
సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన పరిధి దాటడమే కాకుండా ఊహాగానాలను ప్రకటించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందంటూ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ సమాచారా న్ని ఇస్రో నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపుతుండటంపై ఐఎండీ అసంతృప్తితో ఉంది. వచ్చే నెల (నవంబర్)లో మూడు తుపాన్లు వస్తాయంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వానికి ఇస్రో సమాచారం పంపడం, దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. దీంతో నవంబర్‌లో మూడు తుపాన్లు వస్తాయంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఐఎండీ ఖండించింది.
ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజలను భయపెట్టవద్దని సూచించింది. ‘తుపాన్లు ఎప్పుడు వస్తాయో ముందుగా గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం మనకు లేదు. అలాంటప్పుడు నవంబర్‌లో ఏకంగా మూడు తుపాన్లు వస్తాయని, చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండిపోతాయని, అప్రమత్తంగా ఉండాలని చెప్పడమంటే ప్రజలను భయపెట్టడమే కదా! ఇస్రో ఇలా చేయడం సరికాదు. మా విభాగం వ్యవహారాల్లో వేలుపెట్టి తప్పుడు (నిర్ధారణకాని) సమాచారం ఇవ్వడం గతంలో ఎన్నడూ చూడలేదు...’ అని వాతావరణశాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
పరోక్షంగా తప్పుబట్టిన డీజీ
ఇస్రో తీరును ఐఎండీ డైరెక్టర్ జనరల్ (డీజీ) కేజే రమేశ్ ఇప్పటికే రెండుసార్లు పరోక్షంగా తప్పుపట్టారు. ‘ఇస్రో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే పంపుతుంది. వాటిని విశ్లేషించి అదనపు సమాచారాన్ని జోడించి అల్పపీడనాలు వస్తాయా? లేదా అనే అంశాన్ని నిర్ధారించాల్సింది ఐఎండీనే. వాతావరణ మార్పులకు సంబంధించి ఇస్రో ఇచ్చే సమాచారం ఫైనల్ కాదు. ఇస్రో సమాచారాన్ని ఐఎండీకి పంపాలేగానీ నేరుగా ప్రకటించరాదు..పైగా మనకు ఇప్పటి వరకూ తుపాన్లు ఎప్పుడు వస్తాయో ముందుగా తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం లేదు. వాతావరణ సమాచారాన్ని ప్రజలకు, రైతులకు అందించే సాధికారత ఐఎండీకి మాత్రమే ఉంది’ అని కేజే రమేశ్ స్పష్టం చేశారు. తద్వారా ఇస్రో పరిధి దాటుతోందని చెప్పకనే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment