వరి కొనుగోలు బాధ్యత కేంద్రానిదే | Sarampally Malla Reddy Article On Central Decision On Boiled Rice Purchase In Telangana | Sakshi
Sakshi News home page

వరి కొనుగోలు బాధ్యత కేంద్రానిదే

Published Sat, Nov 13 2021 1:34 AM | Last Updated on Sat, Nov 13 2021 1:35 AM

Sarampally Malla Reddy Article On Central Decision On Boiled Rice Purchase In Telangana - Sakshi

తెలంగాణలో వరి పంటను రాజకీయ సమస్యగా మార్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడు తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం, బాయిల్డ్‌ రైస్‌ కొనమని రాష్ట్ర ప్రభు త్వానికి నోటీసులు పంప డంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బలపరుస్తూ, రాష్ట్రంలో వరి పంట వేయరా దనీ, ప్రత్యామ్నాయాలు వేయమనీ, కేంద్రం వరి పంటను కొనననీ చెప్పినట్లు ప్రచారం చేసింది. అసలు వరి పంటను ఎవరు కొనుగోలు చేయాలి? 

దశాబ్దాలుగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం సేకరణ చేస్తోంది. ఎఫ్‌సీఐ చౌక డిపోలకు బియ్యాన్ని సరఫరా చేసే బాధ్యతను తీసుకొని కొన్ని రాష్ట్రాల నుండి బియ్యం సేకరిస్తోంది. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఛత్తీస్‌గఢ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల నుండి బియ్యాన్ని సేకరిస్తోంది. 2020–21లో దేశంలో 12.23 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా, 25 రాష్ట్రాల నుండి 5.99 కోట్ల టన్నులు సేకరించింది. ఇందులో బఫర్‌ స్టాక్‌ 1.35 కోట్ల టన్నులు పోగా మిగిలిన బియ్యాన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. 

కొన్ని రాష్ట్రాలు కొనుగోలు కేంద్రాలు తెరిచి కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసి మిల్లర్ల ద్వారా ఎఫ్‌సీఐకి పెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ముందు తమ సొంత డబ్బులతో కొనుగోలు చేసి, ఎఫ్‌సీఐ ఇచ్చే డబ్బులతో తమ పెట్టుబడిని పూడ్చు కుంటున్నాయి. ఈ విధంగా రాష్ట్రాలు సబ్‌ ఏజెం ట్లుగా పని చేస్తున్నాయి. అంతేగానీ రాష్ట్రాలు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసి, నిల్వ ఉంచుకొని వ్యాపారం చేయడం సాధ్యం కాని పని. నిల్వ సౌకర్యాలు కూడా రాష్ట్రాలకు లేవు. 

2004 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ, సహకార సంఘాల ద్వారా వడ్లు కొనుగోలు చేసి మిల్లర్లతో ‘కస్టం మిల్లింగ్‌’ ద్వారా బియ్యాన్ని చేసి ఎఫ్‌సీఐకి ఇస్తోంది. క్వింటాలు వరి ధాన్యానికి 66 కిలోల బియ్యం మిల్లర్లు ఇచ్చే ప్రాతిపదికపై కొనుగోలు జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరు వాత (2014) కూడా ఆదే విధానం కొనసాగుతోంది. రెండేళ్లుగా వర్షాలు అనుకూలంగా పడటంతో వరి ధాన్యం పెరిగింది. తెలంగాణలో 26 లక్షల ఎకరాల నికర విస్తీర్ణం 60 లక్షల ఎకరాలకు పెరిగింది. వానా కాలం వడ్లు ముడి బియ్యం (పచ్చి బియ్యం) గానూ, యాసంగి వడ్లు బాయిల్డ్‌ రైస్‌గానూ (ఉప్పుడు బియ్యం) వస్తాయి. ఈ రెండు రకాల బియ్యానికి కేంద్ర ప్రభుత్వ సేకరణకు నాణ్యత ప్రమాణాలు నిర్ణయించారు. వాటి ప్రకారం మిల్లర్ల నుండి బియ్యం ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాలి. కానీ గత సంవత్సరం యాసంగి బాయిల్డ్‌ రైస్‌ను 24.60 లక్షల టన్నుల మాత్రమే కొనుగోలు చేస్తామనీ, మిగిలినవి ముడి బియ్యంగా ఇవ్వాలనీ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. యాసంగి బియ్యం ముడి బియ్యంగా మార్చాలంటే 25 శాతం నూక వస్తుంది. ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల యాసంగి బియ్యం ముడి బియ్యంగా 66 శాతం రావు. అయితే మార్కెట్లలో బాయిల్డ్‌ బియ్యానికి కూడా గిరాకీ ఉంది. అందువల్ల కేంద్రం తగాదా పెట్టకుండా సేకరించాల్సింది.

