Health Report
-
కమలా హారిస్ హెల్త్‌పై డాక్టర్ రిపోర్టు ఇదే..
న్యూయార్క్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆరోగ్యంతో భేషుగ్గా ఉందని ఆమె డాక్టర్ యూఎస్ ఆర్మీ ఫిజిషియన్ జాషువా ఆర్. సిమన్స్ తెలిపారు. కమల ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ ఇచ్చిన నివేదికను శనివారం వైట్ హౌస్ విడుదల చేసింది.‘‘కమలా హారిస్‌కు కాలానుగుణంగా వచ్చే అలెర్జీలు, దద్దుర్లు ఉన్నాయి. ఆమె ఇమ్యునైజేషన్లు , నివారణ సంరక్షణ సిఫార్సులు సరిగా ఉన్నాయి. ఆమె ఎప్రిల్నెలలో చేసుకున్న ఫిజికల్ పరీక్ష, సాధారణ రక్త పరీక్షల్లో కూడా ఎటువంటి సమస్య లేదు. కళ్లకు కాంటాక్ట్ లెన్స్‌లు ధరిస్తారు. విటమిన్ D3 సప్లిమెంట్ తీసుకుంటారు. కొన్ని సమయాల్లో అల్లెగ్రా, నాసల్ స్ప్రే , ఐ డ్రాప్స్‌తో పాటు అలెర్జీకి మందులను ఉపయోగిస్తారు. .. కమల తీసుకునే ఆహారం చాలా ఆరోగ్యకరమైంది. హారిస్ పొగాకు ఉత్పత్తులు, అల్కాహాల్ తీసుకోరు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అదీకూడా చాలా మితంగా తీసుకుంటారు. అమెరికా అధ్యక్షురాలిగా పనిచేసేందుకు ఆమె చాలా ఫిట్‌గా ఉన్నారు. విధులు నిర్వహించేందుకు అవసరమైన శారీరక, మానసిక స్థితిని కమల కలిగి ఉన్నారు’’ అని డాక్టర్ సిమన్స్ నివేదికలో వివరించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలిగి.. ఉపాధ్యక్షురాలు కమలను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగానే అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలిగినట్లు గతంలో ఆరోపణలు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ తన ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తి సమాచారాన్ని విడుదల చేశారు.చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
బడి పిల్లలు..బలహీనం
సాక్షి, హైదరాబాద్: షోషకాహారలోపం, శారీరక శ్రమ లేకపోవడంతో జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా బడి పిల్లలు బలహీనంగా తయారవుతున్నారు. దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో ఆరోగ్యం, ఫిట్నెస్ సామర్థ్యం తెలుసుకునేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూత్ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ స్పోర్ట్స్ విలేజ్ సర్వే చేసింది. 250 నగరాలు, పట్టణాల్లో 7 –17 ఏళ్ల వయసు ఉన్న 73 వేల మంది విద్యార్థులపై సర్వే చేసి, 12వ వార్షిక ఆరోగ్య నివేదిక విడుదల చేసింది. దక్షిణాది విద్యార్థులు బలంగానే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లోని పిల్లల్లో ఛాతీ, శరీర కింది భాగం బలంగా ఉన్నాయి. ఉత్తర రాష్ట్రాల పిల్లల్లో బలహీనమైన బీఎంఐ, కీళ్లు, ఉదర కండరాలు సమస్యలున్నాయి. తూర్పు రాష్ట్రాల్లో బీఎంఐ, ఫ్లెక్సిబులిటీ, ఛాతీభాగం ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఇక పశ్చిమాది రాష్ట్రాల విద్యార్థులలో ఏరోబిక్ కెపాసిటీ, శరీర కింది భాగం, కీళ్ల కదలికలు మెరుగ్గా ఉన్నాయి. హైదరాబాద్ విద్యార్థులు హెల్తీ ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నగరంలోని 58 శాతం విద్యార్థుల శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలుండగా, 49 శాతం మందికి బలమైన ఛాతీ, 84 శాతం సమర్థమైన ఉదర భాగాలున్నాయి. 46 శాతం మందిలో శరీర కింది భాగం బలంగా ఉండగా.. 64 శాతం పిల్లల్లో కీళ్ల కదలికలు చురుగ్గా ఉన్నాయి. 41 శాతం మందికి మెరుగైన ఏరోబిక్ సామర్థ్యం, 58 శాతం విద్యార్థుల్లో వాయురహిత జీర్ణక్రియ సమర్థంగా ఉంది. వారంలో రెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) తరగతులు ఉన్న స్కూళ్ల విద్యార్థుల్లో బలమైన ఛాతీ, ఉదర భాగంతో పాటు కండరాల కదలికలలో చురుకుదనం, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నాయి. అమ్మాయిలే ఆరోగ్యంగా.. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఆరోగ్యంగా ఉన్నారు. 62 శాతం ఆడపిల్లల బీఎంఐ సూచీ ఆరోగ్యకరంగా ఉంది. 47 శాతం అమ్మాయిల్లో బలమైన ఛాతీభాగం, 70 శాతం మందికి కీళ్లు, శరీర కదలికల్లోనూ ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. అయితే 20 శాతం బాలికల్లో ఏరోబిక్ కెపాసిటీ, 37 శాతం మందిలో శరీర కింది భాగం బలంగా లేదు. ప్రభుత్వ పాఠశాల పిల్లలే బెటర్ ప్రైవేట్‌తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులే ఆరోగ్యంగా ఉన్నారు. వీరిలో బీఎంఐ, ఏరోబిక్ కెపాసిటీ, కీళ్ల కదలికలు ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. అయితే 43 శాతం ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో మాత్రం ఛాతీ భాగం సౌష్టవంగా ఉంది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులలో 62 శాతం మందికి ఆరోగ్యకరమైన బీఎంఐ, 70 శాతం మందికి ఫ్లెక్సిబుల్ కీళ్లు, 73 శాతం పిల్లల్లో యాన్‌ఏరోబిక్ కెపాసిటీ, 31 శాతం మంది బలమైన ఛాతీ ఉంది. అదే ప్రైవేట్ పాఠశాలల పిల్లల్లో 58 శాతం మందికి బీఎంఐ, 64 శాతం ఫ్లెక్సిబుల్ కండరాలు, 55% యాన్‌ఏరోబిక్ కెపాసిటీ, 43 శాతం మంది విద్యార్థులకు ఛాతీభాగం బలంగా ఉంది. నివేదికలోని ముఖ్యాంశాలు ♦ ప్రతీ ఐదుగురు పిల్లల్లో ఇద్దరి శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు (బాడీ మాస్ ఇండెక్స్– బీఎంఐ), వాయు రహిత జీర్ణక్రియ (యాన్‌ఏరోబిక్ కెపాసిటీ) ప్రక్రియ సరిగ్గా లేదు. ♦ ఐదుగురిలో ఒకరికి స్వేచ్ఛగా కీళ్లు కదిలే సామర్థ్యం లేదు. ♦ ముగ్గురికి గుండె, ఊపిరితిత్తుల కండరాలకుఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ♦ ముగ్గురిలో ఒకరికి ఉదర కండరాలు బలహీనంగా ఉన్నాయి. ♦ ప్రతి ఐదుగురిలో ముగ్గురికి ఛాతీ భాగం బలహీనంగా ఉంది. -
బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు?: మంత్రి సీదిరి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: మానవతా దృక్ఫథంతో కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం ఆయన పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు న్యాయ వాదులు అఫిడివిట్, మెడికల్ రిపోర్ట్స్ దాఖలు చేసి బెయిల్ పొడిగించాలని కోర్టుని కోరారని.. చంద్రబాబు నిప్పు అని క్వాష్ పిటిషన్ వేశారు తప్ప, ఎక్కడా తప్పు చేయలేదని ఎక్కడా చెప్పలేదన్నారు. ‘‘చంద్రబాబు జైలులో ఉన్నన్నాళ్లు జనం చచ్చిపోతున్నారని పచ్చ మీడియా వార్తలు రాసింది. చనిపోయిన వాళ్లని ఓదార్చుతామని, నిజం గెలవాలని భవనేశ్వరి యాత్ర చేపట్టారు. బయటకు వచ్చాక యాత్ర ఎందుకు ఆపేశారు? అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు బెయిల్ డ్రామాలపై నిజం గెలవాలని మేమూ డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్‌గా పరిశీలించాను. చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. గుండె జబ్బులు ఉన్నాయన్న ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబుకి ఏ డాక్టర్ కూడా కన్ను ఆపరేషన్ చేయరు. బెయిల్ కోసం ఇన్ని డ్రామాలు ఎందుకు’’ అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్‌లో ఉన్నప్పుడు కన్ను ఆపరేషన్ ఏ డాక్టర్ చేయరు. బెయిల్ పొడిగించుకోవడానికి ఈ మెడికల్ రిపోర్ట్ స్టోరీ అల్లుతున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం గుండెకు మెయిక్టమీ, బైపాస్ సర్జరీ చేశాకే కన్ను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ రిపోర్ట్స్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ ఎక్కడా రాయలేదు. ఏంజియోగ్రామ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు. బెయిల్ పొడిగించుకోవడానికి టీడీపీ ఆఫీస్‌లో మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి ఇచ్చారు’’ అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా? -
అతికినట్టు చెప్పినా.. అబద్ధాలు నిజాలయిపోవు
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలు అతికినట్లు చెప్పినా.. అవి నిజాలు అయిపోవని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. మెటర్నిటీ మరణాలను ఆపలేని ప్రభుత్వానికి.. మెరుగైన వైద్యంలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పుకోవడం సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విడుదల చేసిన హెల్త్ రిపోర్ట్ ‘ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డైడ్’ అన్నట్లుందని వ్యాఖ్యానించారు. 300 మంది సిబ్బంది ఉండాల్సిన జిల్లా ఆసు పత్రిలో 30 మందితో వైద్యం అందించ డం అభివృద్ధి అంటారా అని ప్రశ్నించారు. ఎక్స్‌రే, సిటీ స్కాన్, టిఫా స్కాన్ లాంటి యంత్రాలకు టెక్నీషియన్లు లేక ఎన్నో ఆసు పత్రుల్లో మూలకు పడ్డాయన్నారు. మహానేత హయాంలో అద్భుతంగా అమలైన ఆరోగ్యశ్రీ పథకాన్ని డెత్ బెడ్ ఎక్కించారని మండిపడ్డారు. -
రాష్ట్రంలో సెకండ్ వేవ్ ముగిసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయిందని, కానీ థర్డ్ వేవ్ రాకుండా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి టీకాలిచ్చామన్నారు. 56 శాతం మందికి తొలి డోస్, 34 శాతం మందికి రెండో డోస్ పూర్తయిందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 90 శాతం మందికి తొలి డోసు వేయగా, హైదరాబాద్‌లో 100 శాతం సింగిల్ డోసు తీసుకున్నట్లు ఆయన బుధవారం మీడియాకు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటింటికీ తిరికి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పోస్ట్ కోవిడ్‌తో ఆస్పత్రుల్లో ఎక్కువమంది ఉన్నారని, లాంగ్ టర్మ్ కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయన్నారు. అయితే అన్ని జ్వరాలను కరోనాగా భావించవద్దని, జ్వర లక్షణాలు ఉన్నోళ్లంతా వైద్యుడిని సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అయితే ఈ వ్యాధులు పెరగకుండా వైద్య,ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. రెండు జిల్లాల్లో అధికంగా డెంగీ కేసులు హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా రాగా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో మలేరియా కేసులు ఎక్కువగా వచ్చాయని శ్రీనివాసరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 220, ములుగు జిల్లాలో 120పైగా మలేరియా కేసులు నమోదైనట్లు చెప్పారు. గతేడాది రాష్ట్రంలో 2,173 డెంగీ కేసులు నమోదైతే, ఈ ఏడాది ఇప్పటికే 1,200 నమోదయ్యాయన్నారు. అందులో 448 డెంగీ కేసులు హైదరాబాద్‌లో నమోదయ్యాయన్నారు. దోమలు, లార్వా అభివృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లార్వాను సూచించే బృటా ఇండెక్స్ హైదరాబాద్‌లో 46 శాతం, రంగారెడ్డి జిల్లాలో 39.9 శాతం ఉందన్నారు. అనేక జిల్లాల్లో ఇది 35 శాతం కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. ‘ఎవరికైనా జ్వరం, విరేచనాలు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్లెట్ ఎలక్ట్రిక్ యంత్రాలను సిద్ధంగా ఉంచాం. పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. డెంగీ దోమ పగటి వేళలోనే కుడుతుందని, అందువల్ల ఇళ్లలోకి దోమలు రాకుండా చూసుకోవాలన్నారు. 2025లోపు తెలంగాణను మలేరియారహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. చదవండి: ప్రేయసి కోసం ‘ఆమె’లా మారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన లవర్ చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ -
సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులన్నీ నార్మల్‌గా (సాధారణంగా)నే ఉన్నట్లు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గురువారం ఛాతిలో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో సీఎంకు ఆస్పత్రిలో చెస్ట్ సీటీ, అబ్డామినల్ అల్ట్రాసౌండ్, కిడ్నీ కెయుబీ, లివర్ ఫంక్షనింగ్, డయాబెటిస్, ఇతర రక్త, మూత్ర పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. సీటీ స్కాన్ పరీక్షలో ఊపిరితిత్తుల్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ కాగా.. ఆ మేరకు వైద్యులు యాంటీబయాటిక్ మందులు వాడాలని సీఎంకు సూచించిన విషయం విదితమే. రక్తపరీక్షల రిపోర్టులు శుక్రవారం వెలువడ్డాయి. రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యానికి ఢోకాలేదని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. చదవండి: (సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్) -
అమర్నాథ్ యాత్ర జూలై 21 నుంచి
జమ్మూ: అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకు దాదాపు 15 రోజులపాటు జరగనుంది. ఈ విషయాన్ని శ్రీఅమర్నాథ్ దేవస్థానం బోర్డు(ఎస్ఏఎస్బీ) ప్రకటించింది. యాత్రకు అంకురార్పణ చేస్తూ ప్రథమ పూజను శుక్రవారం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి అమర్నాథ్ యాత్రను కుదించారు. సాధువులు మినహా 55 ఏళ్లు పైబడిన వారిని యాత్రకు అనుమతించరు. అనంత్‌నాగ్ జిల్లాలో పవిత్ర గుహలో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లు కలిగి ఉండడం తప్పనిసరి. యాత్ర కోసం వచ్చే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని శ్రీఅమర్నాథ్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. మంచు శివలింగం దర్శనానికి సాధువులు మినహా మిగతా యాత్రికులంతా ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పవిత్ర గుహలో 15 రోజులపాటు ఉదయం, సాయంత్రం హారతి ఇవ్వాలని, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులు నిర్ణయించారు. బాల్తాల్ మార్గంలోనే యాత్ర జరుగుతుంది. పహల్గామ్ మార్గంలో ఎవరినీ అనుమతించరు. బెంగళూరులో భక్తుల రాకకోసం ఆలయాలను సిద్ధం చేస్తున్నారు. శనివారం సిటీలో ఓ ఆలయంలో విగ్రహాలపై రసాయనాలు చల్లి క్రిమిరహితం చేస్తున్న అర్చకులు -
ఆ దేశాలు తప్ప.. మిగిలినవన్నీ..
గ్రెటా థన్‌బర్గ్.. ఈ పేరు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. స్పీడన్ దేశానికి చెందిన ఈ బాలిక.. ‘‘మీ అవసరాల కోసం మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీకెంత ధైర్యం’’ అంటూ ప్రపంచ దేశాలను ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రశ్నించింది. అభివృద్ది పేరుతో విచ్చలవిడిగా కార్భన్ ఉద్గారాలను విడుదల చేస్తూ పోతున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటని నిలదీసింది. కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పులు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న వేళ.. ఇందుకు సంబంధించిన తాజా నివేదిక.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ప్రపంచంలోని చాలా సంపన్న దేశాలు భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థ తమ తాజా నివేదికలో తెలిపాయి. గ్లోబల్ వార్మింగ్, కర్భన ఉద్గారాలు భావితరాల ఆరోగ్యంపై, అభివృద్దిపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ప్రపంచంలోని ఏ దేశం కూడా పిల్లల అభివృద్ధి, భవిష్యత్తు, సమానత్వం విషయంలో సత్ఫలితాలను సాధించలేకపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ది లాంసెట్ జర్నల్, యునిసెఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక కమిషన్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం నార్వే, సౌత్ కొరియా, నెదర్లాండ్‌లో పిల్లలకు ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం లభిస్తున్నాయని వెల్లడించింది. అధిక పరిమాణంలో ఉద్గారాలను వెదజల్లుతున్న అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాత్రం ఈ విషయంలో వెనుకంజలో ఉన్నాయని పేర్కొంది. కమిషన్ సభ్యులు, న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలకు ఆరోగ్యం, విద్య, రక్షణ కల్పించడమే కాకుండా వారికి సురక్షిత భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రపంచ దేశాలపై ఉందని పేర్కొన్నారు. గత ఐదు శతాబ్దాలుగా బాలల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని.. అయితే అదే సమయంలో ఆర్థిక అసమానతలు కూడా పెరిగాయని తెలిపారు. మరోవైపు భూగోళం వేడెక్కడం, పర్యావరణానికి హాని కలిగించడం భవిష్యత్ తరాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయని నివేదికలో తెలిపారు. పర్యావరణ క్షీణత పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుపై అత్యంత ప్రభావం చూపుతుందని కమిషన్ సభ్యులు సునీత నారయణ్ పేర్కొన్నారు. చేయని తప్పునకు వారు బలికాబోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక విప్లవం తరువాత ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగాయని తెలిపారు. ఆఫ్రికాలోని రెండు దేశాలు మినహా మిగిలిన అన్ని దేశాలు పిల్లల ఆరోగ్యం, విద్య విషయంలో వెనుకబడి ఉన్నాయని రిపోర్టులో తెలిపారు. -
అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం గురించి ఎవరికి తెలుసు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రట్ల తరఫున పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ వారం రోజుల క్రితం హఠాత్తుగా జబ్బు పడడంతో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఆరోగ్య నివేదికలను ముందుగానే విడుదల చేయాలా, వద్దా? అన్న అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. హిల్లరీ క్లింటన్‌కు నిమోనియా సోకిందని ఆమె ఫిజిషియన్ ఇటీవల ధ్రువీకరించడం, దాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా ఆమెపై రిజబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వాడుకుంటున్న విషయం తెల్సిందే. నాలుగేళ్లపాటు అమెరికా అధ్యక్షుడిగా అత్యున్నత స్థానంలో విధులు నిర్వర్తించాల్సిన వ్యక్తి శారీరకంగాను, మానసికంగాను ఆరోగ్యవంతుడై ఉండాలనేది అందరూ అంగీకరించే విషయమే. దేశాధ్యక్షుడికైనా, సామాన్య పౌరుడికైనా ఫెడరల్ ప్రైవసి చట్టాలు ఒకేలా వర్తిస్తాయి కనుక వారి ఆరోగ్య వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నది కొందరి వాదన. సైనికులకు, పైలెట్లకు ఫిట్నెస్ పేరిట నియామకాల కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే తప్పేమిటీ? అన్న మరో వాదన ఉంది. ఈ రెండో వాదన ప్రకారం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులకు అమెరికా ఫిజీషియన్స్ కాలేజీ నుంచి ఎంపిక చేసిన స్వతంత్య్ర బృందంతోని ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఓ ఉన్నతస్థాయి వైద్యుల బృందం 2008లోనే అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ఇప్పటికీ అది అధికారికంగా అమలు కావడం లేదు. కలుషితమైన నేటి రాజకీయాల్లో ఈ సిఫార్సును అమలు చేయడం కుదరదని, ఆరోగ్య నివేదికను రాజకీయ ప్రత్యర్థులు స్వప్రయోజనాల కోసం ఉపయోగించునే ప్రమాదం ఉందని ఉన్నతస్థాయి వైద్యుల బృందంలో ఉన్న డాక్టర్ మరియానే వ్యాఖ్యానించడం గమనార్హం. పైగా, విప్లవాత్మక మార్పులు వస్తున్న ఆధునిక వైద్య విధానంలో ఫిట్నెస్ ప్రమాణాలను నిర్ధారించడం కూడా క్లిష్టమవుతుందని కొందరి వైద్యుల వాదన. చిన్న రోగాల నుంచి అభ్యర్థులు త్వరలోనే కోలుకునే అవకాశం ఉంటుందని, అల్జీమర్స్ లాంటి జబ్బులు వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని వారంటున్నారు. అల్జీమర్స్ జబ్బు బయటపడడానికి 30 ఏళ్ల ముందే సోకుతుందనే విషయం ఇటీవల తెల్సిందని, అలాంటి వ్యక్తులు కూడా నాలుగేళ్లపాటు సమర్థంగా విధులు నిర్వర్తించే అవకాశాలు ఉంటాయని కూడా వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. నాలుగేళ్లపాటు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని వైద్య నిపుణులు నిర్ధారించే అవకాశాలున్నాయి. అయితే అప్పుడు కూడా డాక్టర్ల నివేదికలను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం అభ్యర్థులకు ఉండదా? అన్న మరో ప్రశ్న తలెత్తుతోంది. ఇంతవరకు అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన ఎంతోమంది నాయకులు తమ ఆరోగ్య వివరాలను ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచిన విషయాలు తెల్సిందే. వారిలో ఒకరిద్దరు అనారోగ్యంతో పదవిలో ఉండగానే మరణించారు కూడా. ఇప్పటివరకు అమెరికాను పాలించిన 44 మంది దేశాధ్యక్షుల్లో 18 మంది తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఎక్కువ మంది మానసిన ఒత్తిడిలు, ఆందోళనలు, బైపోలార్ జబ్బులు, క్యాన్సర్తలో బాధపడ్డారు. అమెరికా అధ్యక్షుల్లో అందరికంటే ఆరోగ్యవంతుడిగా, యువకుడిగా భావించిన జాన్ ఎఫ్ కెన్నడీ 43 ఏళ్ల వయస్సులోనే ‘హైపోథైరాయిడ్, బ్యాక్ పెయిన్, ఆడిసన్స్ డిసీస్’ లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అల్జీమర్స్ వ్యాధినపడ్డారు. అప్పుడు ఆయన సమర్థంగా విధులు నిర్వర్తించగలిగారా, లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమే. గ్రోవర్ క్లెవలాండ్కు క్యాన్సర్ వచ్చింది. ఆయన యాట్‌పై సముద్ర జలాల్లోకి వెళ్లి రహస్యంగా వైద్య బృందాన్ని పిలుపించుకొని నోటి పైభాగంలో పెరిగిన ట్యూమర్‌ను తొలగించుకున్నారు. 2000 సంవత్సరం నాటి వరకు దేశాధ్యక్షులుగా పోటీ చేసిన వారు ఎవరూ స్వచ్ఛందంగా తమ ఆరోగ్య వివరాలను వెల్లడించలేదు. 2000, 2008లో పోటీ చేసిన సెనేటర్ జాన్ మకెయిన్ ఆరోగ్య వివరాలను తొలుత వెల్లడించారని చెప్పవచ్చు. ఇప్పుడు దేశాధ్యక్షులుగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌లు కూడా తమ ఆరోగ్య వివరాలను వెల్లడించారు. అయితే వారు వెల్లడించింది ఎంపిక చేసుకున్న కొన్ని వివరాలు మాత్రమే. హిల్లరీకి నిమోనియా సోకిందనే వార్త తెలియగానే ఆమెకన్నా, అందరికన్నా తాను ఆరోగ్యవంతుడునని డోనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో ఆయనకే తెలియాలిగానీ, ఇప్పటివరకు దేశాధ్యక్షులుగా పోటీ చేసిన వారందరికన్నా ట్రంప్ ఆరోగ్యవంతుడని, దేశాధ్యక్ష పదవికి ఆయన సమర్థుడని ఆయన ఫిజీషియన్ డాక్టర్ హరాల్డ్ చెప్పడం రాజకీయంగా వివాదం రేపింది. ఆయన తన వృత్తికి పరిమితం కాకుండా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంతకు దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలా లేదా వారే తమ ఆరోగ్య వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించాలా? అన్న ప్రశ్న ఇప్పటికీ సశేషమే. -
అక్రమార్కుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
పశ్చిమకృష్ణా, న్యూస్‌లైన్ : అటవీశాఖలో అవినీతి అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. కొత్తూరు రిజర్వు ఫారెస్ట్ అక్రమాలపై చీఫ్ కన్జర్వేటర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అక్రమార్కులు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజులుగా రాత్రి సమయాల్లో ఆక్రమణదారులతో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. నాలుగైదేళ్ల క్రితమే ఇళ్లు నిర్మించుకున్నామని లేఖలు రాయాల్సిందిగా ఆక్రమణదారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ససేమిరా అనేవారికి రూ.20 వేలు ఎదురిచ్చి మరీ లేఖలు రాయిస్తున్నారని తెలుస్తోంది. ‘మీ పాకల్ని తాత్కాలికంగా తొలగించండి.. విచారణ పూర్తయ్యాక మళ్లీ వేసుకోవచ్చు. లేదంటే అంతా మునిగిపోతాం’ అంటూ ఒక ఉద్యోగి ఆక్రమణదారులతో కాళ్ల బేరానికి వచ్చినట్లు వినికిడి. ప్రస్తుతం విచారణాధికారిగా రానున్న స్క్వాడ్ డీఎఫ్ఓ బెనర్జీ గతంలో కొన్ని నెలలు ఇన్చార్జి డీఎఫ్ఓగా ఇక్కడ పనిచేశారు. దీంతో ఆయనకు జిల్లా అటవీశాఖపై కొంతమేర అవగాహన ఉంది. కాబట్టి ఆక్రమణలపై కాకమ్మ కథలు చెప్పి తప్పించుకున్నప్పటికీ క్వారీ అక్రమాల్లో దొరికిపోతామనే భయం అవినీతి అధికారుల్ని వెంటాడుతోంది. గాడితప్పిన పాలన... జిల్లా అటవీ శాఖలో పాలన పూర్తిగా గాడి తప్పింది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎఫ్‌ఓపై వచ్చిన అవినీతి, అక్రమాలపై ఆరోపణలు రుజువు కావడంతో ఆయన్ని సస్పెండ్ చేశారు. అటవీశాఖలో ఆ పరిస్థితిని మాత్రం చక్కదిద్దలేకపోయారు. అటవీ భూములకు ఎన్వోసీల దగ్గర నుంచి టింబర్ డిపోలకు పర్మిట్ల వరకు అధికారులు చేయి చాస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఇటీవలే చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో అటవీభూమి ఆక్రమణకు సంబంధించి ఎకరానికి రూ.20 వేలు చొప్పున ఉద్యోగులు వసూళ్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి. నూజివీడు, విజయవాడ డివిజన్ల పరిధిలో అటవీ భూములకు ఎన్వోసీలు జారీ చేసిన కొందరు అధికారులు లక్షలు గడించారనే ఆరోపణలు ఉన్నాయి. టింబర్ డిపో లెసైన్స్‌ల రెన్యువల్‌కు రూ.550 చెల్లించాల్సి ఉండగా ఒక్కో డిపో నుంచి రూ.5 వేలు చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కాసులిస్తేనే పర్మిట్ టింబర్ డిపోలకు ట్రాన్సిట్ పర్మిట్ జారీకి సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో పర్మిట్‌కు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. డిపోలో ఉన్న అమ్మకాలను బట్టి ఈ పర్మిట్లు జారీ చేయాల్సి ఉంటుంది. డీఎఫ్ఓ కార్యాలయంలో ఒక్కో పర్మిట్‌కు రూ.700 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సెక్షన్లో గత కొంతకాలంగా పాతుకుపోయిన ఉద్యోగే పర్మిట్ల వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారనే అభియోగాలు ఉన్నాయి. పర్మిట్ల మంజూరుకు సంబంధించి ప్రైవేటు బ్రోకర్లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముందని సమాచారం.