటు గణేశ్, ఆయన భార్య కష్టానికి కనీసం రూ.3 వేలు కూడా దక్కడం లేదన్నమాట! క్వింటాలుకు కనీసం రూ.7 వేలైనా ఇస్తే గిట్టుబాటు అవు తుందని గణేశ్ చెబుతున్నాడు.
ఇది ఒక్క గణేశ్ వ్యథ కాదు.. కందికి మాత్రమే పరిమితమైన సమస్య కూడా కాదు. లక్షలాది మంది రైతుల గోస. వరి, పత్తి, మిర్చి, పసుపు.. ఇలా ఏ పంట చూసినా అన్నదాతకు మిగిలేది అప్పులు.. కష్టాలు.. కన్నీళ్లే! కాలం కలిసొచ్చినా మార్కెట్ గాలానికి చిక్కేవారు కొందరు.. దళారులు ఆడే జూదంలో ఓడిపోయే వారు ఇంకొందరు. విత్తనం నకిలీ.. ఎరువు నకిలీ.. పురుగు మందులు నకిలీ.. వీటన్నింటితోపాటు చీడపీడలను తట్టుకొని పంట పండిస్తే కనీస మద్దతు ధర కరువు!
1.ఇన్ని సవాళ్ల నడుమ సాగుతున్న వ్యవసాయ రంగాన్ని కేంద్రం గట్టెక్కిస్తుందా..?
2. గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అయినా రైతన్న కడగండ్లను తుడిచే కార్యాచరణ ప్రకటిస్తుందా..?
3. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ దిశగా అడుగులేస్తుందా? వేచి చూడాల్సిందే..!!
Comments
Please login to add a commentAdd a comment