అక్రమార్కుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు | Bigustunna around the Irregulars trap | Sakshi
Sakshi News home page

అక్రమార్కుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Published Sat, Sep 28 2013 1:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM

Bigustunna around the Irregulars trap

పశ్చిమకృష్ణా, న్యూస్‌లైన్ : అటవీశాఖలో అవినీతి అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. కొత్తూరు రిజర్వు ఫారెస్ట్ అక్రమాలపై చీఫ్ కన్జర్వేటర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అక్రమార్కులు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజులుగా రాత్రి సమయాల్లో ఆక్రమణదారులతో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. నాలుగైదేళ్ల క్రితమే ఇళ్లు నిర్మించుకున్నామని లేఖలు రాయాల్సిందిగా ఆక్రమణదారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ససేమిరా అనేవారికి రూ.20 వేలు ఎదురిచ్చి మరీ లేఖలు రాయిస్తున్నారని తెలుస్తోంది.

‘మీ పాకల్ని తాత్కాలికంగా తొలగించండి.. విచారణ పూర్తయ్యాక మళ్లీ వేసుకోవచ్చు. లేదంటే అంతా మునిగిపోతాం’ అంటూ ఒక ఉద్యోగి ఆక్రమణదారులతో కాళ్ల బేరానికి వచ్చినట్లు వినికిడి. ప్రస్తుతం విచారణాధికారిగా రానున్న స్క్వాడ్ డీఎఫ్‌ఓ బెనర్జీ గతంలో కొన్ని నెలలు ఇన్‌చార్జి డీఎఫ్‌ఓగా ఇక్కడ పనిచేశారు. దీంతో ఆయనకు జిల్లా అటవీశాఖపై కొంతమేర అవగాహన ఉంది. కాబట్టి ఆక్రమణలపై కాకమ్మ కథలు చెప్పి తప్పించుకున్నప్పటికీ క్వారీ అక్రమాల్లో దొరికిపోతామనే భయం అవినీతి అధికారుల్ని వెంటాడుతోంది.

 గాడితప్పిన పాలన...

 జిల్లా అటవీ శాఖలో పాలన పూర్తిగా గాడి తప్పింది. గతంలో  ఇక్కడ పనిచేసిన డీఎఫ్‌ఓపై వచ్చిన అవినీతి, అక్రమాలపై  ఆరోపణలు రుజువు కావడంతో ఆయన్ని సస్పెండ్ చేశారు. అటవీశాఖలో ఆ పరిస్థితిని మాత్రం చక్కదిద్దలేకపోయారు. అటవీ భూములకు ఎన్‌వోసీల దగ్గర నుంచి టింబర్ డిపోలకు పర్మిట్ల వరకు అధికారులు చేయి చాస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.

ఇటీవలే చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో అటవీభూమి ఆక్రమణకు సంబంధించి ఎకరానికి రూ.20 వేలు చొప్పున  ఉద్యోగులు వసూళ్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి. నూజివీడు, విజయవాడ డివిజన్ల పరిధిలో అటవీ భూములకు ఎన్‌వోసీలు జారీ చేసిన కొందరు అధికారులు లక్షలు గడించారనే ఆరోపణలు ఉన్నాయి. టింబర్ డిపో లెసైన్స్‌ల రెన్యువల్‌కు రూ.550 చెల్లించాల్సి ఉండగా ఒక్కో డిపో నుంచి రూ.5 వేలు చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.
 
కాసులిస్తేనే పర్మిట్

 టింబర్ డిపోలకు ట్రాన్సిట్ పర్మిట్ జారీకి సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో పర్మిట్‌కు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. డిపోలో ఉన్న అమ్మకాలను బట్టి ఈ పర్మిట్లు జారీ చేయాల్సి ఉంటుంది. డీఎఫ్‌ఓ కార్యాలయంలో ఒక్కో పర్మిట్‌కు రూ.700 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సెక్షన్‌లో గత కొంతకాలంగా పాతుకుపోయిన ఉద్యోగే పర్మిట్ల వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారనే అభియోగాలు ఉన్నాయి. పర్మిట్ల మంజూరుకు సంబంధించి ప్రైవేటు బ్రోకర్లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముందని సమాచారం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement