పాతాళంలో గంగ!
భారీగా పడిపోతున్న భూగర్భజలాలు
నిండు వేసవిని తలపిస్తున్న నీటిమట్టాలు
గతేడాదితో పోలిస్తే 3.84మీటర్ల లోతుకు పతనం
సరిగ్గా ఏడు నెలల క్రితం.. మేలో భూగర్భ జలమట్టం
14.96 మీటర్లు.. నవంబర్ నెలాఖరులో
నమోదైన భూగర్భ నీటిమట్టం 15.20 మీటర్లు..
అంటే ఎండాకాలంలోకంటే మరింత లోతుకు
పాతాళగంగపడిపోయింది.
ఈ నేపథ్యంలో వచ్చే వేసవినాటికి ఈ
మట్టాలు ఎలా ఉంటాయన్న
విషయాన్ని ఊహించడమే కష్టంగా ఉంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాతాళంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నడివేసవికి ఇంకా ఆరు నెలల సమయమున్నప్పటికీ.. భూగర్భంలో జలసిరి ఆందోళనకరంగా మారింది. సాధారణంగా నిండు ఎండాకాలంలో భూగర్భజలాలు అట్టడుగు స్థాయికి పడిపోతాయి. కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. వేసవి సీజన్‌లో కంటే మరింత లోతుకు భూగర్భజలాలు పతనమయ్యాయి. ఈ ఏడాది మే నెలలో భూగర్భంలో జలమట్టం 14.96 మీటర్లు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడాల్సి ఉండగా.. మరింత అడుగుకు పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ నెలాఖరు నాటికి జిల్లాలో సగటు భూగర్భ జలాల లోతు ఏకంగా 15.20మీటర్ల లోతుకు పడిపోయినట్లు ఆ శాఖ తాజాగా వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ నెలలో 3.84మీటర్ల లోతుకు పడిపోయాయి.
లోటు వర్షపాతం... లోపలికి జలం..
జిల్లాలో ఆరు నెలలుగా భూగర్భజలాలు క్రమంగా పతనమవుతున్నాయి. సాధారణంగా వేసవిలో లోతుకు పడిపోయినప్పటికీ.. ఆ తర్వాత కురిసిన వర్షాలతో పైకివస్తాయి. కానీ ఈ సారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పాతాళగంగ లోలోపలికి పోతోంది. నాలుగు నెలలుగా పరిశీలిస్తే సగటున ప్రతినెలా అరమీటరు లోతుకు పడిపోతున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. గత ఖరీఫ్ సీజన్ ముగిసే నాటికి జిల్లాలో 58.3సెంటీమటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 29.1 సెంటీమీటర్లే కురిసింది. ప్రస్తుత రబీ సీజన్‌లో 28సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటికీ చినుకుజాడ లేదు. వర్షపాతలోటు.. దానికితోడు భూగర్భజలాల వినియోగం పెరగడంతో నీటిమట్టాలు రోజురోజుకు పడిపోతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో అధ్వానం..
జిల్లాలో అన్నిచోట్ల భూగర్భజలాల తీరు ఆందోళన కరంగానే ఉంది. గ్రామీణ మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాగుకు, తాగునీటికి రెండు విధాలా భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతుండడంతో నీటిమట్టాలు భారీగా పడిపోతున్నాయి. బంట్వారం మండలంలో సగటు మట్టం 38.07మీటర్లుగా నమోదైంది. మొయినాబాద్ మండలంలో 27.01 మీటర్లు, మర్పల్లిలో 23.50మీటర్లు, మల్కాజ్‌గిరి, మహేశ్వరం మండలాల్లో 20మీటర్లకంటే ఎక్కువ లోతులో జలమట్టాలు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ నెలలో బంట్వారం మండలంలో 23.30 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పతనం కావడం గమనార్హం. ఇక కీసర, శేరిలింగంపల్లి మండలాల్లో భూగర్భంలో రాళ్లురప్పలు తేలినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి.