‘దుమ్ము’.. ప్రాణాలను దులిపేస్తోంది! | Global warming effects | Sakshi
Sakshi News home page

‘దుమ్ము’.. ప్రాణాలను దులిపేస్తోంది!

Published Sun, May 27 2018 1:48 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

Global warming effects  - Sakshi

వరద ముంచెత్తితే ప్రాణాలు పోవడం తెలుసు.. పిడుగు పాటుకు గురై మరణించడమూ తెలుసు..కానీ దుమ్ము, ధూళి కూడా ప్రాణాలు తీసుకుంటుంటే.. ఒక్కసారిగా తుపానులా.. పిడుగులు కురిపిస్తూ విరుచుకుపడితే.. మనిషి మీద ప్రకృతి పగబట్టిందా అనిపిస్తోంది. ఉత్తర భారతదేశంలో ఈ నెల మొదట్లో ‘ధూళి’ తుపాన్లు వందలాది మందిని బలిగొన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పదుల ప్రాణాలు తీశాయి. మరి ఈ ఘటనలు దేనికి సూచిక? కారణాలేమిటి? భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?

ఏటికేడాదీ వేసవి తాపం పెరిగిపోతోంది. 2015 నుంచి ఏటా ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాయి. మరి దీనికి.. ధూళి తుపానులు, పిడుగుల వర్షానికి సంబంధమేంటి? అనుకుంటున్నారా.. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ గాలిలో, భూ ఉపరితలంపై ఉండే మట్టిలో తేమ తగ్గిపోతుంది. దాంతో చిన్నగాలికి కూడా ఎక్కువ దుమ్ము, ధూళి పైకి లేస్తుంది. అదే బలమైన గాలులు వీస్తే.. ధూళి తుపానులే చెలరేగుతాయి.

భూతాపం పెరిగిపోతూనే ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూళి తుపాన్ల పరిస్థితినే గమనిస్తే... ప్రపంచవ్యాప్తంగా గత ఐదేళ్లలో వీటి తీవ్రత, విస్తృతి, ప్రభావం మూడూ భారీగా పెరిగాయని అమెరికా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లో జరిగిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల వడగాడ్పులు, ధూళి తుపాన్లు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఈసారి తీవ్రత ఎక్కువే..
ఎండా కాలంలో ధూళి తుపానులు చెలరేగడం మామూలుగానే జరుగుతుందని.. కానీ ఈ ఏడాది ఘటనలు మాత్రం చాలా తీవ్రమైనవని భారత వాతావరణ పరిశోధన సంస్థ కూడా అంగీకరిస్తోంది. ఈ పరిస్థితిని పూర్తిస్థాయిలో విశ్లేషించేందుకు మరిన్ని పరిశోధనల అవసరముందని చెబుతోంది.

ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. గాలిలో తేమ తగ్గి, వేడి పెరిగి వాతావరణంలో పైపైకి చేరుతుంది. ఆ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పీడనం తగ్గిపోతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో అధిక పీడనం ఉండటంతో.. ఆయా ప్రాంతాల నుంచి గాలి వేగంగా తక్కువ పీడనం ఉన్న ప్రాంతంవైపు వీస్తుంది. వేడి మరీ ఎక్కువగా ఉండి, పీడనం బాగా తగ్గిపోతే... ఇలా చుట్టూరా ఉన్న ప్రాంతాల నుంచి వీచే గాలి చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఇది తుపానుకు దారితీస్తుంది.

కొంత తేమ ఉంటే.. పిడుగులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విపరీతంగా పిడుగులు పడటాన్ని ప్రస్తావిస్తూ.. ధూళి తుపాన్లకు, వీటికి పెద్దగా తేడా లేదని భారత వాతావరణ శాస్త్రవేత్త ఒకరు విశ్లేషించారు. గాలిలో కొద్దోగొప్పో తేమ ఉన్న ప్రాంతాల్లో పిడుగులు పడితే.. లేని చోట్ల ధూళి తుపాన్లు ఏర్పడుతూంటాయని వివరించారు. ఈ నెల రెండో తేదీన రాజస్తాన్‌లోని అధిక ఉష్ణోగ్రతలకు, పశ్చిమ గాలులు తోడవడంతో ధూళి తుపాన్లు చెలరేగాయని చెప్పారు.

ఇక బంగాళాఖాతం మీదుగా తేమను మోసుకొస్తున్న గాలులు ఉరుములు, పిడుగులకు కారణమయ్యాయని వివరించారు. గత కొద్ది రోజుల్లో తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా ధూళి తుపాన్లు, పిడుగుల కారణంగా 124 మందికిపైగా మరణించడం, 300 మందికిపైగా గాయపడటం తెలిసిందే. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వంటివి ఈ అసాధారణ పరిస్థితులకు కారణమవుతున్నాయని చెబుతున్నారు.

భూమ్మీద 1880 నుంచి ఉష్ణోగ్రతల వివరాలు నమోదు చేస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల జాబితాలో 2017 రెండోస్థానంలో ఉండగా.. 2018 ఐదో స్థానంలో ఉంది.
 మన దేశంలో వరదలు, తుపాన్లు, వడగాడ్పుల కంటే పిడుగుల వల్ల మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి.
 2015లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన వారి సంఖ్య దాదాపు 10,510. ఇందులో పిడుగుపాటుకు మరణించినవారే 2,600 మంది వరకు ఉండటం గమనార్హం. దేశంలో పిడుగుల వల్ల సగటున ఏటా సుమారు రెండువేల మందికిపైగా మరణిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement