విత్తనం మొలకెత్తి ధాన్యరాశులైతేనే మన కడుపు నిండేది. మనం తింటున్న ఆహారం 95% మేరకు నేలతల్లే మనకు అందిస్తున్నది. అయితే, ఈ క్రమంలో మనం అనుసరిస్తున్న విధ్వంసకర పద్ధతుల వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమి నాశనమైపోతోందని అందరికీ తెలిసిందే. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఎంత భూమి పాడై ఉంటుంది? ఈ విషయం తెలుసుకునేందుకు 2018లో ఐక్యరాజ్య సమితి ఒక సర్వే జరిపింది. భూముల విస్తీర్ణంలో 75% ఇప్పటికే తీవ్రస్థాయిలో నిస్సారమై పోయిందని దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెల్లడించింది. రైతులే కాదు మానవాళి యావత్తూ మేలుకొని జాగ్రత్తపడకపోతే 2050 నాటికి 90% భూమి నాశనమైపోవచ్చని కూడా ఐరాస హెచ్చరించింది. భూమికి జరిగే ఈ నష్టం విలువ ఎంత ఉండొచ్చు? ఎడారీకరణపై ఐక్యరాజ్యసమితి ఒడంబడిక నివేదిక ప్రకారం ఈ నష్టం 23 ట్రిలియన్ డాలర్ల మేరకు ఉండొచ్చని అంచనా.
భూతాపం పెరిగి సాగు యోగ్యం కాకుండా ఎడారిగా మారిపోవడానికి మూడింట ఒక వంతు కారణం.. అడవిని నరికేయడం, ప్రకృతికి నష్టదాయక వ్యవసాయ పద్ధతుల వల్ల భూమిలో కర్బనం తగ్గిపోవడం, నీటి లభ్యత తగ్గిపోవడం. భూమిలో జీవం తగ్గిపోవడం వల్ల జీవవైవిధ్యం అంటే.. భిన్న జాతుల చెట్టు చేమ, జీవరాశి అంతరించిపోతోంది.
వరల్డ్ వైడ్ ఫండ్ సంస్థ తొలిసారి 2018లోనే ‘గ్లోబల్ సాయిల్ బయోడైవర్సిటీ అట్లాస్’ను రూపొందించింది. చాలా దేశాల్లోని భూముల్లోని సూక్ష్మజీవరాశి, వానపాములు వంటి జీవులకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. నిజానికి ఈ ముప్పు మానవాళికి ఎదురవుతున్న ముప్పే. జాగ్రత్తపడకపోతే 2050 నాటికి 500 కోట్ల మంది మనుగడకే ముప్పు పొంచి ఉంటుంది.
అటువంటి దేశాల జాబితాలో మన దేశంతోపాటు పాకిస్తాన్, చైనా కూడా ఉన్నాయి. ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో నేలల్లో సూక్ష్మజీవరాశి ఘోరంగా దెబ్బతిన్నది. భూమి లోపల జీవైవిధ్యం దెబ్బతినటంతోపాటు పరపరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు, సీతాకోకచిలుకలు అంతరించిపోతున్నాయి. వ్యక్తులు, సంస్థలు, అన్ని దేశాలూ కలసికట్టుగా కదలాలి. నిర్ణీత కాలంలో జీవవైవిధ్యాన్ని పెపొందించుకునేలా చర్యలు తీసుకొని అమలు చేయడం మేలని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏటేటా ముప్పు పెరుగుతోంది.
Published Tue, Jan 1 2019 9:40 AM | Last Updated on Tue, Jan 1 2019 9:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment