బడి పిల్లలు..బలహీనం | Release of Sports Village 12th Annual Health Report | Sakshi
Sakshi News home page

బడి పిల్లలు..బలహీనం

Published Wed, Jan 24 2024 4:47 AM | Last Updated on Wed, Jan 24 2024 4:47 AM

Release of Sports Village 12th Annual Health Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: షోషకాహారలోపం, శారీరక శ్రమ లేకపోవడంతో జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా బడి పిల్లలు బలహీనంగా తయారవుతున్నారు. దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ సామర్థ్యం తెలుసుకునేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూత్‌ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ స్పోర్ట్స్‌ విలేజ్‌ సర్వే చేసింది. 250 నగరాలు, పట్టణాల్లో 7 –17 ఏళ్ల వయసు ఉన్న 73 వేల మంది విద్యార్థులపై సర్వే చేసి, 12వ వార్షిక ఆరోగ్య నివేదిక విడుదల చేసింది. 

దక్షిణాది విద్యార్థులు బలంగానే.. 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లోని పిల్లల్లో ఛాతీ, శరీర కింది భాగం బలంగా ఉన్నాయి. ఉత్తర రాష్ట్రాల పిల్లల్లో బలహీనమైన బీఎంఐ, కీళ్లు, ఉదర కండరాలు సమస్యలున్నాయి. తూర్పు రాష్ట్రాల్లో బీఎంఐ, ఫ్లెక్సిబులిటీ, ఛాతీభాగం ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఇక పశ్చిమాది రాష్ట్రాల విద్యార్థులలో ఏరోబిక్‌ కెపాసిటీ, శరీర కింది భాగం, కీళ్ల కదలికలు మెరుగ్గా ఉన్నాయి. 

హైదరాబాద్‌ విద్యార్థులు హెల్తీ 
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నగరంలోని 58 శాతం విద్యార్థుల శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలుండగా, 49 శాతం మందికి బలమైన ఛాతీ, 84 శాతం సమర్థమైన ఉదర భాగాలున్నాయి. 46 శాతం మందిలో శరీర కింది భాగం బలంగా ఉండగా.. 64 శాతం పిల్లల్లో కీళ్ల కదలికలు చురుగ్గా ఉన్నాయి.

41 శాతం మందికి మెరుగైన ఏరోబిక్‌ సామర్థ్యం, 58 శాతం విద్యార్థుల్లో వాయురహిత జీర్ణక్రియ సమర్థంగా ఉంది. వారంలో రెండు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (పీఈ) తరగతులు ఉన్న స్కూళ్ల విద్యార్థుల్లో బలమైన ఛాతీ, ఉదర భాగంతో పాటు కండరాల కదలికలలో చురుకుదనం, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నాయి. 

అమ్మాయిలే ఆరోగ్యంగా.. 
అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఆరోగ్యంగా ఉన్నారు. 62 శాతం ఆడపిల్లల బీఎంఐ సూచీ ఆరోగ్యకరంగా ఉంది. 47 శాతం అమ్మాయిల్లో బలమైన ఛాతీభాగం, 70 శాతం మందికి కీళ్లు, శరీర కదలికల్లోనూ ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. అయితే 20 శాతం బాలికల్లో ఏరోబిక్‌ కెపాసిటీ, 37 శాతం మందిలో శరీర కింది భాగం బలంగా లేదు. 

ప్రభుత్వ పాఠశాల పిల్లలే బెటర్‌ 
ప్రైవేట్‌తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులే ఆరోగ్యంగా ఉన్నారు. వీరిలో బీఎంఐ, ఏరోబిక్‌ కెపాసిటీ, కీళ్ల కదలికలు ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. అయితే 43 శాతం ప్రైవేట్‌ స్కూల్‌ పిల్లల్లో మాత్రం ఛాతీ భాగం సౌష్టవంగా ఉంది.

గవర్నమెంట్‌ స్కూళ్ల విద్యార్థులలో 62 శాతం మందికి ఆరోగ్యకరమైన బీఎంఐ, 70 శాతం మందికి ఫ్లెక్సిబుల్‌ కీళ్లు, 73 శాతం పిల్లల్లో యాన్‌ఏరోబిక్‌ కెపాసిటీ, 31 శాతం మంది బలమైన ఛాతీ ఉంది. అదే ప్రైవేట్‌ పాఠశాలల పిల్లల్లో 58 శాతం మందికి బీఎంఐ, 64 శాతం ఫ్లెక్సిబుల్‌ కండరాలు, 55% యాన్‌ఏరోబిక్‌ కెపాసిటీ, 43 శాతం మంది విద్యార్థులకు ఛాతీభాగం బలంగా ఉంది. 

నివేదికలోని ముఖ్యాంశాలు 
♦ ప్రతీ ఐదుగురు పిల్లల్లో ఇద్దరి శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు (బాడీ మాస్‌ ఇండెక్స్‌– బీఎంఐ), వాయు రహిత జీర్ణక్రియ (యాన్‌ఏరోబిక్‌ కెపాసిటీ) ప్రక్రియ సరిగ్గా లేదు. 
♦  ఐదుగురిలో ఒకరికి స్వేచ్ఛగా కీళ్లు కదిలే సామర్థ్యం లేదు. 
♦  ముగ్గురికి గుండె, ఊపిరితిత్తుల కండరాలకుఆక్సిజన్‌ సరిగ్గా అందడం లేదు. 
♦ ముగ్గురిలో ఒకరికి ఉదర కండరాలు బలహీనంగా ఉన్నాయి. 
♦  ప్రతి ఐదుగురిలో ముగ్గురికి ఛాతీ భాగం బలహీనంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement