![Devinder Sharma Article on Bank Behaviour On Farmers Loans - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/05/2/farmers.jpg.webp?itok=pCR5rYZr)
దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న 1,913 మంది కార్పొరేట్ వ్యాపారుల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.1.46 లక్షల కోట్లు. వీరిని అరెస్టు చేయడం కాదు కదా, వారి పేర్లను కూడా బహిర్గతం చేయరు. మరోవైపున రెండు వేల మంది పంజాబీ రైతులపై అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. పంజాబ్‌లోని 71 వేల మంది రైతుల మొత్తం బకాయిలు రూ. 3,200 కోట్లు మాత్రమే. రైతులను ఎంతగా అవమానిస్తున్నారంటే దాని పర్యవసానంగా వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తద్భిన్నంగా, ఇలాంటి శిక్షలు, అవమానాల నుంచి కార్పొరేట్ వర్గాలు తప్పించుకుంటూ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాయి. రైతుల బకాయిలను స్వాధీన పర్చుకోవడానికి నిరంకుశ పద్ధతులు సరైన మార్గం కాదు.
పంజాబ్ రాష్ట్ర సహకార వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు (పీఏడీబీ) రుణ బకాయిలను వసూలు చేసుకోవడానికి గాను ఐదు ఎకరాలకు మించి భూములున్న దాదాపు రెండు వేలమంది రైతులపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అదే సమయంలో జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు వందలాదిమంది బడా బకాయిదారుల పేర్లను కూడా బయటపెట్టకుండా గత పదేళ్ల కాలంలోనే 11.68 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసేశాయి. అంటే వేరు వేరు వర్గాలకు వేరు వేరు సత్కారాలన్నమాట!
పంజాబ్‌లోని 71 వేల మంది రైతుల మొత్తం బకాయిలు రూ. 3,200 కోట్లు. ఈ బకాయిల స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయడానికి సహకార బ్యాంకు రుణ ఎగవేతదారులకు వ్యతిరేకంగా మధ్యవర్తిత్వం, ఒప్పించడంతోపాటు అరెస్ట్ వారెంట్లు కూడా జారీచేసింది. వీళ్ల న్యాయం బాగానే ఉంది. కానీ 34 ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు నిశ్శబ్దంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో 2.02 లక్షలకోట్ల మేరకు కార్పొరేట్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేసిపడేశాయి. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల కాలంలోనే ఈ బ్యాంకులు వరుసగా రూ. 46,382 కోట్లు, రూ. 39,000 కోట్ల మొండిబకాయిలను రద్దుచేశాయి. కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్లను జారీ చేసినట్టు ఎన్నడైనా విన్నారా? సంపన్నులైన రుణ ఎగవేత దారులు చాలామంది తప్పించుకుని విదేశాలకు చెక్కేస్తుంటే, మన దేశంలోని ఒక రైతు లేదా ఒక చిన్న రుణ గ్రహీత పట్ల రుణ వసూలు ప్రక్రియలో ఇంత అన్యాయంగా, ఇంత చెడుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?
రైతులకు అరెస్టు వారెంట్లు జారీ చేసిన ఘటనతో పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా రైతులపై అన్ని వారంట్లనూ ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అంతకంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే, రైతులకు జైలు శిక్ష విధించేటంత కఠిన వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తున్నారు అనేదే. రైతులను ఎంతగా అవమానిస్తున్నారంటే దాని పర్యవసానంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తద్భిన్నంగా, ఇలాంటి శిక్షలకు, అవమానాలకు వ్యతిరేకంగా మన కార్పొరేట్ వర్గాలు పూర్తిగా తప్పించుకుంటూ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాయి. రుణాలను ఎగవేస్తున్న మన బడా కంపెనీల పట్ల భారత రిజర్వ్ బ్యాంకు కల్పిస్తున్న రక్షణ కవచం తీరు ఇదే మరి. సంపన్నులు నష్ట భయం లేకుండా సంతోషంగా గడుపుతుండగా, రైతులు నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతున్నారు.
రెండు సెక్షన్ల బ్యాంకు రుణాల ఎగవేతలకు రెండు రకాల నిబంధనలు ఉన్నట్లు కనిపిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934లోని సెక్షన్ ‘45ఈ’ని ఉపయోగించి, కార్పొరేట్ డిఫాల్టర్ల గుర్తింపును బహిర్గతం చేయడానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ తిరస్కరిస్తోంది. దీనికి గోప్యతను ప్రధాన కారణంగా చెబుతున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో కొంతమంది డిఫాల్టర్ల పేర్లను బయటపెట్టారు. కార్పొరేట్ డిఫాల్టర్లకు సంబంధించినంతవరకూ రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌కి వెళ్లడం, ‘సెక్యూరిటైజేషన్ అండ్ రికన్‌స్ట్రక్షన్ ఆఫ్ పైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్’ కింద చర్య తీసుకోవడంతో సహా బ్యాంకులు సొమ్ము రాబట్టుకోవడానికి ఎలాంటి యంత్రాంగాన్నయినా ఉపయోగించవచ్చు. అలాగే ‘ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్‌సీ కోడ్’ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసులు నమోదు చేయవచ్చు. బకాయిలు రాబట్టడం ఇప్పటికీ సంతృప్తికరంగా లేనందున, ఈ లక్ష్యం కోసం ‘బ్యాడ్ బ్యాంక్’ నెలకొల్పాలన్న తాజా నిర్ణయం కూడా తీసుకున్నారు.
బకాయి రూణాన్ని రద్దు చేయడం అంటే రుణ మాఫీ వంటిది కాదని నాకు తెలుసు. నిరర్థక రుణాన్ని మరొక బ్యాంక్ లెడ్జర్‌కి మార్చినప్పటికీ బ్యాంకుల ద్వారా రికవరీ ప్రక్రియ కొనసాగుతుంది. వాయిదాలో ఉన్న బకాయిలలో పది శాతం కూడా బ్యాంకులు వసూలు చేయలేకపోయాయని పలు ఆర్టీఐ ఆధారిత నివేదికలు చూపుతున్నాయి. మిగిలివున్న బకాయిలు ఇక ఎన్నటికీ వసూలు కావు. వ్యవసాయ రంగంలోని ఎగవేతదారులకు కూడా దీన్నే వర్తింపజేయవచ్చు. రుణాలు చెల్లించలేకపోయిన రైతులను కటక టాలలో బంధించడానికి బదులుగా, బకాయి రుణాలను కూడా మరొక లెడ్జర్‌కి పంపించి రుణాల రికవరీ ప్రక్రియను కొనసాగిం చాలని బ్యాంకులు ఎందుకు ఆదేశించ కూడదు? ఈలోగా రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడాన్ని ఎందుకు అను మతించకూడదు?
రైతులపై వ్యతిరేకతను ప్రతి దశలోనూ ప్రదర్శించడం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. వ్యవసాయ కమ్యూనిటీ మీద వ్యతిరేకత, ద్వేషభావం పెరుగుతున్నాయి. అది కూడా విద్యాధికుల్లో ఈ వ్యతిరేకత పెరిగిపోతోంది. వ్యవసాయ రుణాల మాఫీని ఏ రాష్ట్రప్రభుత్వమైనా ప్రకటిస్తే చాలు... మీడియా విరుచుకపడుతోంది. రైతురుణాల మాఫీని నిలిపివేయాలని ప్యానెల్ చర్చలు గావుకేకలు పెడుతుంటాయి. దీనికి బదులుగా ప్రతి ఆరునెలలకోసారి కార్పొరేట్ నిరర్థక రుణాలను గణనీయంగా బ్యాంకులు రద్దు చేస్తున్నాయి. కార్పొరేట్ రుణాల రద్దును నిలిపివేయాలని టీవీల్లో జరిగిన చర్చలను మీరు చూసి ఎన్నాళ్లయిందో గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి.
మరొక పాలసీ నిర్ణయం స్పష్టంగా ఈ వివక్షను ఎత్తిచూపిస్తోంది. మధ్యప్రదేశ్, హరియాణాతో సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు మండీల్లో అమ్ముకున్న తర్వాత దాన్నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు కింద చెల్లించని బకాయలను తీసివేశాయి. ఇది క్రూరం, అన్యాయం మాత్రమే కాదు; రైతుల కోసం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తొక్కిపడేసే ధోరణిని ఇది సూచిస్తుంది. పంట నుంచి చెల్లించని మొత్తాలని ఇది తీసివేస్తోంది. రైతు నుంచి బ్యాంకు రుణాలను రికవరీ చేసుకోవడానికి కనీస మద్దతు ధర ఒక సమర్థనీయమైన పరికరంగా ఉంటోంది. కానీ పరిశ్రమలకు తాజా రుణాలను జారీ చేసేటప్పుడు నిరర్థక రుణాల మొత్తాన్ని ఆ రుణం నుంచి బ్యాంకులు ఎందుకు తీసుకోలేవు?
నిరర్థక రుణాలను రికవరీ చేసే ఒక సాధనమైన ఐబీసీ ప్రొసీడింగ్స్ ప్రకారం పరిశ్రమలు సగటున 65 నుంచి 95 శాతం వరకు నిరర్థక రుణాలను కలిగి ఉంటున్నాయి. అయినా సరే ఇవి బ్యాంకులనుంచి తాజా రుణాలు పొందగలుగుతున్నాయి. బ్యాంకులు ఈ కార్పొరేట్ సంస్థల తాజా రుణాల నుంచి తమ పాత బాకీలను చెల్లింపు చేసుకోవు. భారీగా కార్పొరేట్ మొండి బకాయిలను రద్దు చేస్తున్నప్పుడు కూడా ఏ బ్యాంకూ కొత్త రుణాలను జారీ చేసేటప్పుడు అంతకుముందు చెల్లించని రుణాన్ని కొత్త రుణాలనుంచి తీసుకుందామని భావించదు.
2020 జూన్ నెలలో మీడియాలో వార్తల ప్రకారం దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న 1,913 మంది వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.1.46 లక్షల కోట్లు. వీరిని అరెస్టు చేయడం కాదు కదా, వారి పేర్లను కూడా బహిర్గతం చేయరు. మరోవైపున కో ఆపరేటివ్ బ్యాంక్ మాత్రం రెండు వేలమంది పంజాబీ రైతులపై వారంట్లు జారీ చేసింది.
వ్యవసాయం తీవ్ర నిçస్పృహ మధ్య కొనసాగుతోంది. రైతుల బకాయిలను స్వాధీన పర్చుకోవడానికి నిరంకుశ పద్ధతులు అవలం బించడం సరైన మార్గం కాదని బ్యాంకులు గ్రహించాలి. ఏ సందర్భంలో అయినా రైతులపై అరెస్టు వారెంట్లు జారీ చేసినట్లయితే, అదేవిధమైన న్యాయ నిబంధనను కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు కూడా పొడిగించాల్సి ఉంటుందని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. సమాన న్యాయానికి ఇది తగు సమయం కాదా?
వ్యాసకర్త: దేవీందర్ శర్మ
ఆహార, వ్యవసాయ నిపుణులు
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment