లింగసమానత్వమే మహిళల ఎజెండా | Sakshi Guest Column On Women Gender equality | Sakshi
Sakshi News home page

లింగసమానత్వమే మహిళల ఎజెండా

Published Thu, Apr 18 2024 4:15 AM | Last Updated on Thu, Apr 18 2024 4:15 AM

Sakshi Guest Column On Women Gender equality

విశ్లేషణ

మహిళా ఓటర్లు రాజకీయ పార్టీలకు కీలకంగా మారారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, పురుషుల భాగస్వామ్యాన్ని మహిళా ఓటర్ల సంఖ్య అధిగమించింది. రానున్న సాధారణ ఎన్నికల్లో దాదాపు 47 కోట్ల మంది మహిళలు ఓటు వేయనున్నట్లు భారత ఎన్నికల సంఘం అంచనా వేసింది. మగవారి ఆదేశాల మేరకే మహిళలు ఓటు వేస్తారనే భావన క్రమంగా తన విలువను కోల్పోతోంది. పూర్తి స్పృహతో వారి ఎంపికలు ఉంటున్నాయి. సమానత్వం, గౌరవ ప్రదమైన జీవితం తప్ప మహిళలకు మరేదీ అంగీకారం కాదు. వీటిని సాధించే జెండర్‌ మేనిఫెస్టో తక్షణావసరం. లింగ సమాన ప్రపంచాన్ని సాధించ డానికి కొత్త పుంతలు తొక్కాలనే సంకల్పం ఉంటే ఇదేమీ అసాధ్యం కాదు.

భారతదేశం సార్వత్రిక ఎన్నికల వైపు వెళుతున్నందున, నేను గత కొన్ని వారాలుగా మహిళలు, ఎల్‌జీబీటీక్యూ+ వ్యక్తులతో మాట్లాడి తదుపరి ప్రభుత్వంపై వారి అంచనాలను జెండర్‌ మేనిఫెస్టోలో పొందుపరిచాను. గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ 2023 ప్రకారం, భారతదేశం ప్రస్తుతం లింగ సమానత్వంలో 146 దేశాలలో 127వ స్థానంలో ఉంది. ఈ విషయంలో కొన్ని చిన్న, కొన్ని భారీ అడుగులు పడ్డాయి. కానీ ఇది సరిపోదు. రాజ్యాంగ ప్రవేశిక పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమా నత్వానికి కట్టుబడి ఉంది. భారతదేశ జనాభాలో సగానికి పైగా, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారు ఇప్పటికీ ఈ ప్రాథమిక హామీలను పొందేందుకు కష్టపడుతున్నారు. జెండర్‌ మేనిఫెస్టో కోసం సంప్రదింపుల ప్రక్రియను మొత్తంగా చూస్తే, భారతదేశంలోని మహి ళలు సమానత్వం, గౌరవప్రదమైన జీవితాన్ని తప్ప మరేమీ కోరు కోవడం లేదని స్పష్టమైంది.

హక్కుల కోసం పోరాడాలా?
చారిత్రకంగా నేరపూరితమైన సంచార, డీనోటిఫైడ్‌ తెగల (నేరస్థ తెగల చట్టం నుండి మినహాయించిన) జనాభాలో ఎక్కువ మందికి, ప్రత్యేకించి మహిళలకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అదేవిధంగా, ట్రాన్స్ జెండర్‌ వ్యక్తులు ఇప్పటికీ, వారి ‘మృత పేర్లను‘ (లింగ పరివర్తన తర్వాత ఉపయోగంలో లేనటువంటి వారి పుట్టుక పేర్లు) కలిగి ఉన్న రాతపనిని నవీకరించడానికి అధిగమించలేని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారి గుర్తింపు హక్కు చాలా కాలంగా నిరాకరించబడింది. 2024లో, ఉనికిలో ఉండే హక్కు ఏ వ్యక్తికైనా పోరాటం కాకూడదు.

అన్ని వర్గాలకు చెందిన మహిళలు, ఎల్‌జీబీటీక్యూ+ వ్యక్తుల ఆశలు, ఆశయాలను గుర్తించే జెండర్‌ ఎజెండాను అనుసరించడం మన రాజ కీయ పార్టీల కర్తవ్యం కావాలి. ఈ ఎజెండా కోసం ఇక్కడ కొన్ని సిఫార్సులు: రాజ్యాంగం సమానత్వానికి హామీ ఇస్తుండగా, లింగ నిర్ధారిత కోణం నుండి చూసినప్పుడు వ్యక్తిగత హక్కులు తక్కువగా ఉంటున్నాయి. వివాహం చేసుకునే ప్రాథమిక హక్కు పౌరులకు లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎల్‌జీబీటీక్యూ+ వ్యక్తులకు తమ భాగస్వాములను ఎంచుకునే హక్కును తిరస్కరించినట్లయితే మనం సమానత్వాన్ని ప్రకటించుకోలేం. వీలైనంత త్వరగా పార్లమెంటు దీనిపై చట్టం చేయాలి.

ప్రతిరోజూ, మహిళలు తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని ఇంట్లో ప్రారంభమవుతాయి. శిక్షాస్మృతిలో వైవాహిక అత్యాచారం మినహాయింపుగా ఉండటం అనాలోచితం. తదుపరి ప్రభుత్వం ఈ చట్టాన్ని తొలగించి, లింగ ఆధారిత హింస పట్ల జీరో–టాలరెన్స్(ఏమాత్రం సహించని) విధానాన్ని అనుసరించాలి. చాలామంది మహిళలు డీప్‌ ఫేక్‌ (మార్ఫింగ్‌ వీడియోలు), ఆన్ లైన్‌ దుర్వినియోగం పట్ల ఉన్న వారి భయాల గురించి నాతో మాట్లా డారు. పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి ప్రస్తుత శాంతి భద్రతల యంత్రాంగాలు తగినంతగా సన్నద్ధంగా లేవు. మహిళలు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో సురక్షితంగా ఉండేలా చేయడానికి వీటిని తప్పనిసరిగా సంస్కరించాల్సి ఉంది.

లింగ అపోహలు తొలగాలి
అన్నిరకాల సామాజిక కలయికలు పెరగాలంటే, లింగ అపోహలను వదిలించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు తమ పరిసరాలలో లింగ పరమైన సామాజికీకరణ కారణంగా పితృస్వామ్య పద్ధతులను అవలంబిస్తారు. లింగపరమైన మూస పద్ధతులను తొలగించడానికి పాఠశాల పాఠ్యపుస్తకాలను సమీక్షించడం, తిరగరాయడం తక్షణ అవసరం. అదనంగా, లింగపరమైన సున్నితత్వాన్ని బోధించే వర్క్‌ షాప్‌లను పాఠశాల పాఠ్యాంశాలలో చేర్చాలి.

తరువాత, పిల్లల సంరక్షణ అనేది తల్లిదండ్రుల ఉమ్మడి బాధ్యత అని మనం గుర్తించాలి. అన్ని అధికారిక సంస్థలలో వేతన చెల్లింపుతో కూడిన పితృత్వ సెలవును తప్పనిసరి చేయాలి. ఒక దృష్టాంతాన్ని నెలకొల్పడానికి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ‘క్రెష్‌’(శిశు సంరక్షణ కేంద్రం)లను కూడా ఏర్పాటు చేయాలి. తద్వారా పనిచేసే తల్లిదండ్రులు, లింగ భేదం లేకుండా పిల్లల సంరక్షణలో పాల్గొనేలా చేయాలి.

కోవిడ్‌ తర్వాత, ఆరోగ్య హక్కుపై ఎక్కువ దృష్టి పడింది. అయితే, మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అధ్యయనాలు కనుగొన్నాయి. ఆరోగ్య హక్కును కీలకమైనదిగా పరిగ ణించాలి. లింగపరమైన దృష్టితో విధానాలను రూపొందించాలి. గత కేంద్ర బడ్జెట్‌లో, గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తప్పనిసరిగా రొమ్ము, గర్భా శయ క్యాన్సర్‌కు ఉచిత పరీక్షలు చేయాలి. ఇంకా, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ద్రవ్యోల్బణంతో సరిపోయేలా ఆర్థిక సహాయాన్ని తప్పనిసరిగా పెంచాలి.

మహిళలకు ఆర్థిక శ్రేయస్సును అందించడం తదుపరి ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన సవాలు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు నిర్దిష్ట నిధులను తప్పనిసరిగా కేటాయించాలి. మహిళా రైతులను గుర్తించకపోవడం, తక్కువ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం మహిళలకు సంబంధించినంతవరకు రెండు ప్రధాన బాధాకరమైన అంశాలు. తదుపరి ప్రభుత్వం మహిళా రైతుల హక్కుల బిల్లు, 2011ను తప్పనిసరిగా అమలులోకి తేవాలి.

కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలను, ముఖ్యంగా ఉత్పాదక రంగంలో అమలు చేయాలి. తమ సిబ్బందిలో 20 శాతం కంటే ఎక్కువ మంది మహిళలను నియమించుకునే సంస్థలకు పన్ను రాయితీలు మంజూరు చేయడం ఒక మార్గం. ప్రభుత్వం అతిపెద్ద ఉద్యోగ కల్పనా దారులలో ఒకటి కాబట్టి, 30 లక్షలుగా అంచనా వేసిన ప్రస్తుత ఖాళీ స్థానాలను త్వరగా భర్తీ చేయాలి. ఈ ఉద్యోగాలకు మహిళా రిజర్వేషన్ ను తప్పనిసరిగా విస్తరించాలి.

చట్టం చేయాల్సిన ఆవశ్యకత
భారతదేశంలో మహిళల రాజకీయ హక్కులకు సంబంధించి గత సంవత్సరం చాలా ముఖ్యమైనది. మూడు దశాబ్దాలకు పైగా జరిగిన ఉద్యమాల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ప్రభుత్వానికి దృఢ సంకల్పం ఉంటే లింగ సమానత్వం వైపు చరిత్రాత్మక అడుగు వేయవచ్చని ఇది సూచిస్తోంది. అయితే, చట్టం అమలులో లేకపోవడం మనందరినీ నిరాశకు గురిచేస్తోంది.

రాబోయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ ను వీలైనంత త్వరగా అమలు చేసేలా చూడాలి. ఇది జనాభా లెక్కలను పూర్తి చేయడానికి లోబడి ఉండ కూడదు. పైగా, ప్రాతినిధ్యం అనేది ఎగువ మరియు దిగువ సభలు రెండింటిలోనూ ప్రతిబింబించే ఆదర్శం. రాజ్యసభ, లెజిస్లేటివ్‌ కౌన్సి ల్‌లలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు రిజర్వేషన్ల నిబంధనలపై పార్లమెంటు తప్పనిసరిగా చట్టం చేయాలి.

భారతదేశం లింగ సమానత్వాన్ని సాధించడానికి ఒక శతాబ్దానికి పైగా కాలం పడుతుంది. గత స్త్రీవాద ఉద్యమాలు మన ప్రధాన లక్ష్యాల సాధనలో పట్టుదలతో కొనసాగుతూనే, చిన్నపాటి విజయా లను జరుపుకోవాలని బోధించాయి. పైన పేర్కొన్న సిఫార్సులు కీలక మైనవి, దూరదృష్టితో కూడుకున్నవి. ముఖ్యంగా, తదుపరి ప్రభుత్వా నికి దాని పదవీకాలంలోనే సాధించదగినవి. మనకు కావలసిందల్లా లింగ–సమాన ప్రపంచాన్ని సాధించడానికి కొత్త పుంతలు తొక్కాలనే నిస్సందేహమైన సంకల్పం మాత్రమే.

ఏంజెలికా అరిబమ్‌ 
వ్యాసకర్త ‘ఫెమ్మె ఫస్ట్‌’ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement