
భారతదేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలో దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు... విద్య, ఆరోగ్య రంగాల్లో గొప్ప పురోగతి సాధించాయి. పరిశ్రమలు, ఐటీ, ఎగుమతుల్లో దేశానికే ఆదర్శంగా నిలిచాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా దోహదపడుతున్న ప్పటికీ, రాను రానూ కేంద్ర ప్రభుత్వ విధానాల్లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం.
ఈ రాష్ట్రాలు దేశ స్థూల జాతీయోత్పత్తిలో సుమారు 35–40% వాటా కలిగి ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు ఐటీ రంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందాయి. దేశ ఐటీ ఎగుమతుల్లో 60% దక్షిణాదిదే. అంతేకాక, దేశ ఎగుమతుల్లో దక్షిణాది వాటా 45 శాతానికి పైగా ఉంది. చెన్నై, విశాఖపట్నం, తూత్తుకుడి, మంగళూరు వంటి పోర్టులు అంతర్జాతీయ వాణి జ్యానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. తమిళ నాడు ఆటోమొబైల్ రంగంలో దేశానికి హబ్‌గా మారింది. కర్ణాటక ఏరోస్పేస్–డిఫెన్స్ మాన్యు ఫ్యాక్చరింగ్‌లో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫార్మా – బయోటెక్ పరిశ్రమల్లో దేశంలోనే ముందంజలో ఉన్నాయి.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అత్యుత్తమ వైద్య సేవలను అంది స్తున్నాయి. కేరళ సాక్షరతా రేటు 96%, తమిళనాడు 82%, తెలంగాణ 72% కాగా, దేశ సగటు దీని కంటే తక్కువ. వ్యవసాయం, సహజ వనరుల పరంగా కూడా దక్షిణాది ముందుంది. కాఫీ, కూర గాయలు, పత్తి, మిర్చి, మామిడి ఉత్పత్తిలో ఈ ప్రాంతం దేశానికి ప్రధాన ఆదాయం అందిస్తోంది.
అయితే, ఈ స్థాయిలో అభివృద్ధి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి భారీగా పన్నులు చెల్లిస్తూనే తక్కువ నిధులు పొందు తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం అధిక నిధులు కేటాయించడంతో, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ మొత్తమే అందుతోంది. జనాభా ప్రాతి పదికన నిధుల పంపిణీ విధానాన్ని అనుసరించడం వల్ల ఈ అన్యాయం జరుగుతోంది. దీనికితోడు, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది భవిష్యత్తును మరింత ప్రశ్నార్థకంగా మారుస్తోంది.
పునర్విభజన ప్రకారం, జనాభా ప్రాతి పదికన ఉత్తరాది రాష్ట్రాలకు అధిక సీట్లు రావచ్చు, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోవచ్చు. ఇది కేంద్ర రాజకీయ వ్యవస్థను ఉత్తరాదికి దృష్టి మళ్లించే ప్రమాదాన్ని పెంచుతోంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందుండటంతో, నియో జకవర్గాల పునర్విభజన ప్రక్రియలో వాటి స్థానాలు తగ్గిపోతూ, భౌగోళికంగా నష్ట పోయే పరిస్థితి ఏర్పడుతోంది.
ఇది మాత్రమే కాకుండా, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఇంకా అమలుకావడం లేదు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కేరళకు ఎయిమ్స్ ఆసుపత్రికి కేంద్రం అనుమతిని ఇంకా మంజూరు చేయలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసు కోలేదు. కర్ణాటక, తమిళనాడులో కొత్త హైవే ప్రాజెక్టులు మంజూరైనప్పటికీ, వాటి అమలుకు కేంద్రం నుంచి ఆలస్యం అవుతోంది.
దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉంది. కేంద్రంపై ఒత్తిడి పెంచి, ఆర్థిక నిధుల పంపిణీలో సమానత్వాన్ని కోరాలని రాష్ట్రాలు డిమాండ్ చేయాలి. ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను పునః సమీక్షించాలని డిమాండ్ చేయాలి. ఫెడరల్ ప్రెజర్ గ్రూప్ ఏర్పాటుచేసి, దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం సమన్వయ ప్రయత్నాలు చేపట్టాలి.
– శ్రీనివాస్ గౌడ్ ముద్దం
ఫైనాన్స్ రంగంలో నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment