భారత ఎన్నికల సంఘం తప్పనిసరిగా కార్యనిర్వాహక వర్గానికి అంటే ప్రభుత్వానికి దూరంగా, స్వతంత్రంగా ఉండాలనే నిబంధనకు అనుగుణంగానే, పార్లమెంటు ఆమోదించే ఏదైనా చట్టం ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎన్నికల కమిషనర్ల బిల్లులోని అసలు సమస్య ‘సీఈసీ’ ఎంపిక కోసం ఉద్దేశించిన త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానాన్ని మార్చి, ప్రధాని నామినేట్ చేసే క్యాబినెట్ మంత్రిని చేర్చడం కాదు... ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రభుత్వమే నిర్ణయాత్మక పాత్రను పోషించడం! మరోమాటలో, ఇది కార్యనిర్వాహక వర్గానికి సీఈసీని నియమించే అధికారాన్ని ఇవ్వడమే. అంటే, ఒక ఆటగాడికే రిఫరీని నియమించే అధికారం ఇచ్చినట్లు!
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) బిల్లు, 2023ను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడం తీవ్ర వివాదానికి కారణమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (చీఫ్ ఎలక్షన్ కమిష నర్–సీఈసీ) ఎంపికపై అనూప్ బరన్‌వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ బిల్లు భర్తీ చేస్తుందనే విషయంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. సీఈసీ ఎంపికను ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయ మూర్తితో కూడిన త్రిసభ్య కమిటీ తప్పనిసరిగా చేయాలని సుప్రీంకోర్టు ఆ తీర్పులో పేర్కొంది. అయితే కొత్త ఎన్నికల కమిషనర్ల బిల్లు వల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలోకి ప్రధానమంత్రి నామినేట్ చేసే క్యాబినెట్ మంత్రి వస్తారు. ఈ కారణంగానే అత్యు న్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఈ బిల్లు ఎలా బలహీనపరుస్తుందనే అంశంపై విమర్శలు కేంద్రీకృతమయ్యాయి. అయితే, తాము చేసిన ఏర్పాటు తాత్కాలికమనీ, పార్లమెంటు ఈ విషయంలో ఒక చట్టాన్ని ఆమోదించే వరకే ఇది అమలులో ఉంటుందనీ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా గుర్తించిందనే వాస్తవాన్ని బిల్లు సమర్థకులు ఎత్తి చూపారు.
ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండటం, లేదా లేకపోవడంపై మాత్రమే దృష్టి సారించడం ద్వారా, ఈ చర్చలోని అసలైన విషయం పక్కకు పోతోంది. సీఈసీ కోసం ఉద్దేశించిన ఎంపిక కమిటీలో ప్రత్యేకంగా ఎవరు ఉండాలనే దానిపై కాకుండా, భారత ఎన్నికల సంఘం నిర్మాణాత్మకమైన, కార్యాచరణ స్వతంత్రతను కాపా డటం పైనే అనూప్ బరన్‌వాల్ కేసు తీర్పు ప్రధానంగా దృష్టి పెట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(2), పార్లమెంటు చేసే ఏదైనా చట్టానికి లోబడి, సీఈసీ నియామక అధికారాన్ని రాష్ట్రపతికి కట్ట బెడుతోంది. అనూప్ బరన్‌వాల్ కేసులో, సుప్రీంకోర్టు ఈ నిబంధనకు చెందిన చరిత్రను పరిశీలించింది. రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశ్యం ప్రకారం, భారత ఎన్నికల సంఘ స్వతంత్రతకు హామీ ఇచ్చే చట్టాన్ని పార్లమెంటు త్వరలో అమలు చేస్తుందని ఆశించింది. అయితే, పార్లమెంటు ఎన్నడూ ఇలాంటి చట్టాన్ని ఆమోదించకపోవడంతో, తీర్పునిచ్చిన న్యాయమూర్తుల అంచనాలు తారుమారయ్యాయి. ఇది రాష్ట్రపతి (అంటే కార్యనిర్వాహక వ్యవస్థ) అధికారాలను ప్రభావవంతంగా శాశ్వతం చేసింది. సీఈసీని నియమించే అధికారాన్ని కార్య నిర్వాహక వ్యవస్థకు ఇవ్వడం అనేది భారత ఎన్నికల సంఘ స్వతంత్ర తకు విరు ద్ధంగా ఉందనీ, తద్వారా ఇది తీర్పు చెప్పిన వారి ఉద్దేశం, రాజ్యాంగ రూపకల్పన రెండింటికీ పొసగడం లేదనీ ఉన్నత న్యాయ స్థానం గుర్తించింది. దీనికి కారణం స్పష్టమే. పార్లమెంటరీ వ్యవస్థలో, అధి కార పార్టీ నుండి కార్యనిర్వాహక వర్గాన్ని ఎంచుకుంటారు.
అందుకే ఎన్నికల క్రీడలో కార్యనిర్వాహకవర్గమే ఆటగాడిగా ఉంటుంది. ఇది కార్యనిర్వాహక వర్గానికి, అంటే ప్రభుత్వానికి సీఈసీని నియమించే అధికారాన్ని ఇవ్వడమే. అంటే, ఒక ఆటగాడికే రిఫరీని నియమించే అధికారం ఇచ్చినట్లు అవుతుంది. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడే ప్రజాస్వామ్య వ్యవస్థలలో– ఎన్నికల పర్యవేక్షక విభాగాలు అనేవి, అంటే ఎన్నికల కమిషన్లు, సమాచార కమిషన్లు మొదలైనవి, నాల్గవ శాఖా సంస్థల విభాగానికి చెందు తాయి. ఓటు హక్కు, సమాచార హక్కు మొదలైన పౌర హక్కులను ప్రభావవంతంగా మలచడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా పర్యవేక్షించడం, అమలు చేయడమే వాటి ప్రాథమిక పని. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం, ఈ నాల్గవ శాఖా సంస్థలు సమ ర్థవంతంగా, కార్యనిర్వాహక వర్గం (ప్రభుత్వం) నుండి స్వతంత్రంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ మితిమీరిన జోక్యాన్ని తనిఖీ చేయడం ఈ సంస్థల పాత్రలలో ఒకటి.
ఈ అంతర్‌దృష్టి అనూప్ బరన్‌వాల్ కేసు తీర్పులో అంతర్భాగంగా ఉంది. భారత ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక చట్టాన్ని రూపొందించే అంతిమ అధికారం పార్లమెంటుకు ఉందని రాజ్యాంగం స్వయంగా స్పష్టం చేసింది కాబట్టే సుప్రీంకోర్టు తన త్రిసభ్య కమిటీని మధ్యంతర ఏర్పాటు అని పేర్కొంది. అయితే, న్యాయస్థానం కూడా గుర్తించినట్లుగా, ఇది హద్దులేని లేదా తనిఖీ చేయని అధికారం మాత్రం కాదు. భారత ఎన్నికల సంఘం తప్పనిసరిగా కార్యనిర్వాహక వర్గానికి అంటే ప్రభుత్వానికి దూరంగానూ, స్వతంత్రంగానూ ఉండా లనే నిబంధనకు అనుగుణంగానే, పార్లమెంటు ఆమోదించే ఏదైనా చట్టం ఉండాలి. కాబట్టి, ఎన్నికల కమిషనర్ల బిల్లులోని సమస్య సీఈసీ ఎంపిక కోసం ఉద్దేశించిన త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానాన్ని మార్చడం కాదు. ఎందుకంటే కొత్త పాలనావ్యవస్థలో, కార్యనిర్వాహక వర్గానికి స్పష్టమైన మెజారిటీ ఉంది – అందువలన, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రభుత్వమే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆచరణను పరిశీలిస్తే, ఈ విషయంలో భారతదేశం చాలా దూరంగా ఉందని మరింత స్పష్టంగా తెలుస్తుంది. చాలా ప్రజాస్వామ్య దేశాల్లో, ఎన్నికల కమిషన్‌ను నియమించే విధానం పక్షపాత రహితంగా ఉంటుంది. పైగా, ఈ నియామకం విషయంలో చాలామందికి జోక్యం ఉంటుంది. ఉదాహరణకు, పార్ల మెంటులో మూడింట రెండు వంతుల ఆమోదం అవసరం. లేదా
మంత్రులు, ప్రతిపక్షాలు, పౌర సమాజ సభ్యులు, బహుళ–సభ్యుల కమిటీ పాత్ర కీలకం. ఎన్నికల సంఘం ఎంపికలో కార్యనిర్వాహక ఆధిపత్యం ఉండకూడదనే సంకల్పమే దీనంతటికీ కారణం. కాబట్టి, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిని మినహాయించడం గురించి కాక, భారత ఎన్నికల సంఘం స్వతంత్రత గురించి మొత్తం చర్చను పునర్నిర్మించడం అత్యవసరం. అంతకుమించి, అధికారంలో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా ఎన్నికల కమిషన్ స్వతంత్రతను నిర్ధారించే నియామకాల కోసం ఒక యంత్రాంగాన్ని రూపొందించడంలో పార్లమెంట్, పౌర సమాజం కలిసి పనిచేయడం చాలా అవసరం.
-గౌతమ్ భాటియా, వ్యాసకర్త ఢిల్లీ న్యాయవాది
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment