84 ఏళ్ల వయసులో 2 కోట్ల లీటర్ల నీటిని..
ఆబిద్ సుర్తి.. 84 ఏళ్ల వయసులోనూ చుక్క నీరు వృథా కాకుండా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఆయన దాదాపు 2 కోట్ల లీటర్ల నీటిని వృథా కాకుండా అరికట్టాడు. ఇంతకీ ఎలా అరికట్టాడడనే కదా? ఆ వివరాలేవో ఆయన మాటల్లోనే చదవండి... మాది చాలా పేద కుటుంబం. ఉండటానికి ఇల్లు కూడా లేదు. రోడ్డు మీదే జీవనం. బకెట్ నీళ్ల కోసం కొట్టుకున్న రోజులు గుర్తున్నాయి. అందుకే.. నాకు నీటి విలువ బాగా తెలుసు. నాపేరు ఆబిద్ సుర్తి. నేను పెయింటర్, రచయిత, కార్టునిస్ట్. ఇవి కాక.. రోజూ ఓ కాలనీని ఎంచుకొని.. ప్రతి ఇంటికి వెళ్తా. ఆ ఇంట్లో వాటర్ లీకేజీ ఉన్న నల్లాలను సెట్ చేస్తా. చుక్క నీరు కూడా వృథాగా పోవద్దనేది నా ఆశయం. అందుకే లీకేజీ ఉన్న నల్లాలను సెట్ చేస్తుంటా.
ఇందుకోసం రూపాయి కూడా తీసుకోను. చుక్క నీరే కదా అని పెద్దగా పట్టించుకోనివారు మన ఇంట్లోనే ఉంటారు. కానీ ప్రతి నీటి బొట్టూ విలువైందే. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. ఏ ఇంట్లో కూడా టప్.. టప్ అనే సౌండ్ రాకూడదని ఫిక్స్ అయ్యా. అందుకే.. డ్రాప్ డెడ్ ఫౌండేషన్‌ను ప్రారంభించా. ఇందుకోసం ముందుగా ఒక ప్లంబర్‌ను తీసుకొని నా బంధువులు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లా. వాళ్ల ఇళ్లలో లీకేజీ ఉన్న నల్లాలను ముందు ఫిక్స్ చేశా. అప్పుడు చాలా ఆనందమేసింది. అది నాకు ఎంతో రిలీఫ్‌నిచ్చింది. తర్వాత ప్రతి ఇంటికి వెళ్లడం ప్రారంభించా. ఏ ఇంట్లో లీకేజీ లేకుండా నల్లాలను ఫిక్స్ చేయడం ప్రారంభించా. నీకు ఇవన్నీ అవసరమా? చుక్క నీళ్లకు అంత బాధపడుతున్నావు.
మా ఇంట్లో నుంచి నదులకు నదుల నీళ్లు వృథా అవుతున్నాయా? అంటూ నా సన్నిహితులు అంటుంటారు. కానీ.. నేను అవేవీ పట్టించుకోను. ముందు నా దగ్గర ఉన్న డబ్బుతో ప్రతి ఇంటికి తిరిగి నల్లాలు ఫిక్స్ చేసేవాడిని. తర్వాత నాకు లిటరేచర్ అవార్డు ద్వారా వచ్చిన డబ్బును ఉపయోగించి.. నల్లాలను ఫిక్స్ చేస్తున్నాను. ఈ సమాజానికి నువ్వు ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.. దేవుడే నీకు ఎలాగోలా దారి చూపిస్తాడు. నాకు కూడా చూపించాడు. నీటి విలువను ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం 2007 నుంచి కృషి చేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి ఇళ్లలో నల్లాల లీకేజీని అరికట్టి.. 2 కోట్ల లీటర్ల నీటిని కాపాడగలిగా. ఈ ఉద్యమాన్ని నేను నా చివరి శ్వాస వరకు కొనసాగిస్తా.