గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా దేశంలోని నదులన్నీ ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితుల్లో చిన్న నీటి వనరుల సంరక్షణ, వాటి అభివృద్ధి అత్యంత ముఖ్యమని మెగసెసె అవార్డు గ్రహీత రాజేందర్‌సింగ్ అన్నారు.
అధికారులతో మెగసెసె అవార్డు గ్రహీత రాజేందర్‌సింగ్
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా దేశంలోని నదులన్నీ ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితుల్లో చిన్న నీటి వనరుల సంరక్షణ, వాటి అభివృద్ధి అత్యంత ముఖ్యమని మెగసెసె అవార్డు గ్రహీత రాజేందర్‌సింగ్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో చేపడుతున్న మిషన్ కాకతీయ కార్యక్రమం దేశానికే ఆదర్శమని, దీన్ని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చెరువుల ఆక్రమణలు నివారించగలిగితే ఈ కార్యక్రమం అద్భుత ఫలితాన్నిస్తుందన్నారు. చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆయన గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించారు.
అనంతరం హైదరాబాద్‌లో నీటి పారుదల అధికారులతో జలసౌధలో సమావేశమయ్యారు. నీటి సంరక్షణ, నిర్వహణ తదితర అంశాలపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. మిషన్ కాకతీయతో పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేయడం ప్రశంసనీయమని, దీనిద్వారా ‘మన ఊరు-మన చెరువు-మన అభివృద్ధి’ అనే భావన ప్రజల్లో పెరుగుతుందన్నారు. చెరువుల పరిరక్షణకు కఠిన చట్టాలను అమలుచేస్తే మరింత ఫలితం ఉంటుందని తెలిపారు.