85 లక్షలమంది కొత్త మహిళా ఓటర్లు
మొత్తం ఓటర్లు 96.8 కోట్లు
49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళలు
48వేల మంది ట్రాన్స్‌జెండర్లు
దేశంలో ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక జరగనున్న ఎన్నికలు, లోక్‌సభ - 2024 ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్(rajiv kumar) శనివారం ప్రకటించారు. మూడు దశల్లో రాష్ట్రాల ఎన్నికలు, ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది 1.89 కోట్ల మంది తొలి సారి ఓటర్లుగా నమోదయ్యారని వీరిలో 85 లక్షల మంది మహిళలు ఉన్నారని కూడా ఆయన వెల్లడించారు. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్, సిక్కిం, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. అలాగే పలు రాష్ట్రాల్లోని మహిళా పురుష ఓటర్ల నిష్పత్తి గణాంకాల గురించి కూడా ఆయన పేర్కొన్నారు. ప్రతీ పౌరుడు తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించు కోవాలని సూచించారు. హింసను వ్యాపింపజేసే వారిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని కుమార్ హెచ్చరించారు. ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట వెలుగొందేలా రక్తపాతానికి, హింసకు తావులేకుండా ఈ ఎన్నికలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 12 రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి 1,000 పైన ఉంది.
సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటన ప్రకారం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల నిష్పత్తి ఎక్కువగా ఉంది. దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా 96.8 కోట్లుగా ఉంది. వీరిలో 48వేల మంది ట్రాన్స్‌జెండర్లు కూడా నమోదయ్యారు. అలాగే 1.8 కోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. అలాగే 20 - 29 ఏళ్ల మధ్య వయస్సు గల వారు 19.47 కోట్ల మంది ఉన్నారు.
దేశంలో 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇది కాకుండా 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉండగా, 19.74 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు. అలాగే దేశంలో 82 లక్షలకు పైగా వృద్ధ ఓటర్లు ఉన్నారు. 2023లో 940 నుంచి 2024లో 948కి లింగ నిష్పత్తి పెరిగిందని ప్రకటించారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు 1.5 కోట్ల మంది సిబ్బందితో పాటు 55 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు (ఈవీఎంలు) సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అలాగే ఇప్పటివరకు ఈసీ 17 లోక్‌సభ ఎన్నికలు, 16 రాష్ట్రపతి ఎన్నికలు, 400కి పైగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించిందని కుమార్ తెలిపారు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303, కాంగ్రెస్ 52, తృణమూల్ కాంగ్రెస్ 22, బీఎస్పీ 10, ఎన్సీపీ 5, సీపీఐ-ఎం 3, సీపీఐ 2 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment