ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ వార్మింగ్... గత కొన్నేళ్లుగా వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తోంది. ఎలాగైనా భూతాపాన్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపుకి పరిమితం చేయాలి. అదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న సవాల్.. దీని కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కొన్నాళ్ల క్రితం వచ్చిన ఒక అనూహ్యమైన ఆలోచన సూర్యరశ్మిని తగ్గించడం.. ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అందులోనుంచి వెలువడే బూడిద ఆకాశం అంతా ఆవరించుకుంటే సూర్య కాంతి తక్కువై భూతాపం తగ్గుతుంది. అందుకే కృత్రిమంగా అగ్నిపర్వతాలు పేల్చడానికి అభివృద్ధి చెందిన దేశాలు, హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే తరహాలో ఆకాశంపై రసాయనాలను ఒక పొరలా ఏర్పడేలా చేస్తే సూర్యరశ్మిని తగ్గించవచ్చన్న ఆలోచనతో అభివృద్ధి చెందుతున్న దేశాలు ముందుకు వచ్చాయి. సూర్యరశ్మిని తగ్గించడం ద్వారా వాతావరణంలో మార్పులు తీసుకురావడం (సోలార్ జియో ఇంజనీరింగ్) పై పరిశోధనలకు నడుం బిగించాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల మానవాళికి మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఎక్కువగా విలవిలలాడిపోతున్నవి అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలే.. భూతాపాన్ని తగ్గించడానికి 2015 సంవత్సరంలో 200 దేశాల మధ్య పారిస్ ఒప్పందం కుదిరినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు వీసమెత్తు చర్యలు కూడా తీసుకోవడం లేదు. దీంతో ఆ భారం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల మీదే పడింది. భారత్, బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, ఇథియోపియా,జమైకా, థాయ్‌ల్యాండ్‌కు చెందిన 12 మంది రీసెర్చ్ స్కాలర్లు భూతాపం తగ్గాలంటే సూర్యుడి కాంతిని తగ్గించే చర్యలు చేపట్టడమే మార్గమని అంటున్నారు. దీనికి సంబంధించి నేచర్ జర్నల్‌లో తమ అభిప్రాయాలను ఒక వ్యాసంలో పొందుపరిచారు. సోలార్ జియో ఇంజనీరింగ్‌పై పరిశోధనల నిమిత్తం ఈ శాస్త్రవేత్తలకి ఆర్థిక సాయం అందించడానికి సోలార్ రేడియేషన్ మేనేజ్‌మెంట్ గవర్నెన్స్ ఇనీషియేటివ్ అనే సంస్థ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకి 4 లక్షల డాలర్లు వ్యయం అవుతుందని అంచనా. సోలార్ జియో ఇంజనీరింగ్ వల్ల ప్రాంతాల వారీగా ఏర్పడే ప్రభావాలపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు
సూర్యరశ్మిని ఆపడం సాధ్యమేనా ?
రసాయనాలతో ఒక షేడ్‌ను ఏర్పాటు చేయడం వల్లో, అగ్నిపర్వతాన్ని కృత్రిమంగా బద్దలయ్యేలా చేయడం ద్వారా లేదంటే మేఘాలపై సల్ఫర్‌ని జల్లడం వల్లో సూర్యుడి నుంచి వచ్చే వెలుతుర్ని తగ్గించడం సాధ్యమేనా ? సాంకేతికంగా ఇది చేయగలరా ? అలా చేసినా వాతావరణంలో ఆశించిన మార్పులు వస్తాయా ? అన్న సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ నిపుణుల బృందం సోలార్ జియో ఇంజనీరింగ్‌పై అనుమానాలే వ్యక్తం చేసింది.
ఆర్థికంగా, సామాజికంగా, సంస్థాగతంగా ఇది సాధ్యం కాదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అయితే కొత్తగా పరిశోధనలు మొదలుపెట్టనున్న శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పట్నుంచి దీని పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేమని అంటున్నారు. ‘ సోలార్ జియో ఇంజనీరింగ్ అన్నది వెర్రి ఆలోచన అని ఒకప్పుడు అనుకున్నప్పటికీ, ఇప్పుడిప్పుడే ఇదే పరిష్కారం అన్న అభిప్రాయం అందరిలోనూ పాతుకుపోతోంది‘ అని వ్యాస రచయిత, బంగ్లాదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ చీఫ్ అతిక్ రెహ్మాన్ చెబుతున్నారు.
కర్బన ఉద్గారాలను తగ్గించడంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ పూర్తిగా విఫలం కావడం వల్ల ఇక ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని, అందుకే రిస్క్ తీసుకొనే రసాయనాల పూతతో సూర్య రశ్మిని తగ్గించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని అంటున్నారు.
- (సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment