గ్రెటా థన్‌బర్గ్.. ఈ పేరు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. స్పీడన్ దేశానికి చెందిన ఈ బాలిక.. ‘‘మీ అవసరాల కోసం మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీకెంత ధైర్యం’’ అంటూ ప్రపంచ దేశాలను ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రశ్నించింది. అభివృద్ది పేరుతో విచ్చలవిడిగా కార్భన్ ఉద్గారాలను విడుదల చేస్తూ పోతున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటని నిలదీసింది. కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పులు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న వేళ.. ఇందుకు సంబంధించిన తాజా నివేదిక.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
ప్రపంచంలోని చాలా సంపన్న దేశాలు భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థ తమ తాజా నివేదికలో తెలిపాయి. గ్లోబల్ వార్మింగ్, కర్భన ఉద్గారాలు భావితరాల ఆరోగ్యంపై, అభివృద్దిపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ప్రపంచంలోని ఏ దేశం కూడా పిల్లల అభివృద్ధి, భవిష్యత్తు, సమానత్వం విషయంలో సత్ఫలితాలను సాధించలేకపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ది లాంసెట్ జర్నల్, యునిసెఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక కమిషన్ వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం నార్వే, సౌత్ కొరియా, నెదర్లాండ్‌లో పిల్లలకు ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం లభిస్తున్నాయని వెల్లడించింది. అధిక పరిమాణంలో ఉద్గారాలను వెదజల్లుతున్న అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాత్రం ఈ విషయంలో వెనుకంజలో ఉన్నాయని పేర్కొంది. కమిషన్ సభ్యులు, న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలకు ఆరోగ్యం, విద్య, రక్షణ కల్పించడమే కాకుండా వారికి సురక్షిత భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రపంచ దేశాలపై ఉందని పేర్కొన్నారు. గత ఐదు శతాబ్దాలుగా బాలల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని.. అయితే అదే సమయంలో ఆర్థిక అసమానతలు కూడా పెరిగాయని తెలిపారు. మరోవైపు భూగోళం వేడెక్కడం, పర్యావరణానికి హాని కలిగించడం భవిష్యత్ తరాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయని నివేదికలో తెలిపారు.
పర్యావరణ క్షీణత పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుపై అత్యంత ప్రభావం చూపుతుందని కమిషన్ సభ్యులు సునీత నారయణ్ పేర్కొన్నారు. చేయని తప్పునకు వారు బలికాబోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక విప్లవం తరువాత ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగాయని తెలిపారు. ఆఫ్రికాలోని రెండు దేశాలు మినహా మిగిలిన అన్ని దేశాలు పిల్లల ఆరోగ్యం, విద్య విషయంలో వెనుకబడి ఉన్నాయని రిపోర్టులో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment