అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం గురించి ఎవరికి తెలుసు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రట్ల తరఫున పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ వారం రోజుల క్రితం హఠాత్తుగా జబ్బు పడడంతో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఆరోగ్య నివేదికలను ముందుగానే విడుదల చేయాలా, వద్దా? అన్న అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. హిల్లరీ క్లింటన్‌కు నిమోనియా సోకిందని ఆమె ఫిజిషియన్ ఇటీవల ధ్రువీకరించడం, దాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా ఆమెపై రిజబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వాడుకుంటున్న విషయం తెల్సిందే.
నాలుగేళ్లపాటు అమెరికా అధ్యక్షుడిగా అత్యున్నత స్థానంలో విధులు నిర్వర్తించాల్సిన వ్యక్తి శారీరకంగాను, మానసికంగాను ఆరోగ్యవంతుడై ఉండాలనేది అందరూ అంగీకరించే విషయమే. దేశాధ్యక్షుడికైనా, సామాన్య పౌరుడికైనా ఫెడరల్ ప్రైవసి చట్టాలు ఒకేలా వర్తిస్తాయి కనుక వారి ఆరోగ్య వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నది కొందరి వాదన. సైనికులకు, పైలెట్లకు ఫిట్‌నెస్ పేరిట నియామకాల కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే తప్పేమిటీ? అన్న మరో వాదన ఉంది.
ఈ రెండో వాదన ప్రకారం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులకు అమెరికా ఫిజీషియన్స్ కాలేజీ నుంచి ఎంపిక చేసిన స్వతంత్య్ర బృందంతోని ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఓ ఉన్నతస్థాయి వైద్యుల బృందం 2008లోనే అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ఇప్పటికీ అది అధికారికంగా అమలు కావడం లేదు. కలుషితమైన నేటి రాజకీయాల్లో ఈ సిఫార్సును అమలు చేయడం కుదరదని, ఆరోగ్య నివేదికను రాజకీయ ప్రత్యర్థులు స్వప్రయోజనాల కోసం ఉపయోగించునే ప్రమాదం ఉందని ఉన్నతస్థాయి వైద్యుల బృందంలో ఉన్న డాక్టర్ మరియానే వ్యాఖ్యానించడం గమనార్హం.
పైగా, విప్లవాత్మక మార్పులు వస్తున్న ఆధునిక వైద్య విధానంలో ఫిట్‌నెస్ ప్రమాణాలను నిర్ధారించడం కూడా క్లిష్టమవుతుందని కొందరి వైద్యుల వాదన. చిన్న రోగాల నుంచి అభ్యర్థులు త్వరలోనే కోలుకునే అవకాశం ఉంటుందని, అల్జీమర్స్ లాంటి జబ్బులు వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని వారంటున్నారు. అల్జీమర్స్ జబ్బు బయటపడడానికి 30 ఏళ్ల ముందే సోకుతుందనే విషయం ఇటీవల తెల్సిందని, అలాంటి వ్యక్తులు కూడా నాలుగేళ్లపాటు సమర్థంగా విధులు నిర్వర్తించే అవకాశాలు ఉంటాయని కూడా వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. నాలుగేళ్లపాటు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని వైద్య నిపుణులు నిర్ధారించే అవకాశాలున్నాయి. అయితే అప్పుడు కూడా డాక్టర్ల నివేదికలను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం అభ్యర్థులకు ఉండదా? అన్న మరో ప్రశ్న తలెత్తుతోంది.
ఇంతవరకు అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన ఎంతోమంది నాయకులు తమ ఆరోగ్య వివరాలను ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచిన విషయాలు తెల్సిందే. వారిలో ఒకరిద్దరు అనారోగ్యంతో పదవిలో ఉండగానే మరణించారు కూడా. ఇప్పటివరకు అమెరికాను పాలించిన 44 మంది దేశాధ్యక్షుల్లో 18 మంది తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఎక్కువ మంది మానసిన ఒత్తిడిలు, ఆందోళనలు, బైపోలార్ జబ్బులు, క్యాన్సర్తలో బాధపడ్డారు. అమెరికా అధ్యక్షుల్లో అందరికంటే ఆరోగ్యవంతుడిగా, యువకుడిగా భావించిన జాన్ ఎఫ్ కెన్నడీ 43 ఏళ్ల వయస్సులోనే ‘హైపోథైరాయిడ్, బ్యాక్ పెయిన్, ఆడిసన్స్ డిసీస్’ లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు.
రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అల్జీమర్స్ వ్యాధినపడ్డారు. అప్పుడు ఆయన సమర్థంగా విధులు నిర్వర్తించగలిగారా, లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమే. గ్రోవర్ క్లెవలాండ్‌కు క్యాన్సర్ వచ్చింది. ఆయన యాట్‌పై సముద్ర జలాల్లోకి వెళ్లి రహస్యంగా వైద్య బృందాన్ని పిలుపించుకొని నోటి పైభాగంలో పెరిగిన ట్యూమర్‌ను తొలగించుకున్నారు. 2000 సంవత్సరం నాటి వరకు దేశాధ్యక్షులుగా పోటీ చేసిన వారు ఎవరూ స్వచ్ఛందంగా తమ ఆరోగ్య వివరాలను వెల్లడించలేదు. 2000, 2008లో పోటీ చేసిన సెనేటర్ జాన్ మకెయిన్ ఆరోగ్య వివరాలను తొలుత వెల్లడించారని చెప్పవచ్చు.
ఇప్పుడు దేశాధ్యక్షులుగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌లు కూడా తమ ఆరోగ్య వివరాలను వెల్లడించారు. అయితే వారు వెల్లడించింది ఎంపిక చేసుకున్న కొన్ని వివరాలు మాత్రమే. హిల్లరీకి నిమోనియా సోకిందనే వార్త తెలియగానే ఆమెకన్నా, అందరికన్నా తాను ఆరోగ్యవంతుడునని డోనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో ఆయనకే తెలియాలిగానీ, ఇప్పటివరకు దేశాధ్యక్షులుగా పోటీ చేసిన వారందరికన్నా ట్రంప్ ఆరోగ్యవంతుడని, దేశాధ్యక్ష పదవికి ఆయన సమర్థుడని ఆయన ఫిజీషియన్ డాక్టర్ హరాల్డ్ చెప్పడం రాజకీయంగా వివాదం రేపింది. ఆయన తన వృత్తికి పరిమితం కాకుండా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంతకు దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారికి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలా లేదా వారే తమ ఆరోగ్య వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించాలా? అన్న ప్రశ్న ఇప్పటికీ సశేషమే.