ప్రతీకాత్మక చిత్రం
సంధర్భం
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జూలై 4న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి 14 వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తి ఖర్చుపై యాభై శాతం అమ్మకపు ధర నిర్ణయిం చినట్టు ప్రకటించింది. కానీ ఈ ధరలు పరిశీలిస్తే ఉత్పత్తి ధరలు ఎవరు నిర్ణయించారో ప్రకటించలేదు. అటు రాష్ట్రం గానీ, ఇటు కేంద్రం గానీ సాంకేతికంగా ధర నిర్ణయించకుండా, ధర నిర్ణాయక సంఘం 2016–17లో నిర్ణయించిన ఉత్పత్తి వ్యయాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ఉత్పత్తి వ్యయంలో ప్రధానంగా మూడు భాగాలుం టాయి. 1. ఏ2= విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహా రక మందులు, యంత్రాల అద్దెలు, తదితర నగదు కొనుగోళ్లు 2. ఎఫ్‌ఎల్ అంటే కుటుంబ శ్రమ, కూలీల శ్రమ 3. సీ2 అంటే పెట్టుబడికి తెచ్చిన అప్పులపై వడ్డీ, భూమి అద్దె, ఇతర వ్యయాలు. పై మూడు వ్యయాలను కలిపితే ఉత్పత్తి వ్యయం అవుతుంది. కానీ ధరల నిర్ణాయక సంఘం మొదటి రెండింటి వ్యయాలను కలిపి రైతు పెట్టుబడిగా నిర్ణయించారు.
ప్రస్తుత ప్రధాని ప్రకటించిన ధరలకు మొదటి రెండు వ్యయాలను మాత్రమే గుర్తించి దానిని వ్యవసాయ పెట్టుబడిగా చూపి, యాభై శాతం కలిపి ధరలు నిర్ణయించినట్టు ప్రకటించారు. అందువల్ల మూడవ వ్యయం అనగా బ్యాంకు రుణాలు, వడ్డీ, పంటల కోసం వినియోగించే నీటి పారుదలా విద్యుత్తు వ్యయాలు, భూమి అద్దెలు గుర్తించలేదు. ఉదాహరణకు 2017–18లో ధాన్యానికి ఏ2 వ్యయం కింద క్వింటాకు రూ. 839లు వ్యయం కాగా ఏ2+ఎఫ్‌ఎల్‌కు జరిగిన వ్యయం రూ.1,117గా ఉంది. మూడు వ్యయాలను లెక్కకట్టి (సీ2)గా రూ.1,484గా వ్యయం జరిగింది. ప్రధాని 1,117ను మాత్రమే తీసుకుని దానికి 50 శాతం కలిపి 1,750ని క్వింటాల్‌కి ధరగా నిర్ణయించారు. వాస్తవానికి రూ.1,484ను గుర్తించి అదనంగా 50 శాతం అనగా రూ. 742 కలిపి రూ. రూ. 2,226 నిర్ణయించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి మూడు వ్యయాలు కలిసి రూ 2,070గా నిర్ణయిం చింది. దీనికి యాభై శాతం కలుపగా రూ. 3,105గా క్వింటాల్ ధర నిర్ణయించాలి.
ఆ విధంగా అన్ని పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించి యాభై శాతం కలిపి ధరలు ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర వాస్తవానికి ప్రస్తుత పెట్టుబడి అవుతుంది. గత వారం రోజుల క్రితం డీఏపీ బస్తా రూ.1,076 నుంచి రూ. 1,290కి పెంచారు. విత్తనాలు, డీజిల్, యంత్రాలు, యంత్ర విడిభాగాలు, క్రిమిసంహారక మందుల ధరలను 25 శాతం నుంచి 30 శాతం వరకు పెంచారు. ఈ పెంపుదల 2018–19 పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. గత నాలుగేళ్లుగా మార్కెట్లలో కనీస మద్దతు ధరల అమలు జరగలేదు. ప్రతి పంట మార్కెట్‌కు రాగానే నాణ్యతా ప్రమాణాల పేరుతో మధ్య దళారులు, కనీస మద్దతు ధరలకు రూ. 200 నుంచి రూ.400 వరకు కోతలు పెడుతున్నారు.
ఆ విధంగా ప్రధానంగా వరి, మొక్కజొన్న, పప్పులు, పత్తి, వేరుశనగ, సోయా పంటలకు తెలంగాణలో రూ. 8,490 కోట్లు, ఆంధ్రలో రూ. 9,800 కోట్లు రైతులు నష్టపోయారు. అంతేకాక 2017–18లో ప్రకటించిన కనీస మద్దతు ధరలకు, ఉత్పత్తి వ్యయంపై యాభై శాతం కలుపగా వచ్చిన మొత్తానికి తేడాలు పరిశీలిస్తే... తెలంగాణలో రూ. 24,592 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 29 వేల కోట్లు రైతులు నష్టపోయారు. రైతులు నష్టపోయినదంతా వ్యాపారులకు పెట్టుబడిగా పోగుపడింది. ఇప్పటికీ వ్యవసాయ రంగం నుంచే పెట్టుబడి సమీకరణ జరుగుతుందనడానికి ఇది మంచి ఉదాహరణ.
వ్యవసాయ రంగం నుంచి 86 శాతం ఉన్న సన్న, చిన్నకారు రైతులను తొలగించడానికి మార్కెట్ ధరలను తగ్గిస్తున్నారు. నిజానికి రైతుల మేలుకోరే ప్రభుత్వాలు మార్కెట్లలో పెట్టుబడిపై యాభై శాతం లాభం వచ్చేవిధంగా ధర నిర్ణయించి అమలు చేయాలి. అందుకు మార్కెట్లలో తక్కువ అమ్మినప్పటికీ మిగిలిన లోటును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భర్తీ చేయాలి. అందుకు మార్కెట్ జోక్యం పథకం కింద ప్రతి రాష్ట్రం తగిన మొత్తంలో నిధులు కేటాయించాలి. గిట్టుబాటు ధర అంటే పెట్టుబడిపోగా అదనంగా రైతుకు మిగిలే ఆదాయం. కనీస మద్ధతు ధర అంటే పెట్టుబడికి తక్కువగా ధర నిర్ణయించి అమలు జరపడానికి చేసే ప్రయత్నం. అందువల్ల రైతులు గిట్టుబాటు ధరను కోరుకుంటున్నారు. గిట్టుబాటు ధర ఏర్పాటుకు ముసాయిదా చట్టాన్ని రైతు సంఘాలు ప్రవేశపెట్టాయి. ఆ చట్టాన్ని ఆమోదించాలి. అంతే కానీ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంత ధరను పెంచినట్టు ప్రకటించటం రైతులను మోసగించటమే.
వ్యాసకర్త సారంపల్లి మల్లారెడ్డి
అధ్యక్షులు, అఖిల భారత కిసాన్ సభ.
ఫోన్ నెంబర్: 94900 98666
Comments
Please login to add a commentAdd a comment