సాక్షి, అమరావతి : గ్లోబల్ వార్మింగ్ వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వినియోగించుకుంటున్న టెక్నాలజీని శుక్రవారం పరిశీలించారు. అనంతరం విజయవాడలోని విపత్తు నిర్వహణ విభాగం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ (ఉష్ణోగ్రతల్లో మార్పులు - భూతాపం) వల్ల మన దేశంలోనూ వడగండ్ల వాన, ఉరుములు, పిడుగులు లాంటివి సంభవిస్తున్నాయని రమేష్ వివరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇచ్చే డేటా విపత్తుల అంచనాకు పూర్తిగా సరిపోదన్నారు. ఇస్రో శాటిలైట్ ద్వారా వాతావరణ సమాచారం అందుతుందని, దానిని ఐఎండీ అంచనా వేసుకున్న తర్వాతే విడుదల చేస్తుందని తెలిపారు.
‘2020, 2022 వరకూ ఏ రకమైన శాటిలైట్లు అవసరమో ఇస్రో, ఐఎండీ చర్చించుకుని ప్లాన్ చేస్తాం. 25 డాప్లర్ వెదర్ రాడార్ల ద్వారా వాతావరణ పరిసి్థతులపై అధ్యయనం చేస్తున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయో అంచనా వేసి నష్టాన్ని తగ్గించేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా రాష్ట్రాలకు సమాచారం ఇస్తున్నాం. వ్యవసాయ శాఖకు కూడా వాతావరణ పరిస్థితులపై సమాచారం ఇస్తున్నాం’ అని రమేష్ వివరించారు. నేషనల్ మాన్‌సూన్ మిషన్‌తో కచ్చితమైన వాతావరణ సమాచారం ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. విపత్తుల సన్నద్ధత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆది నుంచి ముందుందని, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ఏర్పాటుకాకముందే విపత్తుల నిర్వహణ మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకుందని ఆయన గుర్తు చేశారు.
2.4 కోట్ల మంది రైతులకు వాతావరణ సమాచారం
ప్రస్తుతం 2.4 కోట్ల మంది రైతులకు వాతావరణ సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎంఎస్) రూపంలో వెళుతోందని, రైతులకు వాతావరణ సమాచారం చాలా ఉపయోగపడుతుందని రమేష్ తెలిపారు. తుపాన్లు, భారీ వర్షాలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని అన్ని రాష్ట్రాలకు పంపుతున్నామని, దానిని ప్రజలకు చేరవేసి నష్టాలను నివారించుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆయన స్పష్టం చేశారు.
తుపాన్లు, సునామీ లాంటి విపత్తుల సమాచారం అందగానే సంబంధిత రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతోపాటు వాటి తీవ్రత ఎలా ఉంటుందనే అంశాన్ని నిరంతరం పరీశీలించి ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు తెలియజేస్తామని, దానిని వినియోగించుకోవాల్సింది, ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయడం, పునరావాసాలకు తరలించడం మాత్రం రాస్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉష్ణోగ్రతలు/ హీట్‌వేవ్స్ డేటాను కూడా పూర్తిగా అప్‌డేట్ చేశామని చెప్పారు.
మెట్ హైదరాబాద్‌లో ఉన్నా...
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినందున రాష్ట్రంలో వాతావరణ కేంద్రం (మెట్) ఏర్పాటు చేయాలి కదా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఇది ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు సేవల విషయంలో ఎలాంటి లోపం లేదని రమేష్ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ‘మెట్’ కేంద్రాలు లేవని పరిస్థితులను, అవసరాలను బట్టి ఏర్పాటు చేస్తుంటారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 99 శాతం వర్షపాతం
రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణ (99 శాతం) వర్షపాతం నమోదవుతుందని రమేష్ తెలిపారు. రాయలసీమలో కొంత తక్కువ వర్షం కురుస్తుందని అంచనా వేశామని చెప్పారు.