ఒకేసారి రెండు కక్ష్యల్లోకి 8 ఉపగ్రహాలు
ఇస్రో సరికొత్త చరిత్ర
పైకి వెళ్లి.. కిందకు వచ్చి...
ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138 టన్నుల ఘన ఇంధనం సాయంతో 111 సెకన్లకు మొదటి దశను పూర్తి చేశారు.
► 42 టన్నుల ద్రవఇంధనంతో 262 సెకన్లకు రెండో దశ, 7.6 టన్నుల ఘనఇంధనంతో 586 సెకన్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవఇంధనంతో1021 సెకన్లకు 4వ దశ పూర్తయింది.
► అనంతరం నాలుగో దశకు శిఖరభాగంలో పొందికగా అమర్చిన స్వదేశీ ఉపగ్ర హం స్కాట్‌శాట్-1ను 1058 సెకన్లకు (17.40నిమిషాలు) విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు.
►1.05 గంటల తరువాత రాకెట్ నాలుగో దశ (పీఎస్-4)ను రెండు విడతలుగా మండించి 55 కి.మీ.దిగువకు రప్పించారు.
భూమికి 669 కిలోమీటర్లు ఎత్తులో సూర్యానువర్తన ధృవకక్ష్యలోనే 98.21 డిగ్రీల వాలులో ఏడు ఉపగ్రహాలనూ ఒకదాని తరువాత ఒకటిగా రెండు మూడు కిలోమీటర్ల దూరంతో విజయవంతంగా ప్రవేశపెట్టారు.
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో అరుదైన మైలు రాయిని అందుకుంది. ఒకే ప్రయోగంలో 8 ఉపగ్రహాలను రెండు కక్ష్యల్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రపంచంలో అమెరికా, రష్యాల తర్వాత ఆ సామర్థ్యం సాధించిన మూడో దేశంగా అవతరించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం చేసిన ప్రయోగంతో ఈ చరిత్ర సృష్టించింది. అంతరిక్ష ప్రయోగాల వినువీధిలో భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగిరేలా చేసింది. ఇస్రోకు నమ్మకమైన బ్రహ్మాస్త్రం పీఎస్‌ఎల్‌వీ-సీ35 ఉపగ్రహ వాహకనౌకతో సోమవారం ఉదయం 9.12 గంటలకు స్వదేశీ ఉపగ్రహం స్కాట్‌శాట్-1, ఐదు విదేశీ ఉపగ్రహాలు సహా మొత్తం 8 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి.. రెండు వేర్వేరు ఎత్తుల్లోని సూర్యానువర్తన ధ్రువకక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. ఇస్రో 55 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఈ తరహా ప్రయోగం చేసి ఘనవిజయం సాధించింది. మొత్తం ప్రయోగం పూర్తవడానికి 2.15 గంటల సమయం పట్టింది. భారత ఉపగ్రహాల ప్రయోగంలో ఇప్పటివరకూ ఇదే సుదీర్ఘ సమయం. ఈ ప్రయోగం ద్వారా సరికొత్త విధానానికి తెరతీశారు. ఇకపై ఒకే రాకెట్ ద్వారా పలు ఉపగ్రహాలను పలు కక్ష్యల్లో ప్రవేశపెట్టటం సులువుకావడంతో వ్యయప్రయాసల భారం గణనీయంగా తగ్గనుంది.
ప్రయోగం సాగిందిలా...
