ప్రమాద ఘంటికలు
''భయమేస్తుందని హారర్ సినిమాలు చూడ్డం మానేస్తామా'' అని ఈ మధ్య వచ్చిన ఓ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ వీడియో చూస్తే ఆ డైలాగ్ గుర్తుకు రావడం ఖాయం. భూగోళంపైని అన్ని భాగాలు రంగు రంగుల్లో కనిపిస్తున్నాయి.. బాగానే ఉంది కదా అనుకుంటున్నారా? చూసేందుకు బాగానే ఉంటుంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తీసిన ఈ త్రీడీ వీడియో.. అందులో విషయం తెలిస్తే మాత్రం కొంచెం డీలా పడటం ఖాయం.
పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను మండించడం, అడవులను విచ్చల విడిగా నరికేయడం వంటి అనేకానేక చర్యల వల్ల భూమి వేడెక్కుతోందని, దానివల్ల అనేక ప్రమాదాలు ముంచుకొస్తాయని మీరూ వినే ఉంటారు. ఈ విపత్తుకు కారణమైన విషవాయువు అదేనండి.. కార్బన్‌డైయాక్సైడ్ భూ వాతావరణంలో ఎలా విస్తరిస్తుందో చూపుతుంది ఈ వీడియో.
ధ్రువ ప్రాంతాల్లోని నీలాల రంగు వాతావరణంలో తక్కువ మోతాదులో కార్బన్ డై యాక్సైడ్ ఉన్న విషయాన్ని సూచిస్తూంటే.. జనావాసాలు ఉన్న చోట కనిపించే పసుపు, నారింజ, ఎరుపు రంగులు ఈ వాయువు మనకు ముప్పు తెచ్చే స్థాయిలో ఉన్న విషయాన్ని చెబుతోంది. ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ -2 శాటిలైట్ ద్వారా 2014 నుంచి సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి సిద్ధమైంది ఈ వీడియో. ఇటీవలే విడుదలైన ఈ వీడియో ఇప్పటికే నెట్‌లో వైరల్ స్థాయికి చేరుకుంది. మహా సముద్రాలు, చెట్టూ చేమ వీలైనంత పీల్చేసుకున్న తరువాత కూడా వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్ డైయాక్సైడ్ వాయువులు ఉండటం శాస్త్రవేత్తల్లోనే కాదు... మనకూ ప్రమాద ఘంటికలే!