గ్రేటర్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున రికార్డు వర్షం కురిసింది.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున రికార్డు వర్షం కురిసింది. దాదాపు 78 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ మాసంలో..మండువేసవిలో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం విశేషం. 1937 ఏప్రిల్ 20న.. 24 గంటల వ్యవధిలో 60.7 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదవడం ఇప్పటివరకున్న రికార్డు. ఆ తర్వాత ఇప్పుడు... ఏప్రిల్ 12 ఉదయం 8.30 గంటల నుంచి 13న ఉదయం 8.30 గంటల వరకు 61.4 మిల్లీమీటర్లు(6.1 సెంటీమీటర్లు)వర్షపాతం నమోదవడంతో పాత రికార్డు బద్ధలయింది. వాస్తవంగా ఏప్రిల్ మాసంలో మండుటెండలు సాధారణం. అడపాదడపా ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురవడం చూశాం.
కానీ కనీవినీ ఎరగని రీతిలో ఈసారి వర్షం కురవడం గమనార్హం. అంతేకాదు ఏప్రిల్ మాసమంతా కురిసే వర్షపాతం రె ండోవారంలోనే నమోదవడం మరో రికార్డు. ఇక ఏప్రిల్ మాసాన్ని మొత్తం పరిగణలోకి తీసుకుంటే 1907లో మాత్రం 141 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2013 ఏప్రిల్ నెలలో 74.5 సగటు వర్షపాతం నమోదైంది. కానీ ఈసారి రెండోవారంలోనే నగరంలో రికార్డు వానలు కురుస్తున్నాయి. ఈనెలాఖరు నాటికి 1907 నాటి రికార్డు కూడా బద్ధలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అతలాకుతలం...
గత నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం చిత్తడినేలగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతున నిలిచన వర్షపునీటిలోనే వాహనాలు భారంగా ఈదాల్సి వచ్చింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. ఈదురుగాలుల బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడడంతో శివారు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. రాజ్‌భవన్, బేగంపేట్, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్‌లోని ప్రధాన రహదారులపై నిలిచిన నీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది నానా తంటాలు పడ్డారు. మెట్రో ప్రాంతాల్లో మరీ ఇబ్బందులెదురయ్యాయి.
అసాధారణ వర్షపాతానికి కారణాలివే..
- విశ్వవ్యాప్త గ్లోబల్ వార్మింగ్ వల్లే అకాల వర్షాలని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా పశ్చిమ సంక్షోభం ఏర్పడి వేసవిలోనూ తేమగాలుల తీవ్రత అధికమవుతోందని, అకాల వర్షాలు కురుస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
- ఛత్తీస్‌ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం, అరేబియా, బంగాళాఖాతం సముద్రాల పైనుంచి నగరంవైపు వీస్తున్న బలమైన తేమ గాలుల కారణంగా నగరంలో వానలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్త సీతారాం ‘సాక్షి’కి తెలిపారు.
- రాగల 24 గంటలపాటు నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.