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గల షార్‌లోని తొలి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.12 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ35 రాకెట్‌ను 8 ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి ప్రయోగించారు. శనివారం పొద్దున 8.45కి మొదలైన కౌంట్‌డౌన్ 48.30 గంటలు సజావుగా కొనసాగింది. కౌంట్‌డౌన్ ముగియటంతోనే 44.4 మీటర్ల పొడవైన పీఎస్‌ఎల్‌వీ సీ35 రాకెట్ ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లు, కోర్ అలోన్ దశ సాయంతో 320 టన్నుల బరువును మోసుకుని నిప్పులు చిమ్ముకుంటూ నింగికి దూసుకుపోయింది. 4 దశల్లో సాగిన ప్రయోగంలో.. మొదటగా 17.40 నిమిషాల్లో భూమికి 724 కి.మీ. ఎత్తులో స్కాట్‌శాట్-1ని సూర్యానువర్తన ధ్రువకక్ష్య (సన్ సింక్రోనస్‌ఆర్బిట్)లో 98.1 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టారు. అనంతరం నాలుగో దశ ఇంజిన్లను మళ్లీ మండించి 55 కిలోమీటర్లు కిందకు దించి.. భూమికి 669 కి.మీ. ఎత్తులో సూర్యానువర్తన ధ్రువకక్ష్యలోనే 98.21 డిగ్రీల వాలులో మిగతా 7 ఉపగ్రహాల్నీ ప్రవేశపెట్టారు. ఆ కక్ష్యలోనే ఒకటి, రెండు కి.మీ తేడాతో ఒక దాని తరువాత ఒక ఉపగ్రహం చొప్పున ఏడింటినీ ప్రవేశపెట్టారు. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ శాస్త్రవేత్తలను అభినందించారు.
ఉపగ్రహాలివీ...
భారత ఉపగ్రహం(1): స్కాట్‌శాట్-1 రోదసిలో ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. దీని బరువు 371 కిలోలు. ఓషన్‌శాట్-2 కాలపరిమితి పూర్తవడంతో అత్యంత అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన స్కాట్‌శాట్-1ను పంపారు. ఇందులో కెయు-బ్యాండ్ స్కాటరోమీటర్ అమర్చారు. వాతావరణంపై ముందస్తు అంచనాలు, తుపానులను కనిపెట్టడం, ఆచూకీ కనుగొనే సేవలను ఇది అందిస్తుంది.
భారత వర్సిటీల ఉపగ్రహాలు(2): ప్రథమ్, పైశాట్
అల్జీరియా ఉపగ్రహాలు(3): అల్‌శాట్-1బి, అల్‌శాట్-2బి, అల్‌శాట్-1ఎన్
అమెరికా ఉపగ్రహం(1): పాత్‌ఫైండర్-1
కెనడా ఉపగ్రహం(1): ఎన్‌ఎల్‌ఎస్-19
‘ప్రయోగాల’తో సాగుతాం: ఇస్రో
నేడు ప్రపంచదేశాలతో పోటీ పడాలంటే వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగాల్సి ఉంటుందని ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. షార్‌లో పీఎస్‌ఎల్‌వీ-సీ35 విజయవంతం అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాజా విజయం అద్భుతమని.. ఇది ఇస్రోకు భారీ మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ఒకే ప్రయోగంతో వివిధ రకాల కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడమే కాకుండా.. ఎయిర్ బ్రీతింగ్ సిస్టం ప్రయోగంలో కూడా విజయం సాధించామని చెప్పారు. రాకెట్‌లోని ఇంధనాన్ని అమ్మోనియం పెర్‌క్లోరేట్‌లో ఆక్సిడైజర్ ద్వారా మండించే విధానానికి స్వస్తి చెప్పి భూ వాతావరణంలోని సహజసిద్ధంగా ఉన్న ఆక్సిజన్‌తో మండించేందుకు మరో కీలక ప్రయోగం చేశామన్నారు. అక్టోబర్‌లో ఫ్రెంచి గయానాలోని కౌరు నుంచి ఏరియన్-05 రాకెట్ ద్వారా జీశాట్-18 అనే సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామన్నారు.ఈ ఏడాది జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగాన్ని చేసేందుకు షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై లాంచ్ క్యాంపెయిన్ పనులు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయని చెప్పారు.నవంబర్‌లో రిసోర్స్‌శాట్-2ఏ, 2017లో ఆదిత్య-1,చంద్రయాన్-2, మార్స్-2 ప్రయోగాలు ఉంటాయన్నారు.
భారత్ గర్వించే కృషి.. మోదీ: భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు తమ అవిరళ కృషితో దేశం మళ్లీ గర్వించేలా చేశారంటూ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. తాజా ప్రయోగంపై ఇస్రోకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు.
మరిన్ని విజయాలు సాధించాలి: జగన్
సాక్షి, హైదరాబాద్: పీఎస్‌ఎల్వీ-సి35 ప్రయోగం ద్వారా ఒకేసారి రెండు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడంలో విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.