పాట్రిక్ ఒక వాటర్ మ్యాన్..
ఈయన పేరు పాట్రిక్ మ్వాలా. ఇతనొక రైతు. పాట్రిక్‌ను అందరూ వాటర్ మ్యాన్ అని కూడా అంటారు. ఈ పేరు రావడానికి వెనుక ఒక చిన్న కథ ఉంది. పాట్రిక్ స్వతహాగా జంతు ప్రేమికుడు. ఇతను ప్రతిరోజూ కొన్ని గంటల పాటు ప్రయాణం చేసి జంతువుల దాహార్తిని తీరుస్తుంటాడు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రస్తుతం కెన్యాలో చాలా జీవులు నీరు లేక అలమటిస్తున్నాయి. వాటి దాహాన్ని తీర్చడానికి పాట్రిక్ నడుం బిగించాడు.
కెన్యాలోని సావో వెస్ట్ నేషనల్ పార్క్‌లో ఉన్న జంతువులకు నీటిని అందజేసి వాటి దాహార్తిని తీరుస్తున్నాడు. ప్రతిరోజూ ఒక ట్రక్కులో సుమారు 3 వేల గ్యాలన్ల నీటిని పార్క్‌కు చేరవేస్తుంటాడు. పాట్రిక్ ఎప్పుడు వస్తాడా అన్నట్లు అతడి రాకకోసం జంతువులు కూడా రోజూ ఎదురుచూస్తూ ఉంటాయి. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నీరు కావాల్సినంతగా అందుబాటులో లేదు. జంతువులు సాధారణంగా మానవులపైనే ఆధారపడి జీవిస్తుంటాయి. మనం కనుక వాటికి సాయపడకపోతే అవి చనిపోతాయి. నేను వెళ్లగానే ఆ జంతువులు ఆశగా నా దగ్గరికి వస్తాయి’ అని పాట్రిక్ చెబుతున్నాడు.