కేంద్ర ప్రభుత్వం సేకరించిన బియ్యం బఫర్‌ స్టాక్స్, ఆహార పంపిణీ వ్యవస్థకు పోగా మిగిలినవి ఎగుమతి చేయాలి. 2018–19లో 128.75 లక్షల టన్నులు, రూ.50,308 కోట్లు; 2019–20లో 120.14 లక్షల టన్నులు, రూ.53,990 కోట్ల విలువైన బియ్యం ఎగుమతి చేయడం జరిగింది. మిగులు ఉత్పత్తి జరిగినప్పుడు కూడా రాష్ట్రాల నుండి అద నంగా కేంద్రం సేకరించి ఎగుమతులు చేసే అవ కాశం ఉంది. కానీ 2020–21 నుండి కేంద్రం బియ్యం సేకరించడానికి ఆంక్షలు పెడుతున్నది. ఇది గత విధానానికి వ్యతిరేకం. వర్షాలు సక్రమంగా పడి, నీటి లభ్యత ఎక్కువున్నప్పుడు ఎక్కువగా పండిం చమని ప్రోత్సాహించాల్సింది పోయి, వరి పండిం చకూడదని కేంద్రం చెప్పడం సరి కాదు. పైగా పంట పండిన తరువాత సన్నబియ్యం కావాలనడం కన్నా, పంట వేసే ముందే సన్నధాన్యం విత్తనాలను రైతు లకు అందుబాటులోకి తెచ్చి ఆ పంటను సేకరిం చాలి. రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడానికి కేంద్రం ఈ నాటకం ఆడుతున్నది. 

ఈ మాత్రం ఉత్పత్తి పెరుగుదలను కేంద్రం భరించలేకపోతోంది. మన దగ్గర హెక్టారుకు 2.3 టన్నులు మాత్రమే వరి దిగుబడి వస్తుండగా, చైనాలో 8 టన్నులు, అమెరికాలో 6 టన్నులు వస్తోంది. వారు తమ అవసరాలు పోగా మిగిలినవి ఎగుమతులు చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి, బియ్యాన్ని పిండిగా మార్చి, పిండిని రొట్టెలుగా మార్చి వినియోగానికి ఉపయోగపడే విధంగా సరుకులను తయారు చేయాలి. అప్పుడే అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమ తులకు మంచి గిరాకీ ఉంటుంది. కానీ, ఈ ప్రభు త్వాలు గతంలో ఉన్న చిన్న తరహా ప్రాసెసింగ్‌ యూనిట్లను (వడ్ల మిల్లులు, నూనె మిల్లులు, పప్పు మిల్లులు) ఎత్తివేసే విధంగా భారీ పరిశ్రమలతో పోటీ పెట్టాయి. సహకార సంఘాల ద్వారా గానీ, ఎఫ్‌పీఓల ద్వారా గానీ, ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసి రైతుకు అదనపు ఆదాయం వచ్చే విధంగా ప్రాసెసింగ్, గ్రేడింగ్‌ చేసే విధానాన్ని కొన సాగించాలి. ఈ విధానం వల్ల దేశంలో కూడా విని యోగం పెరుగుతుంది. అంతేగానీ వరి పండించ కూడదని చెప్పడమంటే రానున్న కాలంలో ప్రజలను ఆకలి చావులకు గురి చేయడమే తప్ప మరొకటి కాదు.

కార్పొరేట్‌ సంస్థల ఆదేశాల మేరకు వ్యవసా యోత్పత్తుల విధానాన్ని మార్చడం జరుగుతున్నది. అంతేగానీ దేశ ప్రయోజనాలను గానీ, ఆహార అవస రాలను గానీ గుర్తించడం లేదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతతో రాష్ట్రాలలో పండిన పంటలను కనీస మద్దతు ధరలకు (ఆ ధరలు తక్కువైనా) కొనుగోలు చేసి రైతులను రక్షించాలి. 

వ్యాసకర్త: సారంపల్లి మల్లారెడ్డి 
ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు
మొబైల్‌: 94900 98666

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement